
ఉగాది ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో గురువారం నుంచి ఈ నెల 31వ తేదీ వరకు ఉగాది మహోత్సవాల నేపథ్యంలో దేవస్థానం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. భక్తులకు సేదతీరేందుకు పలుచోట్ల చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. బసవవనం, బాలగణేశవనం, శివదీక్షా శిబిరాలు, రుద్రాక్షవనం, ఆలయ మాడవీధులు, మల్లమ్మ కన్నీరు, పలు ఆరుబయలు ప్రదేశాల్లో చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు. అలాగే కాలినడకన వచ్చే మార్గంలో నాగలూటి, దామర్లగుంట, పెచ్చెర్వు, కై లాసద్వారం, హఠకేశ్వరం పలుచోట్ల చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. కాలిబాటలోని నాగలూటి, పెద్దచెరువు, కై లాసద్వారం మొదలైనచోట్ల జనరేటర్లను ఏర్పాటు చేసి తాత్కాలిక విద్యుద్దీకరణ ఏర్పాటు చేశారు. రోజు రోజుకు పెరుగుతున్న కన్నడ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నీటిసరఫరాకు అవసరమైన చర్యలు చేపట్టారు. రోజుకు 1.36 కోట్ల లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నారు. భీమునికొలను–కై లాసద్వారం వద్ద 1000 లీటర్ల సామర్థ్యం కలిగిన 6 సింటెక్స్ ట్యాంకులను ఏర్పాటు చేశారు.
ఏర్పాట్లు ఇలా..
● దేవస్థానం అన్నదాన భవనంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేస్తున్నారు. క్యూలైన్లలో వేచిఉన్న భక్తులకు నిరంతరం అల్పాహారాన్ని అందిస్తున్నారు. అలాగే కై లాసద్వారం, సాక్షిగణపతి, హఠకేశ్వరం, క్షేత్రపరిధిలోని పలుచోట్ల కన్నడ భక్తబృందాలు చేస్తున్న అన్నదాన కార్యక్రమాలకు దేవస్థానం సహకారం అందిస్తోంది.
● జిల్లా వైద్యశాఖ సహకారంతో దేవస్థాన వైద్యశాల, ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ద్వారా నిరంతరం వైద్యసేవలు అందిస్తున్నారు. కై లాసద్వారం, హఠకేశ్వరం, క్యూకాంప్లెక్స్, ఆలయ మహాద్వారం మొదలైనచోట్ల తాత్కాలిక వైద్యశిబిరాలు.
● ఆర్టీసీ బస్టాండ్ వెనుకభాగం, యజ్ఞవాటిక, ఔటర్‌రింగ్‌రోడ్డు, గణేశ సదనం ఎదురుగా, హెలిప్యాడ్ వద్ద, దేవస్థానం ఆగమ పాఠశాల పలుచోట్ల వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేశారు.
● పారిశుద్ధ్య పనులకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో మాదిరిగానే సిబ్బందిని నియమించారు. క్షేత్రపరిధిలోని 500 శాశ్వత మరుగుదొడ్లు, పలుచోట్ల తాత్కాలిక మరుగుదొడ్లు అందు బాటులో ఉంచారు.
శ్రీగిరికి భారీగా చేరుకుంటున్న
కన్నడ భక్తులు
ఆరుబయలు ప్రదేశాల్లో
తాత్కాలిక వసతి
పాదయాత్ర భక్తుల కోసం
భీమునికొలను వరకు
తాగునీటి సరఫరా

ఉగాది ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు