
ఇందిరమ్మ రాజ్యంలో అన్ని వర్గాలకు మేలు
మక్తల్: ఇందిరమ్మ రాజ్యంలో అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని.. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందుతాయని, ప్రతి పేదవాడు సన్న బియ్యం తినాలనే ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం రేషన్‌కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం అందజేస్తుందని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. మంగళవారం పట్టణంలోని 6వ నంబర్ డీలర్ షాపులో సన్న బియ్యం పంపిణీని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. త్వరలోనే పేదలకు రేషన్‌కార్డులు అందజేయనున్నట్లు, ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. అనంతరం వీరభద్ర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో బాలక్రిష్ణారెడ్డి, లక్ష్మారెడ్డి, గణేష్‌కుమార్, కమిషనర్ శంకర్‌నాయక్, డిప్యూటి తహసీల్దార్ శ్రీలత తదితరులు పాల్గొన్నారు.
భూములు లాక్కోవడమే సర్కార్ లక్ష్యమా?
నారాయణపేట: రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా పేరుతో జనాల వద్దకు వెళితే ఎదురుదెబ్బలు తగలాయని.. ఇప్పుడు మూగ జీవాలు ఉన్న ప్రాంతానికి వెళ్తున్నారని, భూములు లాక్కోవడమే పనిగా పెట్టుకున్నట్లుగా హెచ్‌సీయూ ఘటన స్పష్టం చేస్తుందని మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎస్.రాజేందర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. హెచ్‌సీయూ భూములను కాపాడుకునేందుకు వందల మంది విద్యార్థులు ముందుకెళ్తుంటే ప్రభుత్వం తరఫున ఒక మంత్రిగాని ఒక అధికారి కానీ యూనివర్సిటీ కి వెళ్లి విద్యార్థుల అభిప్రాయాలను తెలుసుకోవాల్సింది పోయి అక్రమంగా రాత్రికి రాత్రే వందల సంఖ్యలో వాహనాలతో భూములను చదును చేసే పనులకు శ్రీకారం చుట్టడం ఎంతవరకు సమంజసమని పేర్కొన్నారు. విద్యార్థులను అక్రమంగా అరెస్టు చేసి కేసులు నమోదు చేయడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికలకు ముందు ఇదే యూనివర్సిటీలో విద్యార్థులతో కలిసి క్రీడలు ఆడిన రేవంత్ రెడ్డికి అప్పుడే ఆ భూములపై కన్ను పడిందని, ఆ విషయం 15 నెలల తర్వాత స్పష్టం అవుతుందని తెలిపారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గాలని పేర్కొన్నారు.
నేడు ఉల్లి బహిరంగ వేలం
దేవరకద్ర: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం ఉల్లి బహిరంగ వేలం నిర్వహిస్తారు. నాలుగు రోజులుగా మార్కెట్ యార్డుకు వరుసగా సెలవులు వచ్చాయి. తిరిగి బుధవారం లావాదేవీలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటల నుంచి ఉల్లి వేలం, మధ్యాహ్నం ధాన్యం టెండర్లు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.