నారాయణపేట: దివ్యాంగ విద్యార్థులు ఏ విషయంలో కూడా తక్కువ కాదని వారికి ప్రత్యేకమైనటువంటి నైపుణ్యాలు పుట్టుకతోనే వస్తాయని.. వారిలో గల సృజనాత్మక నైపుణ్యాలను గుర్తించి వెలికి తీస్తే వారు చాలా ప్రతిభా వంతులుగా మారుతారని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో బుధవారం భారత కృత్రిమ అవయవాల నిర్మాణ సంస్థ (అలిమ్ కో) సమగ్ర శిక్ష సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఏర్పాటు చేసిన ఉచిత ఉపకరణాల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భవిత సెంటర్లలో ఇస్తున్న ప్రత్యేక శిక్షణ దివ్యాంగ విద్యార్థుల తల్లిదండ్రులు ఉపయోగించుకొని వారికి జీవన నైపుణ్యాలు నేర్పించాలని అన్నారు. భవిత సెంటర్లలో వారానికి ఒకసారి ఫిజియోథెరపీ సేవలు అందిస్తారని దీనిని దివ్యాంగ విద్యార్థుల తల్లిదండ్రులు ఉపయోగించుకోవాలని తెలిపారు. మనోధైర్యంతో వైకల్యాన్ని జయించి జీవితంలో అత్యున్నత స్థానాలలో స్థిరపడ్డారని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులను ఓపిక, సహనంతో పెంచి పెద్ద చేయాలని కోరారు. ప్రభుత్వం ద్వారా వారికి వచ్చేటటువంటి ప్రోత్సాహకాలను విద్యార్థులకు అందేలా తగు చర్యలు తీసుకొని వారిని సరిగ్గా పోషించాలని సూచించారు.
వినికిడి యంత్రాలు, వీలైచైర్స్
గత ఆగస్టు 24న నిర్వహించిన అసెస్మెంట్ క్యాంపులో నుండి 85 మంది విద్యార్థులను గుర్తించి వారికి అవసరమైన పరికరాలకు కొలతలు తీసుకుని రూ.లక్షల విలువైన ఉపకరణాలను కలెక్టర్ చేతులు మీదుగా పంపిణీ చేయడం జరిగిందని సీఎం ఓ రాజేందర్ తెలిపారు. కాలిపర్స్, వినికిడి యంత్రాలు, ట్రై సైకిల్స్, వీల్ చైర్స్, సిపి చైర్స్, ఎంఆర్ కిట్స్ మరియు రొలేటర్స్ దివ్యాంగులకు అందించారు. అనంతరం డీఈఓ గోవిందరాజులు మాట్లాడుతూ.. భవిత సెంటర్లలో చదివే విద్యార్థులకు ఎన్టైటిల్మెంట్స్ స్టైఫండ్ ఎస్కార్ట్ అలవెన్సు రీడర్ అలవెన్‌న్స్ ఇస్తున్నామని, భవిత సెంటర్లలో ఫిజియోథెరపీ క్యాంపు, స్పీచ్ థెరపీ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ఉమాపతి, విద్యా శాఖ అధికారి నాగార్జునరెడ్డి, మండల విద్యాశాఖ అధికారి బాలాజీ, అలీంకో సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ప్రత్యేక అవసరాలు గల
విద్యార్థులకు శిక్షణ
తల్లిదండ్రులు ఉపయోగించుకొని పిల్లలకు జీవన నైపుణ్యాలు నేర్పించాలి
కలెక్టర్ సిక్తా పట్నాయక్