గంజాయి సాగు, సారా తయారీపై ఉక్కుపాదం
నాగర్‌కర్నూల్: గంజాయి సాగు, సారా తయారీ, సరఫరాపై ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నాగర్‌కర్నూల్‌ను సారా రహిత జిల్లాగా మార్చేందుకు ఎకై ్సజ్, పోలీస్ శాఖల అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, ఎమ్మెల్యేలు రాజేశ్‌రెడ్డి, వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డిలతో కలిసి ఎకై ్సజ్, పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ దేశానికి యువత అత్యుత్తమమైన సంపద అని, వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. పేదలు సారా తాగి ఇల్లు, ఒళ్లు గుల్ల చేసుకుంటున్నారన్నారు. యువకులు డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలై బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకోసమే సారాను రూపుమాపేందుకు జిల్లా యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఎక్కడైనా గంజాయి సాగు, సారా తయారీ జరిగితే కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో ఎవరినీ ఉపేక్షించొద్దని చెప్పారు. జిల్లాలో రాష్ట్ర స్థాయి నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు సారా, గంజాయి వంటి మత్తు పదార్థాలపై విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్నాయన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు చేపట్టిన అవగాహన కార్యక్రమాలు, తనిఖీల్లో నమోదు చేసిన కేసుల వివరాలను కలెక్టర్, ఎస్పీలు మంత్రికి వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవసహాయం, ఎకై ్సజ్, పోలీస్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment