
ప్రతి కేసుపైపారదర్శక విచారణ
నారాయణపేట: ప్రతి కేసుపై పారదర్శక విచారణ చేయాలని, కేసు నమోదు నుంచి చార్జిషీట్ వరకు ప్రతి విషయాన్ని కూలంకషంగా పరిశోధన చేసి ఫైనల్ చేయాలని, గంజాయి, గుట్కా, పేకాట పై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి సమూలంగా నిర్మూలించాలని డీఎస్పీ ఎన్.లింగయ్య ఆదేశించారు. శనివారం డీఎస్పీ కార్యాలయంలో పెండింగ్ కేసులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. పెండింగ్ ఉన్న గ్రేవ్, నాను గ్రేవ్ కేసుల గురించి సీఐ, ఎస్‌ఐలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండాలన్నారు. పోక్సో, ఎస్సీ ఎస్టీ, గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి, 60 రోజుల్లో కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలన్నారు. ప్రతి అధికారికి పూర్తి ఇన్వెస్టిగేషన్, స్టేషన్ మేనేజ్మెంట్ తెలిసి ఉండాలని సూచించారు. ఆత్మహత్యల కేసులలో అన్ని కోణాలలో ఇన్వెస్టిగేషన్ చేసి కేసు ఫైనల్ చేయాలని సూచించారు. పెరుగుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని, ప్రజల మన్ననలు పొందే విధంగా విధులు నిర్వర్తించాలని తెలిపారు. ఈ సమావేశంలో సిఐలు శివ శంకర్, సైదులు, రాజేందర్ రెడ్డి, రామ్ లాల్ పాల్గొన్నారు.
జిల్లా సరిహద్దులో
చెక్‌పోస్టుల ఏర్పాటు
నారాయణపేట: యాసంగి వరి కొనుగోళ్లలో పోరుగు రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి వరి ధాన్యం రాకుండా నివారించేందుకు జిల్లా పరిధిలో 6 బోర్డర్ చెక్‌పోస్టులను ఏర్పాటు చేయడం జరిగిందని డీఎస్పీ నల్లపు లింగయ్య తెలిపారు. నారాయణపేట మండలంలో జలాల్పూర్ చెక్ పోస్ట్, దామరగిద్ద మండలం కానుకుర్తి వద్ద, కృష్ణ మండలంలో చేగుంట వద్ద, కృష్ణా బ్రిడ్జి వద్ద, ఊట్కూర్ మండలంలో సమస్తాపూర్ వద్ద, మాగనూర్ మండలంలోఉజ్జెల్లి వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ఈ బోర్డర్ చెక్‌పోస్టులో పోలీస్ అధికారులతో పాటు రెవెన్యూ అధికారులు పూర్తిస్థాయి నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. కర్ణాటక రాష్ట్రం నుంచి వరి ధాన్యం రాకుండా చూడాలని, వాహనాల వే బిల్లులను తనిఖీ చేయాలని సూచించారు. ఎలాంటి అనుమతి లేకుండా ఉంటే చర్యలు తీసుకోవాలన్నారు. చెక్‌పోస్టు దగ్గర వచ్చి పోయే ప్రతి ఒక్క వాహనాల నంబర్లను రిజిస్టర్ లో నమోదు చేయాలని తెలిపారు. వ్యాపారస్తులపై నిఘా ఏర్పాటు చేయాలని, చెక్‌పోస్టుల వద్దనే కాకుండా బోర్డర్ గ్రామాల నుంచి జిల్లాలోకి వరి ధాన్యం రాకుండా పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని తెలిపారు. పోలీస్ స్టేషన్‌లో ఉన్న హెచ్‌ఓలు నిరంతరం చెక్‌పోస్ట్‌లపై నిఘా ఉంచాలని తెలిపారు.
పీయూలో కాంట్రాక్టు అధ్యాపకుల సమ్మె
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం నుంచి నిరవధిక సమ్మె బాట పట్టారు. ఈ మేరకు పీయూ ప్రధాన గేట్ వద్ద మోకాళ్లపై నిలబడి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా సంఘం నాయకులు భూమయ్య, శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ.. నెట్, సెట్, పీహెచ్‌డీ వంటి అర్హతలు ఉన్న అధ్యాపకులను ఎలాంటి షరతులు లేకుండా నేరుగా రెగ్యులరైజ్ చేయాలని, జీఓ నంబర్ 21ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు అధ్యాపకుల సమ్మెకు నాన్ టీచింగ్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రామ్మోహన్, బుర్రన్న సంఘీభావం ప్రకటించారు. కార్యక్రమంలో రవికుమార్, సుదర్శన్‌రెడ్డి, విజయభాస్కర్, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, ఈశ్వర్ పాల్గొన్నారు.

ప్రతి కేసుపైపారదర్శక విచారణ