రూ.1000 కోట్ల అభివృద్ధి పనులకుశంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
అనంతరం బహిరంగసభలో ప్రసంగించనున్న ముఖ్యమంత్రి
‘పేట’కు అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ..
కానుకుర్తి, కోటకొండ, గార్లపాడు మండలాల ప్రకటనపైనే ప్రజల ఆశలు
నారాయణపేట: జిల్లా కేంద్రంలో సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం పర్యటించనున్నారు. సీఎం హోదాలో రూ.వెయ్యి కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఇదిలాఉండగా, సీఎం పర్యటనపై జిల్లా ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తారని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేస్తారని, పెద్ద మొత్తంలో వరాలు కురిపిస్తారని జిల్లా ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.
రూ. 450 కోట్లతో అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీకి ప్రతిపాదనలు
నారాయణపేట మున్సిపాలిటీలో రూ.450 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీని నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి సీఎంకు సమర్పించనున్నారు. రూ.7 కోట్లతో నూతన మున్సిపల్ కార్యాలయ భవనం, రూ.70 లక్షలు స్వీప్పింగ్ మిషన్, రూ.10 కోట్లతో కొండారెడ్డిపల్లి చెరువు అభివృద్ధి పనులు, 3.50 కోట్లు చెత్తసేకరణకు మినీ టిప్పర్లు, జేసీబీ, రూ.16 కోట్లతో సీసీ, డ్రెయినేజీల నిర్మాణాలకు ప్రతిపాదనలతో సీఎంకు అందజేయనున్నారు. జిల్లా కేంద్రం విస్తరిస్తుండడంతో మాస్టర్ ప్లాన్‌తో నూతన రింగ్ రోడ్‌ను ఏర్పాటు చేసేందుకు నిధులు మంజూరు చేయాలని.. ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.
సర్వం సిద్ధం
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత ముఖ్యమంత్రి హోదాలో రేవంత్‌రెడ్డి తొలిసారిగా శుక్రవారం నారాయణపేట జిల్లాకేంద్రానికి రానున్నారు. ఈ సందర్భంగా రూ.వెయ్యి కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్ దిశానిర్దేశంతో జిల్లా అధికార యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లను సిద్ధం చేసింది.
పర్యవేక్షించిన అధికారుల బృందం
సీఎం పర్యటన నేపథ్యంలో గురువారం రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ క్రిస్టియానా, ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరసింహారెడ్డి, ఐఅండ్‌పీఆర్ కమిషనర్ హరీశ్, ఎస్పీ యోగేష్ గౌతమ్‌తో కలిసి కలెక్టర్ సిక్తా పట్నాయక్ సీఎం పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించారు. సింగారం చౌరస్తాలోని హెలీప్యాడ్ స్థలాన్ని, సమీపంలోని నూతన పెట్రోల్ బంక్, వృత్తి నైపుణ్య అభివృద్ధి కేంద్రాన్ని, అప్పక్‌పల్లి వద్ద సీఎం భూమి పూజ చేసే ఇందిరమ్మ ఇంటి స్థలాన్ని అధికారుల బృందం పరిశీలించింది. అనంతరం మెడికల్ కళాశాలలో ఏర్పాట్ల గురించి స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. బహిరంగసభ వేదిక పక్కన గ్రీన్ రూమ్, వేదికపై సీటింగ్ కెపాసిటీ, వీఐపీ గ్యాలరీ తదితర వాటిపై చర్చించారు. అన్ని ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. వారివెంట టీజీఎమ్‌ఐడీసీసీ దేవేందర్, ఎస్‌ఈ సురేందర్ రెడ్డి, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ రాంకిషన్, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ వనజా రెడ్డి తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment