
భూ భారతి చట్టంపై అవగాహన ఉండాలి
నారాయణపేట: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన భూ భారతి చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని... ఈ చట్టం ఎంతో సులభమైన, సరళమైందని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రం సమీపంలోని సింగారం చౌరస్తా వద్ద గల వృత్తి నైపుణ్య అభివృద్ధి శిక్షణా కేంద్రంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భూ భారతి రెవెన్యూ అవగాహన సదస్సుకు ముఖ్య అతిథులుగా కలెక్టర్‌తో పాటు ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి హాజరయ్యారు. సదస్సులో కలెక్టర్ మాట్లాడుతూ.. కొత్త పోర్టల్‌లో సింగిల్ ఆఫీసర్‌కు అధికారాలు ఇచ్చారని, భూ సమస్యలను బట్టి తహసీల్దార్, ఆర్డీఓ, రెవెన్యూ కలెక్టర్ స్థాయిలో అధికారాలు ఉన్నాయని, వారి పరిధి కంటే ఎక్కువ సమస్య ఉంటే కలెక్టర్‌కు అధికారం ఇవ్వడం జరిగిందన్నారు. అలాగే, ఆధార్ కార్డు ఎలాగో ప్రతి రైతుకు తన భూమికి సంబంధించిన అన్ని వివరాలతో కూడిన భూదార్ కార్డును జారీ చేయనున్నట్లు వివరించారు. ఈ కొత్త చట్టం, రూల్స్ జూన్ 2 తర్వాత అన్ని గ్రామాలలో సదస్సులు నిర్వహించి అక్కడి రైతుల సమస్యలపై దరఖాస్తులు స్వీకరించి, వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
ఎమ్మెల్యే పర్ణికారెడ్డి మాట్లాడుతూ.. ఈ కొత్త చట్టంపై రైతులందరికీ అవగాహన ఉంటే ఎవరికి వారే అధికారుల వద్దకు వెళ్లి భూములకు సంబంధించిన సమస్యలు పరిష్కరించుకోవచ్చని అన్నారు. గత ప్రభుత్వంలోని ధరణిలో సాదా బైనామాలకు అవకాశం లేకపోయిందని, నియోజకవర్గంలో వెయ్యి దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. అంతేగాక, చిన్న చిన్న సమస్యలు పరిష్కారంకాక గతంలో రైతులు కోర్టుకు వెళ్లాలల్సిన పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు కోర్టుకు వెళ్లకుండా ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా రైతుల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. రైతులందరూ భూ భారతి చట్టాన్ని సద్వినియోగం చేసుకుని గొడవలు లేకుండా సమస్యలను పరిష్కరించుకోవాలని అన్నారు. సదస్సులో జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ వార్ల విజయ్ కుమార్, రాజేష్, తహసీల్దార్ అమరేంద్ర కృష్ణ, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు.
గడువులోగా నిర్మాణ పనులు పూర్తి చేయాలి
కొత్తపల్లి/కోస్గి రూరల్: గడువులోగా మండల కాంప్లెక్స్ భవన నిర్మాణ పనులు పూర్తి చేయాలని, ఇసుక సమస్య అతిత్వరలో పరిష్కరిస్తామని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శనివారం కొత్తపల్లి, గుండుమాల్ మండల కాంప్లెక్స్ భవన నిర్మాణ పనులను శనివారం సాయంత్రం కలెక్టర్ పరిశీలించారు. కొత్తపల్లి సమీపంలో మూడు ఎకరాల స్థలంలో రూ.8.80 కోట్లతో చేపడుతున్న మండల కాంప్లెక్స్ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. అలాగే, గుండుమాల్ పీహెచ్‌సి పక్కన గల రెండు ఎకరాల స్థలంలో నిర్మించే నిర్మాణ స్థలాన్ని కూడా కలెక్టర్ పరిశీలించారు. రెండు చోట్ల ఇసుక సమస్యతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా.. సమస్యను పరిష్కరించి రెండు రోజుల్లో ఇసుక వచ్చేలా చూడాలని ఆయా తహసీల్దార్లను ఆదేశించారు. కార్యక్రమంలో పంచాయతీ రాజ్ ఈఈ హీర్యానాయక్, డీఈ విలోక్, తహసిల్దార్లు జయరాములు, భాస్కర్ స్వామి, ఏఈ అంజి రెడ్డి పాల్గొన్నారు.