అరుణాచల్ ప్రదేశ్‌లోని కురుంగ్ కుమే జిల్లాలో భారత్-చైనా సరిహద్దు సమీపంలో 19 మంది కార్మికులు అదృశ్యమయ్యారు. వీరిలో ఓ కార్మికుడు విగతజీవుడై కనిపించాడు. వీరంతా ఈనెల 5వ తేదీన అరుణాచల్ ప్రదేశ్‌లోని కురుంగ్ కుమే జిల్లాలో రోడ్డు నిర్మాణ పనులకు వెళ్లి కనిపించకుండాపోయారు. అదృశ్యమైన కార్మికులు అసోం రాష్ట్రానికి చెందినవారు. కార్మికులు కనిపించకుండా పోయి 14 రోజులైంది. ప్రాజెక్ట్ సమీపంలోని ఓ నది వద్ద ఒక మృతదేహం కనిపించింది. దీంతో కాంట్రాక్టర్ పోలీసులకు సమాచారం అందించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కాగా బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(బీఆర్‌ఓ) ఈశాన్య రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల భారీ నిర్మాణాలను చేపడుతుంది. ఇండో చైనా సరిహద్దుకు సమీపంలో ఉన్న గ్రామీణ ప్రాంతమైన డామిన్ సర్కిల్‌లో రహదారి పనులను పూర్తి చేయడానికి ఈ కూలీలు పనికి వచ్చారు. అయితే ఈద్ జరుపుకోవడానికి తమకు సెలవు ఇవ్వాలని కార్మికులు కాంట్రాక్టర్ బెంగియా బడోను వేడుకున్నారు. కానీ కాంట్రాక్టర్ అనుమతి ఇవ్వలేదు. దీంతో కార్మికులు కాలినడకన ఇళ్లకు వెళ్లినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు.
కురుంగ్ కుమే జిల్లాలోని దట్టమైన అడవిలో కనిపించకుండా పోయారని పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు ఆ 18 మంది ఎక్కడ ఉన్నారనే విషయమై ఇంకా ఆచూకీ లభ్యం కాలేదు. కూలీలంతా డామిన్ నదిలో మునిగిపోయారా అనే కోణంలో కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. వీరి ఆచూకీని కనిపెట్టేందుకు ఓ రెస్క్యూ టీం పనిచేస్తుందని పోలీసులు వెల్లడించారు.
చదవండి: డీఎస్పీని హత్య చేసిన ట్రక్కు డ్రైవర్ అరెస్టు.. ఎన్‌కౌంటర్‌లో దిగిన బుల్లెట్!
Comments
Please login to add a commentAdd a comment