పాస్‌.. అయినా ఫెయిల్‌! | - | Sakshi
Sakshi News home page

పాస్‌.. అయినా ఫెయిల్‌!

Published Sun, Jun 23 2024 12:46 AM | Last Updated on Sun, Jun 23 2024 12:46 AM

పాస్‌

సీడ్‌ ఆర్గనైజర్ల బరితెగింపు.. రైతులకు కుచ్చుటోపీ

విత్తనాలు సరిగ్గా ఉన్నా.. విఫలమయ్యాయంటూ బురిడీ

ఏటేటా మోసపోతున్న విత్తన పత్తి సాగుదారులు

మరోవైపు నకిలీ విత్తులతో రైతుల జీవితాలతో చెలగాటం

ఇది చాలదంటూ పలు చోట్ల సీడ్‌ మాఫియా జులుం

ముక్కుపిండి బకాయిల వసూలు.. రైతుల గగ్గోలు

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: విత్తన చట్టంలో లోపాలు.. అధికార యంత్రాంగంలో కొరవడిన సామాజిక స్పృహ, పర్యవేక్షణ.. పలువురు రాజకీయ నేతల ధనదాహం వెరసి సీడ్‌ ఆర్గనైజర్ల దందా ఉమ్మడి పాలమూరు జిల్లాలో మూడు పువ్వులు ఆరు కాయలన్నటు ్ల కొనసాగుతోంది. ప్రధానంగా నడిగడ్డగా పేరొందిన జోగుళాంబ గద్వాల జిల్లాలో మాఫియాగా ఏర్పడిన సీడ్‌ ఆర్గనైజర్లు ఓ వైపు ఫెయిల్యూర్‌ విత్తనాలే కీలకంగా రాష్ట్ర నలుమూలలా యథేచ్ఛగా విక్రయిస్తూ రైతుల జీవితాలతో చెలగాటమాడుతోంది. మరోవైపు సాగు చేసిన సీడ్‌ పాస్‌ అయినా..ఫెయిల్‌ అయినట్లు బురిడీ కొట్టించి మోసాలకు పాల్పడుతూ రైతులను అధఃపాతాళంలోకి నెడుతోంది.

ఆర్గనైజర్లే సూత్రధారులు

కంపెనీలు, రైతులకు మధ్య సీడ్‌ ఆర్గనైజర్‌ వ్యవస్థ కొనసాగుతోంది. రైతులకు ఆర్గనైజర్లు సీడ్‌ విత్తనాలతో పాటు అప్పులు ఇస్తారు. జర్మినేషన్‌ తర్వాత రైతులు విత్తనాలను ఆయా ఆర్గనైజర్లకు ఇస్తారు. ఆర్గనైజర్లు కంపెనీలకు విత్తనాలు పంపిస్తారు. ల్యాబ్‌లో పరీక్షల అనంతరం ఆర్గనైజర్ల వారీగా పాస్‌, ఫెయిల్‌ అయిన విత్తనాల వివరాలను కంపెనీలు అందజేస్తాయి. విత్తనాలు నాణ్యమైనవని తేలితే ఆర్గనైజర్లు అప్పు పట్టుకుని మిగిలిన డబ్బులను రైతులకు చెల్లిస్తారు. ఫెయిల్‌ అయితే రైతులు తిరిగి వారికే అప్పు చెల్లించాలి. ఈ వ్యవస్థ జిల్లాలో మూడు దశాబ్దాలుగా కొనసాగుతోంది. సీడ్‌ పత్తి విత్తన చట్టం ప్రకారం ఫెయిల్‌ అయిన విత్తనాలను కంపెనీలు, ఆర్గనైజర్లు ఆయా రైతులకు ఇవ్వాలి. వ్యవసాయ అధికారుల సమక్షంలో బ్రోకెన్‌ (పగలగొట్టి) చేసి అందజేయాలి. ఇలా ఎక్కడా జరిగిన దాఖలాలు లేవు. ఫెయిల్‌ అయిన విత్తనాలను ఆర్గనైజర్లే తమ వద్ద నిల్వ చేసుకుంటున్నారు. ఎవరైనా రైతులు కావాలని పట్టుబడితే నామమాత్రంగా కిలోకు రూ.200 మించకుండా డబ్బులు ఇచ్చి పంపిస్తున్నారు. ఫెయిల్‌ అయిన విత్తనాలను ఆర్గనైజర్లు 20 శాతం మంది రైతులకు కూడా ఇవ్వడం లేదని తెలుస్తోంది.

ఇటు మోసం.. అటు వ్యాపారం

సాగు చేసిన పత్తి సీడ్‌ పాస్‌ అయినా.. ఫెయిలయ్యాయంటూ రైతులకు చెల్లించాల్సిన లక్షలాది రూపాయలను సీడ్‌ ఆర్గనైజర్లు వెనకేసుకుంటున్నారు. అమాయక రైతులే టార్గెట్‌గా మోసాలకు పాల్పడుతున్నారు. మరోవైపు ఇదే క్రమంలో ఫెయిల్‌ అయిన విత్తనాలను ఆర్గనైజర్లు రంగులద్ది లూజ్‌గా కిలోకు రూ.750కి అటు ఇటుగా బహిరంగ మార్కెట్‌లో విక్రయిస్తూ రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారు. నడిగడ్డలో సీడ్‌ ఆర్గనైజర్లు, సబ్‌ ఆర్గనైజర్లు 400 మంది వరకు ఉండగా.. సీడ్‌ పత్తి విత్తన సాగు సుమారు 40 వేల ఎకరాల్లో కొనసాగుతోంది. ప్రతి ఏటా జిల్లాలో సగటున రూ.2 వేల కోట్ల సీడ్‌ పత్తి విత్తన వ్యాపారం జరుగుతోంది. ఇందులో 20 నుంచి 30 శాతం నకిలీ విత్తన దందా చోటుచేసుకుంటున్నట్లు రైతు సంఘాల అంచనా.

ఈ ఫొటోలోని రైతు పేరు బూదెప్ప. మల్దకల్‌ మండలం అడవిరావుల చెరువు గ్రామానికి చెందిన ఆయన గతేడాది ఖరీఫ్‌లో తనకున్న ఎకరా వ్యవసాయ భూమిలో ఓ

కంపెనీకి చెందిన విత్తన పత్తి సాగు చేశాడు. పంట చేతికొచ్చిన తర్వాత తనకు సీడ్‌ ఇచ్చిన ఆర్గనైజర్‌కు చెప్పి.. ఆయన సూచన మేరకు జిన్నింగ్‌ మిల్లుకు తరలించాడు. జిన్నింగ్‌ అయిన తర్వాత వచ్చిన విత్తనాలను సదరు కంపెనీకి అందజేశాడు. అనంతరం సీడ్‌ ఆర్గనైజర్‌.. సదరు రైతు వద్దకు వచ్చి సీడ్‌ సక్రమంగా లేదని, ఫెయిల్‌ అయినట్లు చెప్పాడు. దీంతో బూదెప్ప అయ్యో అని తలపట్టుకున్నాడు. అనుమానంతో మూడు నెలల తర్వాత కంపెనీకి వెళ్లి ఫెయిల్‌ అయిన లాట్‌ నంబర్‌పై ఆరా తీశాడు. తాను సాగు చేసిన సీడ్‌ విత్తనాలు పాస్‌ అయ్యాయని తెలుసుకున్నాడు. ఆ వెంటనే ఆయన సీడ్‌ ఆర్గనైజర్‌ వద్దకు వెళ్లి నిలదీశాడు. ఆధారాలతో సహా ముందు పెట్టడంతో సదరు ఆర్గనైజర్‌ రూ.3 లక్షలు చెల్లించాడు. ఈ విషయం ఎవరితో చెప్పొద్దని ఆర్గనైజర్‌ బతిమాలడంతో శాంతించిన బూదెప్ప ఇంటి ముఖం పట్టాడు.

...ఇది ఒక్క ఆ రైతుకు సంబంధించి మాత్రమే కాదు. ఇలా ఏటేటా వేలాది మంది విత్తన పత్తి సాగుదారులు సీడ్‌ ఆర్గనైజర్ల చేతిలో నిలువునా మోసపోతూనే ఉన్నారు. అడ్డుకునే వారే లేకపోవడంతో ధనదాహంతో పలువురు సీడ్‌ ఆర్గనైజర్లు మాఫియాగా ఏర్పడి బరితెగించి.. రైతులకు కుచ్చుటోపీ పెడుతూనే ఉన్నారు. ఇది చాలదంటూ సాగు కోసం తమ వద్ద తీసుకున్న అప్పు రాబట్టుకునేందుకు పేద రైతుల వద్ద జులుం ప్రదర్శిస్తున్నారు. పలువురు రాజకీయ నేతల అండదండలు, అధికారుల మద్దతుతో పేట్రేగిపోతున్నట్లు గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న పలు ఘటనలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

కలెక్టర్‌ చొరవ చూపాలి..

సీడ్‌ పత్తి సాగు చేసే రైతులకు అందరూ అండగా ఉండాలి. సీడ్‌ ఆర్గనైజర్లు చేస్తున్న మోసాలను అరికట్టాలి. మోసాలకు పాల్పడే ఆర్గనైజర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఈ వ్యవహారంలో కలెక్టర్‌ చొరవ చూపి రైతులకు మేలు జరిగేలా చర్యలు చేపట్టాలి.

– రంజిత్‌ కుమార్‌,నడిగడ్డ హక్కుల పోరాట సమితిచైర్మన్‌, గద్వాల

No comments yet. Be the first to comment!
Add a comment
పాస్‌.. అయినా ఫెయిల్‌! 1
1/1

పాస్‌.. అయినా ఫెయిల్‌!

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement