సంస్కృతి, సంప్రదాయాలు పాటించాలి
ధన్వాడ: ప్రపంచదేశాలు హిందూ సంస్కృతి, సంప్రదాయలను పాటిస్తుంటే.. మనం మాత్రం ఇతర సంస్కృతులను అలవరుచుకుంటున్నామని హంపీ విరూపాక్ష విద్యారణ్య మహాసంస్థాన పీఠాధీశ్వరులు విద్యారణ్య భారతి స్వామిజీ అన్నారు. శుక్రవారం ధన్వాడ మండల కేంద్రంలోని వేంకటేశ్వరస్వామి ఆలయ రాజగోపుర శిఖర కలశ స్థాపన, మహామంగళహారతి కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఉదయం పీఠదేవతాపూజ, ప్రతిష్ఠాపన కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. దేవుడు మనకు ఇచ్చిన గొప్పవరం మానవజన్మ అని.. పుట్టిన రోజు నాడు దీపాలు వెలిగించి జీవితం వెలుగలమయం అయ్యేలా చూడాలని కోరుకోవాల్సిన రోజు దీపాలు ఆర్పి ఫొటోలతో ఏర్పాటు చేసుకున్న కేకులను కట్ చేస్తూ ధర్మాలను పాటించడం మానేస్తున్నామని అన్నారు. గంగనీటిని పోస్తే సూక్ష్మక్రిములు మరణిస్తున్నాయని అమెరికా సైంటిస్టులు కనుకొంటుంటే.. మనం మాత్రం గంగనీరు పరిశుభ్రం కాదు, గంగాస్నానాలు చేయరాదు అంటూ ప్రచారాలు చేసుకుంటున్నామని అన్నారు. ప్రపంచదేశాల్లో గొప్ప విజ్ఞానం మన ఆచార సంప్రదాయలలో ఉందని ప్రతి ఒక్కరు పాటించాలని అన్నారు. పెద్ద గుడికి వెళ్తేనే దేవుడు వరాలు ఇవ్వడని, మనకు దగ్గరలో దీపం కూడా పెట్టలేని పరిస్థితిలో ఉండే ఆలయంలో ప్రతి వారం శుభ్రం చేసి దీపారాధన చేస్తే దేవుడి కృప ఎప్పటికీ ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ డీకే అరుణ, నేరడుగం సిద్ధి లింగేశ్వర పశ్చిమాద్రి సంస్థాన సిద్ధిలింగేశ్వరస్వామి, అంబత్రయ క్షేత్ర పీఠాధిపతి అదిత్యపరాశ్రీస్వామి, బీజేపీ రాష్ట్ర నాయకుడు రతంగ్‌పాండురెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment