బూటకపు రాష్ట్ర సమితి.. బీఆర్‌ఎస్
నారాయణపేట: పదేళ్లలో ఈ ప్రాంతంలో ఒక్క ఎకరానికై నా సాగునీరు అందించారా.. పాలమూరు కష్టాలను ఎత్తిచూపి గతంలో కేసీఆర్ కాలయాపన చేశారని.. బూటకపు రాష్ట్ర సమితి బీఆర్‌ఎస్ అని షాద్‌నగర్ ఎమ్మెలే వీర్లపల్లి శంకర్ అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఆయనతోపాటు ఎమ్మెల్యేలు పర్ణికారెడ్డి, వాకిటి శ్రీహరి, వంశీకృష్ణ కలిసి గురువారం జిల్లా కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరిట సాధించుకున్న తెలంగాణలో బీఆర్‌ఎస్ నాయకులు పదేళ్ల పాలనలో కేవలం ఉత్తర తెలంగాణను అభివృద్ధి చేసుకున్నారన్నారు. వాస్తవాలను ప్రజలు గ్రహిస్తారని, బీఆర్‌ఎస్ చెప్పే మాయమాటలను ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరని, పదేళ్లలో మహిళలను పట్టించుకోలేదన్నారు. మన పాలమూరు బిడ్డ రేవంత్‌రెడ్డి సీఎం కావడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని.. ఏడాది పాలనలో రాష్ట్రమంతా ప్రగతి బాట పట్టిందన్నారు. మక్తల్, నారాయణపేట, కొడంగల్ ప్రాంతాలకు సాగునీరు అందించాలని కంకణం కట్టుకున్నారన్నారు. ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని, పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వబోతున్నామన్నారు. ఈ ప్రభుత్వ హయాంలో ఎనలేని అభివృద్ధి చేసుకొనేందుకు అందరూ సహకరించాలని ఆకాంక్షించారు. అనంతరం ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి మాట్లాడుతూ రూ.వెయ్యి కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను సీఏం చేతుల మీదుగా చేపట్టబోతున్నామన్నారు. రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా సమాఖ్యతో నడిచే పెట్రోల్ పంప్ ప్రారంభించుకుంటున్నమన్నారు. ‘పేట’ ఎత్తిపోతల ద్వారా ఈ ప్రాంతం సస్యశ్యామలం కాబోతోందని, 42 శాతం ఉన్న బీసీలకు 42 శాతం టికెట్లు సాధిస్తామని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. ఏ ముఖ్యమంత్రి చేయని సాహసోపేత నిర్ణయాలను సీఎం తీసుకుంటున్నారని ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. 14 నెలల్లో మీరు చేయని పనులు మేం చేశామని, గతంలో కేసీఆర్ పాలమూరును దత్తత తీసుకున్నా ఏం అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు కె.ప్రశాంత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
Comments
Please login to add a commentAdd a comment