
పేదల భూములకు పట్టాలు ఇవ్వాలి
మరికల్: ఏళ్ల తరబడి పేదలు సాగు చేసుకుంటున్న భూములకు ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలని మాజీ ఎంపీ, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తమ్మినేని వీరభద్రం అన్నారు. మరికల్‌లో శనివారం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగే మహాసభలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. అంతకుముందు కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించి సభా స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 1850 ఎకరాల పేదలకు సంబందించిన భూములకు రాష్ట్ర ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలని ఐదేళ్ల నుంచి ఉద్యమాలు చేస్తున్నా స్పందన లేదన్నారు. రైతులకు పట్టాలు ఇచ్చే వరకు తమ పోరాటం ఆగదన్నారు. నారాయణపేట – కొడంగల్ లిప్టు ఇరిగేషన్ కోసం పాదయాత్ర చేసిన ఘనత తమదేన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 13వేల ఎకరాలను సాగు చేస్తున్న పేద రైతుల తరపున పోరాటలు చేసి వారికి న్యాయం చేస్తామన్నారు. అలాగే అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు, ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టవంతంగా అమలు చేసి ఏడాదిలో 200 పని దినాలను పెంచాలన్నారు. అలాగే రోజుకు రూ. 600 కూలీ చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో కేవలం రెండింటిని అమలు చేసి మిగితా వాటిని గాలికి వదిలేసిందని, భూ సమస్యలను పరిష్కరించకుంటే త్వరలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. గోపాల్, వెంకట్రామారెడ్డి, జాన్‌వెస్లీ, నాగయ్య, బీంరాజ్, వెంకట్రాములు, భూపాల్, వెంకట్ పాల్గొన్నారు.