Indo China border
-
భారత్–చైనా సరిహద్దులో ఏకంగా 108 కిలోల బంగారం స్వాధీనం
లేహ్: భారత్–చైనా సరిహద్దులో అక్రమంగా తరలిస్తున్న 108 కిలోల బంగారాన్ని ఇండో–టిబెటన్ బోర్డర్ పోలీసు(ఐటీబీపీ) సిబ్బంది స్వా«దీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఒక్కోటి ఒక కిలో బరువు ఉన్న 108 బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. ఐటీబీపీ చరిత్రలో ఈ స్థాయిలో భారీగా అక్రమ బంగారం స్వా«దీనం చేసుకోవడం ఇదే మొదటిసారి అని వెల్లడించారు. తదుపరి విచారణ కోసం బంగారం, ఇతర వస్తువులను కస్టమ్స్ విభాగానికి అప్పగిస్తామని పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం తూర్పు లద్దాఖ్‌లోని చాంగ్‌థాంగ్ సబ్–సెక్టార్లో భారత్–చైనా సరిహద్దు అయిన వాస్తవా«దీన రేఖకు ఒక కిలోమీటర్ దూరంలో ఐటీబీపీ 21వ బెటాలియన్ సిబ్బంది పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు స్మగ్లర్లు తారసపడ్డారు. ఐటీబీపీ సిబ్బందిని చూసి పారిపోయేందుకు ప్రయతి్నంచారు. సిబ్బంది కొంతదూరం వెంటాడి వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా, బంగారం అక్రమ రవాణా వ్యవహారం బయటపడింది. తనిఖీల్లో 108 కిలోల బంగారం లభించింది. స్మగ్లర్లను లద్దాఖ్ వాసులుగా గుర్తించారు. నిందితులను అధికారులు విచారిస్తున్నారు. -
చైనాపై నమ్మకం సన్నగిల్లింది.. అజిత్ ధోవల్
జోహన్నెస్‌బర్గ్ : వచ్చే నెలలో దక్షిణాఫ్రికా వేదికగా బ్రిక్స్ సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి సన్నాహాల్లో భాగంగా మొదట జోహన్నెస్‌బర్గ్‌లో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ)ల సమావేశం జరిగింది. సమావేశంలో పాల్గొన్న భారత జాతీయ భద్రతాధికారి అజిత్ దోవల్ చైనా తన నమ్మకాన్ని పోగొట్టుకుందని వ్యాఖ్యానించారు. ఈ సారి జరగబోయే బ్రిక్స్ సమావేశాల్లోనైనా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగవుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. చైనా తరపున ఆ దేశ విదేశీ వ్యవహారాల కమిషన్ డైరెక్టర్ వాంగ్ యీ, భారత్ తరపున జాతీయ భద్రతాధికారి అజిత్ ధోవల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. వీరిద్దరూ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల గురించి, సరిహద్దు వివాదం తోపాటు మరికొన్ని కీలక అంశాల గురించి చర్చించారు. ఈ సందర్బంగా నియంత్రణ రేఖ (ఎల్‌ఎసి) వద్ద పరిస్థితిని పరిష్కరించడానికి చైనాతో కలిసి పని చేయడానికి భారత్ సిద్ధంగా ఉందని ధోవల్ వాంగ్‌కు స్పష్టం చేశారు. ఢిల్లీ బీజింగ్ ల మధ్య సంబంధాలు మరింత మెరుగుపర్చాల్సిన ఆవశ్యకత ఉందని, రెండు దేశాల మధ్య సామరస్యత ప్రపంచ శాంతికి కూడా దోహదపడుతుందని అన్నారు. దీనికోసం బీజింగ్ మాతో కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. సరిహద్దులో పరిస్థితి యథాస్థితికి రావాలంటే చైనా ముందు దూకుడు తగ్గించాలని, ఇప్పటికే వారు నమ్మకాన్ని పోగొట్టుకున్నారని అన్నారు. అప్పుడే భారత్, చైనా మధ్య సంబంధాలు సాధారణ స్థితికి వస్తాయని మరోసారి గుర్తు చేశారు. దీనికి స్పందిస్తూ వాంగ్ యీ ఏమన్నారంటే.. చైనా కూడా ధోవల్ ప్రస్తావించిన అంశాలపై సానుకూల దృక్పథంతోనే ఉందని రెండు దేశాల మధ్య సంబంధాలు సుస్థిరమైతే శాంతిని స్థాపించవచ్చని అన్నారు. ఇది కూడా చదవండి: మంత్రి ఇంట్లో చోరీ.. కంప్లైంట్ ఇస్తే తిరిగి తన మెడకే చుట్టుకుని.. -
కాలి నడకన ఇళ్లకు.. 18 మంది మిస్సింగ్! ఒకరు మృతి
అరుణాచల్ ప్రదేశ్‌లోని కురుంగ్ కుమే జిల్లాలో భారత్-చైనా సరిహద్దు సమీపంలో 19 మంది కార్మికులు అదృశ్యమయ్యారు. వీరిలో ఓ కార్మికుడు విగతజీవుడై కనిపించాడు. వీరంతా ఈనెల 5వ తేదీన అరుణాచల్ ప్రదేశ్‌లోని కురుంగ్ కుమే జిల్లాలో రోడ్డు నిర్మాణ పనులకు వెళ్లి కనిపించకుండాపోయారు. అదృశ్యమైన కార్మికులు అసోం రాష్ట్రానికి చెందినవారు. కార్మికులు కనిపించకుండా పోయి 14 రోజులైంది. ప్రాజెక్ట్ సమీపంలోని ఓ నది వద్ద ఒక మృతదేహం కనిపించింది. దీంతో కాంట్రాక్టర్ పోలీసులకు సమాచారం అందించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(బీఆర్ఓ) ఈశాన్య రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల భారీ నిర్మాణాలను చేపడుతుంది. ఇండో చైనా సరిహద్దుకు సమీపంలో ఉన్న గ్రామీణ ప్రాంతమైన డామిన్ సర్కిల్లో రహదారి పనులను పూర్తి చేయడానికి ఈ కూలీలు పనికి వచ్చారు. అయితే ఈద్ జరుపుకోవడానికి తమకు సెలవు ఇవ్వాలని కార్మికులు కాంట్రాక్టర్ బెంగియా బడోను వేడుకున్నారు. కానీ కాంట్రాక్టర్ అనుమతి ఇవ్వలేదు. దీంతో కార్మికులు కాలినడకన ఇళ్లకు వెళ్లినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. కురుంగ్ కుమే జిల్లాలోని దట్టమైన అడవిలో కనిపించకుండా పోయారని పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు ఆ 18 మంది ఎక్కడ ఉన్నారనే విషయమై ఇంకా ఆచూకీ లభ్యం కాలేదు. కూలీలంతా డామిన్ నదిలో మునిగిపోయారా అనే కోణంలో కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. వీరి ఆచూకీని కనిపెట్టేందుకు ఓ రెస్క్యూ టీం పనిచేస్తుందని పోలీసులు వెల్లడించారు. చదవండి: డీఎస్పీని హత్య చేసిన ట్రక్కు డ్రైవర్ అరెస్టు.. ఎన్కౌంటర్లో దిగిన బుల్లెట్! -
‘భారత్ చిట్టచివరి దుకాణం’ ఏదో తెలుసా? ఎందుకీ పేరు?
సాధారణంగా చాలా విషయాల్లో.. మొదటిదానికి ఎంత ప్రాధాన్యం ఉంటుందో చిట్ట చివరి దానికీ అంతే ప్రాధాన్యం ఉంటుంది. ముఖ్యంగా ప్రాంతాల విషయంలో ఇది కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు చెప్పుకోబోయే ఈ దుకాణం కూడా అంతే ప్రత్యేకమైనది. చిత్రంలోని కొట్టు పేరు భారత్ చిట్టచివరి దుకాణం (హిందుస్థాన్ కీ అంతిమ్ దుకాణ్). పేరేంటి అలా ఉంది అనుకుంటున్నారా? పేరులోనే ఉంది కథంతా. ఏంటంటే.. ఈ షాప్ భారత్, చైనా సరిహద్దు ప్రాంతంలోని భారత్ భూభాగమైన ఉత్తరాఖండ్‌లోని... చమోలీ జిల్లాలో ఉంది. ఇదో టీ స్టాల్. దీన్ని చందేర్ సింగ్ బద్వాల్ అనే వ్యాపారి నడుపుతున్నాడు. ఆ గ్రామంలో మొట్ట మొదటి టీ షాపు ఇదే. 25 ఏళ్ల కిందట దీన్ని ప్రారంభించారట. చిన్న షాపే. కానీ 3,118 మీటర్ల (10,229 అడుగులు) ఎత్తులో ఉంది. హిమాలయాల చెంత ఉన్న ఈ షాపు నుంచి చూస్తే అద్భుతమైన మంచు శిఖరాలు కనిపిస్తాయి. చైనా సరిహద్దుకి కొన్ని మీటర్ల దూరంలోనే ఈ షాపు ఉండటం విశేషం. అందుకే ఇక్కడికి వెళ్లిన ప్రతి ఒక్కరూ బద్వాల్ గారి టీ స్టాల్లో ఓ కప్పు చాయ్ కొట్టడంతో పాటు.. ఆ కొట్టు ముందర నిలబడి ఓ సెల్ఫీ కూడా దిగుతారు. చదవండి: సముద్రంలో తేలియాడే నగరం.. పంటలు కూడా.. ఎక్కడో తెలుసా? -
ఘర్షణ సరే... వాణిజ్యం తప్పదు!
సరిహద్దు వివాదానికి శాశ్వతంగా పరిష్కారం దొరక్కపోయినప్పటికీ భారత్, చైనా మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతమవుతున్నాయని చెప్పక తప్పదు. ఇరు దేశాల మధ్య పరస్పర వాణిజ్యం పాత రికార్డులను బద్దలు గొట్టి 9 వేలకోట్ల రూపాయలకు చేరుకుంది. సరిహద్దు ఘర్షణల తర్వాత దేశవ్యాప్తంగా ప్రబలిన, ‘చైనా ఉత్పత్తులను నిషేధించండి’ అనే నినాదాలు ఆశించిన ఫలితాలను సాధించలేదని దీంతో స్పష్టమైంది. ముఖ్యంగా మందుల పరిశ్రమ, ఎలక్ట్రానిక్ గూడ్స్, భారీయంత్రాల వంటి వాటిపై మనం చైనాపై చాలా ఎక్కువగా ఆధారపడుతున్నాం. ఒకవైపు మనం ఇలాంటి ఉత్పత్తుల్లో స్వావలంబన సాధిస్తూనే, చైనాతో వాణిజ్య లోటును తగ్గించుకునే మార్గంలో సంబంధాలు కొనసాగించాలి. దేశాల మధ్య ఘర్షణ తాత్కాలికం, వాణిజ్య తదితర బంధాలు శాశ్వతం అనే సత్యాన్ని రెండు దేశాలూ గ్రహించాలి. సంక్లిష్టమైన సరిహద్దు వివాదాలకు పరి ష్కారం కనుగొనలేకపోతున్నప్పటికీ భారత్, చైనా మధ్య పరస్పర వాణిజ్య సంబంధాలు చెక్కుచెదరకుండా కొనసాగుతుండటం విశేషం. దీనికోసం రెండు దేశాలు అప్రకటిత ఒప్పందం కుదుర్చుకున్నట్లు కనబడుతోంది. తూర్పు లద్దాక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద ఉద్రిక్తతలకు ముగింపు పలకడానికి రెండు దేశాల మధ్య 13వ కార్ప్స్ కమాండర్స్‌కి చెందిన విభాగం ఇటీవలే చర్చలు జరిపింది. ఈ సమావేశంలో ఏ పురోగతీ సాధ్యం కాకపోయినప్పటికీ భారత ప్రతి నిధి బృందం వివాదాస్పద ప్రాంతంలో పరిష్కారం కాకుండా ఉన్న సమస్యపై నిర్మాణాత్మకమైన సూచనలు చేసింది. ఈ చర్చలు కొనసాగనున్నాయని చెబుతున్నారు. ఇటీవలే, భారత్–చైనా మధ్య పరస్పర వాణిజ్యం పాత రికార్డులను బద్దలు గొట్టి 9 వేలకోట్ల రూపాయలకు చేరుకుంది. ఈ ఏడాది తొలి 9 నెలల కాలంలోనే ఇది సాధ్యపడటం మరీ విశేషం. గత సంవత్సరం ఇదే కాలంతో జరిగిన వాణిజ్యంతో పోలిస్తే ఇది 40 శాతం పెరుగుదలను సూచిస్తోంది. అందుచేత, సరి హద్దు వివాదానికి శాశ్వతంగా పరిష్కారం దొరకకపోయినప్పటికీ భారత్, చైనా మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతమవుతున్నాయని చెప్పక తప్పదు. ఇప్పటికైతే, ‘చైనా ఉత్పత్తులను నిషేధించండి’ అనే నినాదాలు ఆశించిన ఫలితాలను సాధించలేదని స్పష్టమైంది. లద్దాక్ సరిహద్దు ప్రాంతంలో చైనా ఆక్రమణలు, హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్న తర్వాత, చైనా సరకులను జాతీయవ్యాప్తంగా బహిష్కరించాలనే డిమాండ్ తారస్థాయికి చేరిన విషయం గుర్తుంచుకోవాలి. మరోవైపున చైనా నుంచి భారీ స్థాయిలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను, మొబైల్ ఫోన్లను భారత్ దిగుమతి చేసుకుంటోంది. ఇక చైనాపై మన ఫార్మసీ కంపెనీలు చాలా ఎక్కువగా ఆధారపడుతున్నదీ వాస్తవమే. దశాబ్దాలుగా కొనసాగుతూ వచ్చిన ఈ పరాధీనతను నినాదాలు గుప్పించడం ద్వారా కొద్ది నెలల్లోపే ముగించలేం. మనం స్వావలంబన సాధించనిదే, చైనా నుంచి వివిధ ఉత్పత్తుల దిగుమతిని కొనసాగించడం తప్ప మరొక ప్రత్యామ్నాయం భారత్‌కు లేదన్నది గ్రహించాలి. కోవిడ్–19 మహమ్మారి, భారత పార్మాసూటికల్ రంగానికి స్వావలంబన సాధించేవైపుగా గొప్ప అవకాశాన్ని అందించింది. దేశ విదేశాల్లో మందులను అమ్మడం ద్వారా ప్రతి ఏటా వందలాది కోట్ల రూపాయలను భారత ఫార్మా రంగం ఆర్జిస్తున్నప్పటికీ దేశంలో రూపొందిస్తున్న జెనరిక్ మందుల ఉత్పత్తిలో ఉపయోగిస్తున్న క్రియాశీలక మందుల దినుసు (ఏపీఐ)ల్లో 85 శాతం దాకా చైనా నుంచి దిగుమతి చేసుకున్నవే అనేది వాస్తవం. ఏపీఐ అంటే మందుల తయారీలో ఉపయోగించే ముడి సరకు అన్నమాట. భారత్‌లో ఈ మందుల ముడిసరకుల ఉత్పత్తి చాలా తక్కువే అని చెప్పాలి. తుది ఉత్పత్తిని కూర్చడానికి భారత్‌లోనే తయారు చేసిన మందుల ముడిసరుకుల్లో కూడా కొన్ని చైనానుంచి దిగుమతి చేసుకోవలసి వస్తోందని మర్చిపోవద్దు. అంతకుమించి, దేశంలో క్రియాశీల మందుల దినుసుల తయారీ కోసం కూడా ఎల్లప్పుడూ చైనా వైపే భారత మందుల కంపెనీలు చూస్తున్నాయన్న వాస్తవాన్ని మనం విస్మరించలేం. ఏ మందుల కంపెనీ గుర్తింపు అయినా సరే, ప్రజానీకానికి అవసరమైన ఎన్ని ప్రాణాధార మందులను అది కనుగొంటోంది, విజయవంతంగా ఉత్పత్తి చేస్తోంది అనే అంశంపైనే ఆధారపడి ఉంటుంది. అయితే అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం మందుల తయారీ చేయాలన్న కుతూహలం కానీ, ఆకాంక్షను కానీ మన మందుల కంపెనీలు ఎన్నడూ ప్రదర్శించలేదన్నది ఎంతో చింతించాల్సిన విషయం. ధన సంపాదన, లాభార్జన ఒక్కటే వీటి ప్రాథమిక లక్ష్యమైపోయింది. కొత్త మందులను అభివృద్ధి చేయడంపై మన కంపెనీలకు విశ్వాసం లేదు. ఈ నేపథ్యంలో కోవిడ్–19 వ్యాక్సిన్లను వృద్ధి చేయడం ద్వారా భారతీయ మందుల కంపెనీలు బహుళ ప్రజాదరణ పొందాయి. సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్, డాక్టర్ రెడ్డీస్ లేబరేటరీస్, జైదుస్ కాడిలా, బయొలాజికల్స్ ఇ, జెనోవా బయో ఫార్మా, పనేసియా బయోటెక్ వంటి కంపెనీలకు జాతి మొత్తం కృతజ్ఞత చూపుతోంది. 1970లలో ఇండియన్ డ్రగ్ అండ్ పార్మాసూటికల్స్ లిమిటెడ్ (ఐడీపీఎల్)ని భారత ప్రభుత్వం నెలకొల్పింది. క్రియాశీలకమైన మందుల ముడిసరకులను తయారు చేయడమే దీని లక్ష్యం. కానీ పాలనారాహిత్యం, అవినీతి కారణంగా ఈ సంస్థ రిషీకేష్, ముజఫర్‌పూర్ వంటి చోట్ల నెలకొల్పిన ఫ్యాక్టరీలన్నీ మూతపడ్డాయి. పైగా, భారత్, చైనాల మధ్య వాణిజ్య కార్యకలాపాలు అసాధారణ స్థాయిలో పెరుగుతూ వస్తున్నాయి. అయితే వీటి నుంచి భారతదేశం పెద్దగా లాభపడుతున్నదేమీ లేదు. చైనా నుంచి మనం కొనుగోలు చేస్తున్న సరకుల కంటే మనం చైనాకు అమ్మగలుగుతున్న సరకుల పరిమాణం చాలా చాలా తక్కువ. ఇదే మనకు నష్టదాయకం. చైనాతో మన వాణిజ్య లోటు కొన్ని సంవత్సరాల క్రితం వరకు 29 బిలియన్ డాలర్ల వరకు ఉండేది. ఈ వాణిజ్యపరమైన లోటును తక్షణం సమతుల్యం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి హర్‡్ష వర్ధన్ ష్రింగ్లా పదేపదే చెబుతున్నారు. భారతదేశం తనకు సాధ్యమైన ప్రతిదీ ఎగుమతి చేయడానికి ప్రయత్నించాలి. మన ఎగుమతులను అత్యంత లాభదాయకంగా, గరిష్టంగా ఉత్తమమైన ధరకు అమ్మవలసి ఉంది. అదే సమయంలో అత్యంత చౌకగా లభిస్తాయనుకున్న దేశాల నుంచి మనం సరకులను దిగుమతి చేసుకోవలసి ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఎలక్ట్రికల్ అలంకరణ వస్తువుల నుంచి, దుస్తులు, శిల్పాలనుంచి వేటిని కూడా భారత్ దిగుమతి చేసుకోకూడదు. ఎందుకంటే వీటన్నింటినీ మన కుటీర పరిశ్రమలు సులభంగా ఉత్పత్తి చేస్తాయి. ప్రస్తుతం, దీపావళి సంబరాలలో దేశం మునిగితేలుతోంది. కొన్నేళ్ల క్రితం వరకు మన మార్కెట్లు చైనానుంచి దీపావళి కోసం పటాసులను కుప్పతెప్పలుగా దిగుమతి చేసుకునేవని మనం గుర్తుంచాలి. తర్వాత విదేశీ పటాసులను ప్రత్యేకించి చైనా పటాసులను స్థానిక మార్కెట్లలో అమ్మడం చట్టవిరుద్ధమని భారత ప్రభుత్వం ప్రకటించింది. ఇది శివకాశిలోని సాంప్రదాయిక బాణసంచా తయారీ పరిశ్రమకు ప్రాణం పోసిందనే చెప్పాలి. అనేక చైనా తయారీ సరకులను భారత్ దిగుమతి చేసుకుంటోంది. ప్రత్యేకించి యంత్రాలు, టెలికాం పరికరాలు, ఎలక్ట్రికల్ గూడ్స్, బొమ్మలు, ఎలక్ట్రికల్ మెషనరీ, సామగ్రి, మెకానికల్ యంత్రసామగ్రి, ప్రాజెక్టు గూడ్స్, సేంద్రియ ఎరువులు, ఇనుము–ఉక్కు వంటి ఎన్నో రంగాలకు చెందిన సరకులు చైనానుంచే వస్తుంటాయి. దీనికి భిన్నంగా చైనాకు భారత ఉత్పత్తులు ప్రధానంగా ఇనుప ఖనిజం, ఇతర ఖనిజాలకు సంబంధించినవే ఎగుమతి అవుతుం టాయి. అంటే మనం స్వావలంబనను సాధించేంతవరకు భారత్, చైనా వాణిజ్యం కొనసాగుతూనే ఉంటుంది. దీంతోపాటు ఇరుదేశాలూ సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోవలసి ఉంది. అన్నిటికంటే కాస్త ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే రెండు దేశాలు కనీసం పరస్పరం చర్చించుకుంటున్నాయి. ఒక ముఖ్యమైన అంశాన్ని మనం మనసులో ఉంచుకోవలసి ఉంది. భారత్, చైనా మధ్య సరిహద్దు ఘర్షణల నేపథ్యంలో, భారత్‌లో ఉంటున్న చైనా పౌరుల పట్ల ఎలాంటి దౌర్జన్యాలకు, అన్యాయానికి తావులేకుండా చూడాలి. గత వందేళ్లుగా చైనీయులు భారత్‌లో నివసిస్తున్నారు. దేశంలోని అన్ని నగరాల్లో వేలాదిమంది చైనా పౌరులు నివసిస్తూ ఉన్నారు. వీరిలో దంతవైద్యులు, వ్యాపారులు, వృత్తి నిపుణులు కూడా ఉండవచ్చు. వీరిలో కొందరు బాగా పేరు పొందారు కూడా. కాబట్టి మన రెండు దేశాలు చర్చలు జరుపుతూనే పరస్పర వాణిజ్యాన్ని కొనసాగించాల్సి ఉంది. వ్యాసకర్త: ఆర్. కె. సిన్హా సీనియర్ ఎడిటర్, రాజ్యసభ మాజీ ఎంపీ -
ఉగ్రభూతం మిమ్మల్నీ వదలదు! పాక్‌కు ప్రధాని హెచ్చరిక
న్యూయార్క్: ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశాలు పాముకు పాలు పోస్తున్నామని అర్ధం చేసుకోవాలని, ఉగ్రవాదాన్ని రాజకీయ పనిముట్టుగా వాడే దేశాలు చివరకు అది తమను కూడా కబళిస్తుందని గ్రహించాలని ప్రధాని నరేంద్ర మోదీ దాయాది దేశానికి ఐక్యరాజ్యసమితి వేదికగా చురకలంటించారు. ఐరాస 76వ సమావేశంలో ప్రధాని మోదీ శనివారం పస్రంగించారు. ఉగ్రవాదులకు పాకిస్తాన్ స్వర్గధామంగా మారుతోందని పొరుగుదేశాలు గగ్గోలు పెడుతున్న సందర్భంగా ఐరాస వేదికగా ప్రధాని గట్టి హెచ్చరిక చేశారు. అఫ్గాన్, కరోనా, ఇండోపసిఫిక్, అంతర్జాతీయ సవాళ్లు.. వంటి అనేక అంశాలను ప్రధాని తన సందేశంలో ప్రస్తావించారు. ప్రస్తుతం ప్రపంచం తిరోగామి ఆలోచనా విధానాలు, అతివాద విధానాలతో సమస్యలను ఎదుర్కొంటోందన్నారు. ఇలాంటి సమయంలో ప్రపంచమంతా శాస్త్రీయాధారిత ధృక్పధాన్ని, పురోగామి మార్గాన్ని అవలంబించి అభివృద్ధి దిశగా పయనించాలని అభిలíÙంచారు. శాస్త్రీయ ధోరణులను పెంపొందించేందుకు భారత్ అనుభవాధారిత విద్యను ప్రోత్సహిస్తోందని చెప్పారు. ఇదే సమయంలో కొన్ని దేశాలు మాత్రం తీవ్రవాదాన్ని స్వీయప్రయోజనాలకు అనుకూలంగా వాడుకోవాలని తిరోగామి ఆలోచనలు చేస్తున్నాయని పరోక్షంగా పాక్‌పై మండిపడ్డారు. వివిధ అంతర్జాతీయ సంస్థలు చైనా విషయంలో మాటమార్చడాన్ని ప్రస్తావించారు. ఐరాస విశ్వనీయత పెంచుకోవాలని చురకలంటించారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా చర్యలను పరోక్షంగా ప్రస్తావిస్తూ సముద్రాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదన్నారు. అఫ్గానిస్తాన్‌ను ఎవరూ సొంత ప్రయోజనాలకు వాడుకోకూడదని హితవు చెప్పారు. ఇంకా ప్రధాని ఏమన్నారంటే... ప్రజాస్వామ్యం: ఒక టీ అమ్ముకునే వ్యక్తి స్థాయి నుంచి ఐరాసలో భారత ప్రధానిగా ప్రసంగించేవరకు సాగిన నా జీవితం భారతీయ ప్రజాస్వామిక బలానికి నిదర్శనం. ప్రజాస్వామ్యానికి భారత్ తల్లివంటిది. ఈ ఏడాది ఆగస్టు 15న ఇండియా 75వ స్వాతంత్య్రోత్సవాలు జరుపుకుంది. భారత్‌లో భిన్నత్వమే బలమైన ప్రజాస్వామ్యానికి నిదర్శనం. వివిధ ప్రభుత్వాల అధినేతగా త్వరలో నేను 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంటాను. భారత్‌లో ప్రజాస్వామ్యం విజయవంతమైందనేందుకు నేనే నిదర్శనం. ఐరాస: ఐక్యరాజ్యసమితి సామర్థ్యాన్ని మరింత మెరుగుపరుచుకోవాలి. వివిధ దేశాలకు ఆలంబనగా ఉండాలనుకుంటే ఐరాస విశ్వసనీయతను పెంచాలి. సరైన సమయంలో సరైన చర్యలు తీసుకోకుంటే విఫలమైనట్లేనన్న చాణక్య సూక్తిని గుర్తు చేసుకోవాలి. కరోనా, వాతావరణ మార్పు తదితర అంశాల్లో ఐరాస ప్రవర్తన గురించి అనేక ప్రశ్నలు తలెత్తాయి. అఫ్గాన్ ఉదంతం ఐరాస తీరుపై ప్రశ్నల్లో వాడిని పెంచాయి. కరోనా పుట్టుక, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాకింగులు, అంతర్జాతీయ సంస్థల పనితీరు వంటివి అనేక సంవత్సరాల ఐరాస కృషిని, ఐరాసపై నమ్మకాన్ని దెబ్బతీశాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడు ఐరాసను అందరం బలోపేతం చేయాలి. అప్పుడే అంతర్జాతీయ చట్టాలు, విలువలకు రక్షణ లభిస్తుంది. కరోనా– టీకా: మహ్మమారిపై పోరు ప్రపంచప్రజలకు ఐకమత్యం విలువను తెలియజేసింది. రెండేళ్లుగా ప్రపంచ మానవాళి జీవితంలో ఒకసారి ఎదురయ్యే యుద్ధాన్ని చేస్తోంది. కలిసిఉండే కలుగు విజయమని ఈ పోరాటం మనకు తెలిపింది. దేశాల మధ్య సంపూర్ణ సహకారంతో కరోనాపై పోరు సలుపుతున్నాం. రికార్డు సమయంలో టీకాను ఉత్పత్తి చేయగలిగాం. సేవే పరమ ధర్మం అనే సూత్రంపై ఆధారపడే భారత్ కరోనా టీకా రూపకల్పనలో తొలినుంచి కీలక పాత్ర పోషించింది. వనరులు పరిమితంగా ఉన్నా సరే సమర్ధవంతంగా వాడుకొని ప్రపంచానికి తొలి డీఎన్ఏ ఆధారిత కరోనా టీకాను అందించింది. కరోనా నాసల్ టీకా అభివృద్ధిలో భారతీయ సైంటిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారు. మానవత్వాన్ని మర్చిపోని భారత్ మరోమారు టీకాల ఎగుమతిని ఆరంభించింది. ప్రపంచంలో టీకాలు తయారుచేసే ఏ సంస్థయినా భారత్‌లో ఉత్పత్తి ఆరంభించవచ్చు. అభివృద్ధి: భారత్‌లో సంస్కరణలు ప్రపంచాభివృద్ధికి మార్గదర్శకాలు. భారత్ వృద్ధి బాటలో పయనిస్తే ప్రపంచం కూడా అదే బాటలో పయనిస్తుంది. అభివృద్ధి ఎప్పుడూ సమ్మిళితంగా అందరికీ అందేదిగా ఉండాలి. పర్యావరణం: విస్తరణ, బహిష్కరణ పోటీల నుంచి సముద్రాలను కాపాడాల్సిన అవసరం ఎంతో ఉంది. సముద్ర వనరులను ఉపయోగించుకోవాలి కానీ దురి్వనియోగం చేయకూడదు. అంతర్జాతీయ వాణిజ్యానికి సముద్రాలే కీలకం. వీటిని కాపాడాలుకోవడం కోసం అంతర్జాతీయ సమాజం ఏకతాటిపైకి రావాలి. నిబంధనల పాటింపు, స్వేచ్ఛాయుత నేవిగేషన్, వివాదాల శాంతియుత పరిష్కారం, ప్రజాస్వామిక విలువలు, రాజ్యాల సార్వ¿ౌమత్వం కోసం అంతా పాటుపడాలి. వాతావరణ మార్పు ప్రభావం భూగోళంపై తీవ్రంగా పడుతోంది. ప్రకృతికి అనుగుణ జీవనం సాగించడమే దీని నివారణకు మార్గం. పారిస్ ఒప్పందానికి అనుగుణంగా భారత్ మాత్రమే తగిన చర్యలు తీసుకుంది. అఫ్గానిస్తాన్: అఫ్గాన్‌లో సున్నితమైన పరిస్థితులను ఏ దేశం కూడా తమకు అనుకూలంగా మలుచుకోకుండా చూడాలి. ఎవరూ అఫ్గాన్‌ను స్వీయ అవసరాలకు వాడుకోకుండా నిలువరించాలి. కల్లోల అఫ్గాన్‌కు అంతా సాయం అందించాలి. ఆదేశంలో మైనారీ్టలకు రక్షణ లభించేందుకు కృషి చేయాలి. ‘‘మంచి పని చేసేందుకు ధైర్యంగా ముందుకు సాగితే మార్గంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ అధిగమించవచ్చు’’ అనే రవీంద్రనాధ్ టాగూర్ వ్యాఖ్యతో ప్రధాని ప్రసంగాన్ని ముగించారు. స్వదేశానికి పయనం ఐరాస సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న అనంతరం ప్రధాని మోదీ శనివారం స్వదేశానికి తిరుగుప్రయాణం అయ్యారు. పర్యటనలో ద్వైపాక్షిక, బహులపక్ష ఒప్పందాలు కుదిరాయన్నారు. 157 కళాఖండాలను అప్పగించిన అమెరికా న్యూఢిల్లీ: భారత్‌కు చెందిన 157 పురాతన కళాఖండాలను అమెరికా ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అప్పగించింది. ఆయన ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. కళాఖండాలను మోదీ తన వెంట స్వదేశానికి తీసుకురానున్నారు. పురాతన వస్తువుల దొంగతనం, అక్రమ రవాణాను అడ్డుకొనేందుకు కలిసికట్టుగా పనిచేద్దామని, ప్రయత్నాలను బలోపేతం చేద్దామని మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిర్ణయించుకున్నారు. అమెరికా అప్పటించిన కళాఖండాల్లో 71 భారత ప్రాచీన సంస్కృతికి చెందినవి కాగా, 60 హిందూమతానికి, 16 బౌద్ధమతానికి, 9 జైనమతానికి చెందినవి ఉన్నాయని అధికార వర్గాలు శనివారం ఒక ప్రకటనలో వెల్లడించాయి. భారత్‌కు చెందిన ఈ అరుదైన కళాఖండాలను తిరిగి అప్పగించిన అమెరికాకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. అక్రమరవాణాదారులు వీటిని గతంలో భారత్‌లో దొంగిలించి, అంతర్జాతీయ స్మగ్లర్లకు అమ్మేశారు. పలువురి చేతులు మారి చివరకు అమెరికాకు చేరుకున్నాయి. ఇందులో 10వ, 11వ శతాబ్దానికి చెందిన విలువైన లోహ, రాతి విగ్రహాలు సైతం ఉన్నాయి. 1976 నుంచి 2013 వరకూ విదేశాల నుంచి కేవలం 13 కళాఖండాలు భారత్‌కు చేరుకున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. 2014లో మోదీ అధికారంలోకి వచి్చన తర్వాత వందలాది కళాఖండాలను విదేశాల నుంచి వెనక్కి రప్పించగలిగారని వివరించాయి. -
గాల్వాన్ లోయలో అమరులైన మన దేశ ముద్దుబిడ్డలు..
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లో ఉన్న గల్వాన్ లోయలో భారత్, చైనా ఆర్మీల మధ్య ఘర్షణ తలెత్తి ఏడాది గడిచింది. చైనా దొంగ దెబ్బ తీయడంతో.. ఈ ఘర్షణలో భారత్ కు చెందిన 20 మంది ముద్దుబిడ్డలు అమరులయ్యారు. అయితే, ఈ సంఘటనలో మన జవాన్లు అత్యంత ధైర్యసాహాసాలు ప్రదర్శించారు. వారి కాల్పులకు మనవారు సైతం .. గట్టిగా సమాధానం ఇచ్చారు. దీంతో ఈ కాల్పులలో చైనాకు చెందిన 35 సైనికులు మరణించారు. గాల్వాన్ లోయలో అమరులైన మన దేశ ముద్దుబిడ్డలు.. వారి హోదా ఈ క్రింద ఇవ్వబడినాయి. ఆ భగవంతుడు వీర జవాన్ల ఆత్మకు శాంతిని, వారి కుటుంబాలకు మనోధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. 1. బి. సంతోష్ బాబు(కల్నల్) - సూర్యాపేట, తెలంగాణ 2. నాధూరం సోరెన్ ( నాయబ్ సుబేదార్) - మయూర్ బంజ్, ఒడిశా 3. మన్దీప్ సింగ్ ( నాయబ్ సుబేదార్) - పాటియాల, పంజాబ్ 4. సత్నమ్ సింగ్ ( నాయబ్ సుబేదార్) - గురుదాస్‌పూర్, పంజాబ్ 5. కె. పళని (హవిల్దార్) - మధురై, తమిళనాడు 6. సునిల్ కుమార్ (హవిల్దార్) - పట్నా, బిహర్ 7. బిపుల్ రాయ్ ( హివిల్దార్) - మీరట్, ఉత్తర ప్రదేశ్ 8. దీపక్ కుమార్ (సిపాయి) - రీవా, మధ్యప్రదేశ్ 9. రాజేష్ అరంగ్ (సిపాయి) - బిర్భుమ్, పశ్చిమ బెంగాల్ 10. కుందన్ కుమార్ ఓజా (సిపాయి) - సాహిబ్ గంజ్, జార్ఖండ్ 11. గణేష్‌రామ్ (సిపాయి) - కాంకెర్, ఛత్తీస్‌ఘడ్ 12. చంద్రకాంత్ ప్రధాన్ (సిపాయి) - కందమాల్, ఒడిషా 13. గుర్విందర్ సింగ్ (సిపాయి) - సంగ్రూర్, పంజాబ్ 14. గుర్ తేజ్ సింగ్ (సిపాయి) - మాన్నా, పంజాబ్ 15. అంకుశ్ (సిపాయి) - హమిర్పూర్, హిమాచల్ ప్రదేశ్ 16. చందన్ కుమార్ ( సిపాయి) - భోజ్‌పూర్, బిహర్ 17. కుందన్ కుమార్ (సిపాయి) - సహస్ర, బిహర్ 18. అమన్ కుమార్ (సిపాయి) - సమస్తిపూర్, బిహర్ 19. జై కిశోర్ సింగ్ (సిపాయి) - వైశాలి, బిహర్ 20. గణేష్ హన్స్డ్ (సిపాయి) - తూర్పు సింగ్భమ్, జార్ఖండ్ -
హిమాలయాలను చూస్తూ హాయిగా సిప్ చేయొచ్చు..
ఓ కప్పు కాఫీ కోసం పదివేల అడుగుల ఎత్తుకు వెళ్లాలా? హిమాలయాలను చూస్తూ సిప్పు చేయాలంటే తప్పదు. సరిహద్దుకు ఈవల ఉండి ఆవలి టిబెట్‌ను చూస్తూ... టీ తాగాలంటే ఆ మాత్రం శ్రమ తప్పదు. పాండవులు స్వర్గారోహణకు వెళ్లిన దారిలో... తాపీగా ఓ టీ తాగాలంటే అంతదూరం వెళ్లాల్సిందే. టీ తాగడమే కాదు... టీ తాగుతూ చాలా చూడవచ్చు. సరస్వతి నది మీద ద్రౌపది కోసం... భీముడు కట్టిన రాతి వంతెనను చూడవచ్చు. ఇంకా... ఇంకా... చూడాలంటే... ‘మానా’ గ్రామానికి ప్రయాణం కట్టవచ్చు. మానా అనేది చాలా చిన్న గ్రామం. ఓ వంద ఇళ్లుంటాయేమో! కొండవాలులో ఉన్న ఈ గ్రామంలో ఏది నివాస ప్రదేశమో, ఏది వ్యవసాయ క్షేత్రమో అర్థం కాదు. అంతా కలగలిసి ఉంటుంది. ఇంటి ముందు క్యాబేజీ పంటలు కనిపిస్తాయి. దుకాణం వెనుక ఒక కుటుంబం నివసిస్తుంటుంది. ఓ వైపు ధీరగంభీరంగా హిమాలయాలు, మరో దిక్కున కిందకు చూస్తే నేల ఎక్కడుందో తెలియనంత లోతులో మంద్రంగా ప్రవహించే నదులు. నింగికీ నేలకూ మధ్యలో విహరిస్తున్నామనే భావన ఊహల్లో తేలుస్తుంది. నేనూ ఉన్నానంటూ సూర్యుడు తన ఉనికిని ప్రకటించే ప్రయత్నంలో ఉంటాడు. దారి చూపే బ్యాంకు ఇక్కడ రోడ్లు తీరుగా ఉండవు. భారతీయ స్టేట్ బ్యాంకు పెట్టిన బోర్డుల ఆధారంగా వెళ్లాలి. వ్యాసగుహ 150 మీటర్లు, గణేశ గుహ 30 మీటర్లు, భీమ్‌పూల్– సరస్వతి దర్శన్ 100మీటర్లు, కేశవ్ ప్రయాగ 600 మీటర్లు, వసుధారా జలపాతం ఐదు కిలోమీటర్లు అని బోర్డులుంటాయి. వసుధారా జలపాతం పాండవుల స్వర్గారోహణ ప్రస్థానంలో మానా తర్వాత మజిలీ. చాయ్ ప్రమోషన్ ప్రోడక్ట్‌ని ప్రమోట్ చేసుకోవడం వస్తే చాలు... సముద్ర తీరాన ఇసుకని అమ్మవచ్చు, నడి సముద్రంలో ఉప్పు నీటిని అమ్మనూవచ్చు. మానా గ్రామస్థులు టీ, కాఫీలు అమ్మడం చూస్తే అలాగే అనిపిస్తుంది. ‘దేశం చివరి గ్రామం ఇది. ఇక్కడ టీ తాగిన అనుభూతిని మీ ఊరికి తీసుకెళ్లండి’ అని కొత్త ఆలోచనను రేకెత్తించడంతో ప్రతి ఒక్కరికీ టీ కానీ కాఫీ కాని తాగి తీరాలనిపిస్తుంది. ప్రతి పది మీటర్లకు ఒక చాయ్ దుకాణం ఉంటుంది. ప్రతి దుకాణం మీద ‘హిందూస్థాన్ కీ అంతిమ దుకాన్’ అనే బోర్డు ఉంటుంది. వ్యాపార నైపుణ్యం అంటే అదే. అసలైన చివరి దుకాణం ఏదనే ప్రశ్నార్థకానికి సమాధానం కూడా స్టేట్ బ్యాంకు బోర్టే. స్టేట్ బ్యాంకు జోషిమ శాఖ చివరి దుకాణం దగ్గర ‘ఇదే చివరి చాయ్ దుకాణం అనే బోర్డు ఉంటుంది. మానా గ్రామం పొలిమేర అది. ఆ తర్వాత వచ్చే దారి మానా పాస్. ఆ దారిలో ముందుకు వెళ్తే సరిహద్దు సెక్యూరిటీ వాళ్లు వెనక్కి పంపేస్తారు. మానా గ్రామం... దేశం చివరిలో సరిహద్దు వెంబడి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. భారతదేశం ఉత్తర ఎల్లలో హిమాచల్ ప్రదేశ్‌లోని చిత్కుల్ కూడా సరిహద్దు గ్రామమే. అయితే అది పర్యాటక ప్రదేశంగా గుర్తింపు పొందలేదు. మానా గ్రామం భారతీయులకు సొంతూరిలాగ అనిపించడానికి కారణం ఇక్కడ మన పురాణేతిహాసాల మూలాలు కనిపించడమే. -
‘ఉపసంహరణల’తో ఎవరికి మేలు?
వాస్తవాధీన రేఖ వద్ద భారత్–చైనా సైనిక బలగాల ఉపసంహరణ ప్రక్రియ భారత్ వ్యూహాత్మక తప్పిదం కానుందని పలువురు రక్షణ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వివాదంలో తానాశించిన వాటిని చాలావరకు చైనా సాధించుకోగా, భారత్ తనకు పట్టు ఉన్న పర్వత ప్రాంతాలనుంచి కూడా వైదొలగాల్సి వచ్చింది. భారత్ కీలకమైన డెస్పాంగ్ ప్రాంతాన్ని చైనా తన ఆధీనంలోనే ఉంచుకుంది. సరిహద్దు చర్చలు ఒకడుగు వెనక్కి, రెండడుగులు ముందుకు అనే చైనా వైఖరికి అనుగుణంగానే ముగిశాయి. వాస్తవాధీన రేఖపై యధాతథ స్థితిని పునరుద్ధరించడం అనే భారత్ కల ఇక ఫలించనట్లేనా? సైనికుడి తర్వాత సైనికుడిని, ఆయుధం తర్వాత ఆయుధాన్ని మోహరిస్తూ, శిఖరం తర్వాత శిఖరాన్ని అధిరోహిస్తూ భారత సైన్యం లద్దాఖ్ సరిహద్దుప్రాంతంలో చైనా సైనిక బలగాలను సాహసోపేతంగా నిలువరించడానికి ప్రయత్నించినప్పుడు ప్రాణత్యాగాల మధ్యే మన వాళ్ల తెగువను చూసి పులకించిపోయాం. చాలా కాలం తర్వాత భారత ప్రభుత్వం ప్రదర్శించిన కఠిన వైఖరిని ప్రశంసలతో ముంచెత్తాం. కానీ బీజింగ్ ఒత్తిడి కారణంగా ఇంత తెగువ కూడా ఇప్పుడు బీటలువారిపోతున్నట్లు కనిపిస్తోంది. పార్లమెంటులో కాస్త ఆందోళనా స్వరంతో రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన ప్రకటన వాస్తవాధీన రేఖ వద్ద 2020 ఏప్రిల్‌కి ముందునాటి య«థాతథ స్థితిపై పెద్దగా హామీని ఇవ్వలేకపోయింది. ఈ సందర్భంగా రాజకీయాలను పక్కన పెట్టి, ప్రస్తుతం వాస్తవాధీన రేఖవద్ద ఇరుదేశాల సైనిక బలగాల ఉపసంహరణ పథకంపై ప్రశ్నలు సంధిం చాల్సిన అవసరం వచ్చిపడింది. వాస్తవాధీన రేఖ వద్ద సంక్లిష్ట పరిస్థితిని అధిగమించడానికి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని నిపుణులు ఊహించిన భయాలన్నీ ఇప్పుడు వాస్తవమయ్యాయి. మరోవైపున 1959లో తాను ప్రకటించిన రేఖనే అంగీకరించాలని పట్టుబట్టడంతో సహా ఈ వివాదంలో తాను ఆశించిన వాటిలో చాలావరకు చైనా సాధించుకున్నట్లేనని చెప్పాలి. చైనాతో సరిహద్దు ఘర్షణను ఎదుర్కొన్న సమయంలో భారత్ నిఘాపరమైన, సైనిక చర్యలపరమైన, ఇప్పుడు చర్చలపరమైన తప్పులు చేసింది. భారత భూభాగంలో 8 కిలోమీటర్ల లోపలికి చొచ్చుకొచ్చిన చైనా బలగాలను ఫింగర్ 4 నుంచి ఫింగర్ 8 ప్రాంతానికి ఉపసంహరించుకునేలా చేసే క్రమంలో తనవంతుగా భారత్ అత్యంత కీలకమైన పర్వత శిఖరాలనుంచి తన బలగాలను ఖాళీ చేయాల్సి వచ్చింది. ఇంతటితో ఇది పూర్తి కాలేదు. భారత బలగాలు ఇప్పుడు ఫింగర్ 4 ప్రాంతం నుంచి ఫింగర్ 3 పశ్చిమానికి తరలిపోవలసి ఉంది. ఇలా ఖాళీ చేసిన స్థలం బఫర్ జోన్‌గా ఉంటుంది. అంటే ఇక్కడ సాధారణ గస్తీని కూడా సస్పెండ్ చేస్తారన్నమాట. మరోవైపున డెస్పాంగ్ ప్రాంతంలో చైనా బలగాలు 18 కిలోమీటర్ల లోపలికి చొచ్చుకురావడమే కాకుండా అక్కడ భారత బలగాల గస్తీపై కూడా నిషేధం విధించాయి. తాజాగా బలగాల ఉపసంహరణపై కుదిరిన ఒప్పందం గురించి కంఠశోష వచ్చేలా మాట్లాడిన రాజ్‌నాథ్ సింగ్ భారత్ ఎలాంటి భూభాగాన్ని చైనా పరం చేయలేదని పార్లమెంటుకు స్పష్టపరిచారు. చైనా భారత భూభాగంలోకి చొరబడలేదని, భారత్ తన భూభాగంలో దేన్నీ కోల్పోలేదని గతంలో కేంద్రప్రభుత్వం చేసిన ప్రకటనతో ఈ తాజా ప్రకటనను పోల్చవచ్చు. వాస్తవాలు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే చైనా భారత్‌పై గల్వాన్ నమూనా ఉపసంహరణను మోపింది. భారత్‌కు పట్టు ఉన్న కైలాష్ పర్వత శిఖరాలపై ఉన్న వ్యూహాత్మక ప్రదేశాన్ని వదిలేసుకుంటూ దాన్ని ఫింగర్స్ ప్రాంతాల నుంచి సైనిక బలగాల ఉపసంహరణతో ఎలా ముడిపెట్టగలదు? పైగా వాస్తవాధీన రేఖ వద్ద భారత సైనికుల కదలికలే లేకుండా చేయడం కూడా ఏదీ ఇచ్చేయలేదు అనే ప్రకటనలో భాగమేనా? 2020 సెప్టెంబర్‌లో ఎంపిక చేసుకున్న ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణను చైనా ప్రతిపాదించింది. అయితే ఆగస్టు 29–30 తేదీల్లో భారత్ చుషుల్ పర్వత శిబిరాలను ఆక్రమించినందున అక్కడి నుంచి భారత్ వెనక్కు తగ్గాలని, ఆ తర్వాతే ఫింగర్ 4, ఫింగర్8 ప్రాంతాల నుంచి తాను వెనక్కు తగ్గుతానని చైనా పేర్కొంది. గల్వాన్ ఘర్షణలో దెబ్బ తిన్నతర్వాత కీలకమైన పర్వత శిఖరాలను కైవసం చేసుకోవడం ద్వారా ఆధిపత్య స్థానాన్ని పొందిన భారత్ చైనా ఉచ్చులో పడొద్దని ఆ సమయంలోనే పలు రక్షణ, వ్యూహాత్మక వ్యవహారాల నిపుణులు కేంద్రప్రభుత్వాన్ని హెచ్చరించారు. సుదీర్ఘ కాలం పునరాలోచన చేసిన తర్వాత ఏకకాలంలో బలగాల ఉపసంహరణకు చైనా అంగీకరించింది. అయితే కైలాష్ పర్వత శ్రేణిని భారత్ ముందుగా ఆక్రమించింది కాబట్టి భారత దేశమే మొదటగా బలగాలను ఉపసంహరించుకోవాలని చైనా షరతు పెట్టింది. స్పష్టంగానే చైనా యధాతథ స్థితిని పునరుద్ధరించాలనే డిమాం డును పక్కన పెట్టింది. ఈ పదబంధాన్ని చైనా ఎన్నడూ ఉపయోగించలేదు. దానికి బదులుగా సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, సామరస్యాన్ని పునరుద్ధరించాలని మాత్రమే చైనా పేర్కొంది. ఇంతవరకు, దౌలత్ బెగ్ ఓల్టీలోని భారత్ వ్యూహాత్మక సైనిక శిబిరాన్ని నిర్బంధించడమేకాక ఉంచిన డెస్పాంగ్ ప్రాంతంపై చర్చకు చైనా పదేపదే తిరస్కరిస్తూ వచ్చింది. రాజ్‌నాథ్ సింగ్ దీన్నే పార్లమెంటులో ప్రస్తావించారు. తూర్పు లడాఖ్ ప్రాంతంలోని వాస్తవాధీన రేఖ పొడవునా సైనిక బలగాల మోహరింపు, గస్తీకి సంబంధించిన కొన్ని కీలక అంశాలు ఇంకా పెండింగులో ఉన్నాయని రక్షణమంత్రి చెప్పారు. అయితే డెస్పాంగ్ ప్రాంతం గురించి మంత్రి పేర్కొనలేదు. ఇది దౌలత్ బేగ్ ఓల్డీకి చెందిన కీలక ప్రాంతం. దీన్ని వశపర్చుకోవడం అనేది చాలా దీర్ఘకాలిక సైనిక చర్యల ఎజెండాలో భాగమై ఉంటోంది. 5,180 చదరపు కిలోమీటర్ల పొడవైన షాక్స్‌గామ్ లోయతో ముడిపడిన ఈ దౌలత్ బేగ్ ఓల్డీ ప్రాంతాన్ని పాకిస్తాన్ 1963లోనే చైనాకు అప్పగించింది. ఇది చైనా పాకిస్తాన్ ఆర్థిక క్యారిడార్‌తో అనుసంధానమైంది. దౌలత్ బేగ్ ఓల్డీని కోల్పోవడం అంటే పాకిస్తాన్ బలగాలను, చైనా పీఎల్ఏను వేరు చేస్తున్న భారత్ స్వాధీనంలోని సియాచిన్ మంచుగోడను బలహీనపరుస్తుంది. వాస్తవాధీన రేఖ వద్ద సాంప్రదాయికంగా ఉన్న తమ గస్తీ కేంద్రాలకు భారత్ బలగాలు తరలిపోకుండా డెస్పాంగ్ వద్ద చైనా ఏకపక్షంగా అవరోధాలు కల్పించింది. అందుకే ఎంపిక చేసిన ప్రాంతాల్లోనే ఇరుదేశాల సైనిక బలగాల ఉపసంహరణపై కాంగ్రెస్ పార్టీ కేంద్రాన్ని నిలదీసింది. 2020 ఏప్రిల్ నాటి యధాతథ పరిస్థితిని నెలకొల్పడంపై రక్షణమంత్రి ప్రకటన కనీస హామీని ఇవ్వకపోవడంపై కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. చైనా నుంచి ఎలాంటి ప్రతిఫలాన్ని డిమాండ్ చేయకుండానే భారత్‌కు ఆధిపత్యం ఉన్న పర్వతశిఖరాల నుంచి తన బలగాలను ఉపసంహరించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించడంపై కాంగ్రెస్ తీవ్రవిచారం ప్రకటించింది. ఈ అంశంపై వివరణను కోరడానికి కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి ప్రయత్నించినప్పుడు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అర్జున్ మెఘ్వాల్ ఆయన్ని అడ్డుకుని దేశ రక్షణ బలగాలను చూసి గర్వపడుతున్నానని పేర్కొనడం అతిపెద్ద వింత. చైనాతో బలగాల ఉపసంహరణ ఒప్పందంలో దాగిన ప్రయోజనాలను వివరించడానికి బదులుగా జాతీయ రక్షణ త్రయం రక్షణ మంత్రి, విదేశాంగమంత్రి, జాతీయ భద్రతా సలహాదారు నైపుణ్యాల గురించి వల్లెవేస్తూ కధలల్లడానికి ప్రభుత్వాధికారులు సిద్ధమైపోయారు. వీరి సమిష్టి కృషి వల్లే సరిహద్ధు ఘర్షణల్లో స్తబ్దతను తొలగించగలిగామని రక్షణ, దౌత్యం, అంతర్జాతీయ భాగస్వామ్యంపై భారత్ ప్రతిష్టను పునరుద్ధరించామని అధికారులు గప్పాలు కొట్టసాగారు. అదే సమయంలో తమ లక్ష్యాలను మార్చుకోవడం చైనీయుల ప్రవృత్తిలో భాగమైంది. ముందుగా పురోగమించిన వారే మొదటగా ఉపసంహరించుకోవాలనే సూత్రాన్ని గుర్తు చేస్తూ పైచేయి సాధిం చారు. సరిహద్దు చర్చలు ఒకడుగు వెనక్కి, రెండడుగులు ముందుకు అనే చైనా వైఖరికి అనుగుణంగానే ముగిశాయి. కీలకమైన డెస్పాంగ్ ప్రాంతాన్ని అది తన ఆధీనంలోనే ఉంచుకుంది. పాంగాగ్ సరస్సు ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో వ్యూహాత్మకంగా అధమస్థాయితో కూడిన రంగాల వారీ ఉపసంహరణకు అమోదం తెలుపడం ద్వారా కొన్ని ఫింగర్ ప్రాంతాలపై పట్టు కోసం చూసల్ పర్వత శ్రేణిలో మనకున్న ఆధిపత్య స్థానాన్ని వదులుకోవడం అనేది వ్యూహాత్మక విజయం కాదు వ్యూహాత్మక తప్పిదమే అవుతుంది. మొత్తం మీద చూస్తే వాస్తవాధీన రేఖపై యధాతథ స్థితిని పునరుద్ధరించడం అనే భారత కల ఎన్నటికీ ఫలించనిదిగా ఉండిపోతుంది. మేజర్ జనరల్ అశోక్ కె. మెహతా వ్యాసకర్త -
గల్వాన్ ఘర్షణపై సంచలన విషయాలు బహిర్గతం..
మాస్కో: భారత్, చైనా దేశాల మధ్య తూర్పు లద్ధాక్‌లోని గల్వాన్ లోయలో గతేడాది జరిగిన ఘర్షణలో చైనాకే ఎక్కువ ప్రాణ నష్టం వాటిల్లిందని రష్యా న్యూస్ ఏజన్సీ టీఏఎస్ఎస్ సంచలన విషయాలను వెల్లడించింది. ఆ ఘర్షణలో చైనాకు చెందిన 45 మంది సైనికులు మరణించినట్లు ఆ వార్తా సంస్థ పేర్కొంది. 2020 జూన్ 15న ఎల్ఏసీ వద్ద భారత్ ఆధీనంలో ఉన్న ప్రాంతాలను ఆక్రమించేందుకు చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దుస్సాహసం చేయగా, 16వ బీహార్ బెటాలియన్‌కు చెందిన కమాండింగ్ అధికారి కల్నల్ సంతోష్ బాబు నేతృత్వంలోని భారత సైనికులు చైనా దళాలకు ధీటుగా జవాబిచ్చారు. ఈ ఘర్షణలో తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబుతో సహా 20 మంది జవాన్లు అమరులయనట్లు భారత ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించింది. అయితే చైనా మాత్రం వారికి జరిగిన ప్రాణనష్టంపై ప్రకటన విడుదల చేసేందుకు నిరాకరించింది. ఈ ఘటనలో చైనాకు చెందిన 40 మందికిపైగా సైనికులు మరణించి ఉంటారని విదేశీ మీడియా కథనాలు వెలువరించినప్పటికీ, చైనా మాత్రం ఈ విషయంలో నోరు మెదపలేదు. కాగా, ఈ ఘర్షణ అనంతరం భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఇరు దేశాలు పోటాపోటిగా సైనిక దళాలను సరిహద్దుల్లో మోహరించాయి. సరిహద్దులో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు సైనిక, దౌత్య చర్చలు పలు దశల్లో కొనసాగాయి. ఘర్షణ జరిగిన పది నెలల అనంతరం బలగాలను వెనక్కి తీసుకోవడంపై ఇరు దేశాల మధ్య స్పష్టత వచ్చింది. ఈ విషయాన్ని చైనా ప్రభుత్వం బుధవారం అధికారికంగా వెల్లడించగా, భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం పార్లమెంట్లో ప్రస్తావించారు. -
విజయవంతంగా రుద్రం-1 క్షిపణి ప్రయోగం
భువనేశ్వర్ : శత్రుదేశాల నుంచి వచ్చే ముప్పును దీటుగా ఎదుర్కొనేందుకు భారత్ అన్ని విధాల సన్నాద్ధమవుతోంది. దేశ రక్షణ రంగంలో అత్యాధునిక ఆయుధ సంపత్తిని సిద్ధం చేసుకుంది. ఇందులో భాగంగానే వాయుసేన అమ్ముల పొదలోని తిరుగులేని అస్త్రాన్ని పరీక్షించింది. శత్రు దేశాల రాడార్లను మట్టి కరిపించే భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) అభివృద్ధి చేసిన రుద్రం -1 క్షిపణిని శుక్రవారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని బాలాసోర్‌లో సుఖోయ్-30 నుంచి శుక్రవారం ఉదయం ప్రయోగించిన ఈ మిసైల్ నిర్దేశిత లక్ష్యాలను ఛేదించినట్లు డీఆర్డీఓ అధికారికంగా ప్రకటించింది. చదవండి: 'శౌర్యం' చూపుతున్న భారత క్షిపణి సుఖోయ్-30ఎంకేఐ యుద్ధ విమానం నుంచి కూడా ప్రయోగించిన ఈ మిసైల్ శత్రు దేశాల రాడార్లను, నిఘా వ్యవస్థలను దెబ్బతీయగలదు. ఇది కనిష్టంగా 500 మీటర్లు, గరిష్టంగా 15 కిలోమీటర్ల ఎత్తు నుంచి దీన్ని ప్రయోగించవచ్చు. ఇటీవల వరుసగా క్షిపణి పరీక్షలను డీఆర్డీవో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితమే భారత్.. స్మార్ట్ టార్పిడో మిస్సైల్‌ను పరీక్షించింది. క్షిపణి ప్రయోగం విజయవంతమవడంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. డీఆర్డీవో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. చదవండి: సరిహద్దుల్లో క్షిపణుల మోహరింపు -
'శౌర్యం' చూపుతున్న భారత క్షిపణి
సాక్షి, బాలాసోర్: గత వారం రోజులుగా డీఆర్డీవో వరుస క్షిపణులను ప్రయోగిస్తోంది. అధునాతన వర్షన్‌తో శౌర్యా అణు సామర్థ్యం గల బాలిస్టిక్ క్షిపణిని డీఆర్డీఓ శనివారం విజయవంతంగా పరీక్షించింది. భారత్- చైనా ఎల్ఏసీ వద్ద ఉధృత పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో ఈ క్షపణిని పరీక్షించడం ప్రాధాన్యం సంతరించికుంది. ఈ క్షపణి దాదాపు 800 కిలోమీటర్ల మేర లక్ష్యాన్ని ఛేదించే సామర్థ్యం కలదు. ఈ క్షిపణి ఆపరేట్ చేసేందుకు సులువుగా, తేలిగ్గా ఉంటుందని.. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చివరి దశకు చేరుకునే సరికి హైపర్సోనిక్ వేగంతో దూసుకెళ్తుందని అధికార వర్గాలు వెల్లడించాయి. వరుస పరీక్షలతో డీఆర్డీవో దూకుడు.. డీఆర్డీవో వరుస క్షిపణి పరీక్షలతో దూసుకెళ్తోంది. 'లేజర్ గైడెడ్ యాంటీ ట్యాంక్' క్షిపణిని మంగళవారం విజయవంతంగా పరీక్షించారు. గత పదిరోజుల వ్యవధిలో రెండో క్షిపణిని పరీక్షించిండం విశేషం. మహారాష్ర్టలోని అహ్మద్‌నగర్‌లో ఈ క్షిపణిని అభివృధి చేశారు. దీని రేంజ్ ఐదు కి.మి ఉంటుందని.. వివిధ లాంచ్‌ప్యాడ్స్ ద్వారా ప్రయోగించవచ్చని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. బ్రాహ్మోస్... డీఆర్డీవో విజయవంతంగా ప్రయోగించిన మరో ఆయుద్ధం.. 'బ్రాహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షపణి'. 400 కి.మి రేంజ్‌తో లక్ష్యాన్ని ఛేదించగల శక్తి బ్రాహ్మోస్ ప్రత్యేకం. డీఆర్డీవో పీజే-10 ప్రాజెక్ట్ ద్వారా ఈ పరీక్ష నిర్వహించారు. ఇటువంటి క్షపణిని పరీక్షించడం ఇది రెండోసారి. -
చైనా సరిహద్దుల్లో 44 కీలక రోడ్లు
న్యూఢిల్లీ: డోక్లాం ప్రతిష్టంభన, పాక్ సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. భారత్– చైనా సరిహద్దుల వెంబడి వ్యూహాత్మకమైన 44 రోడ్ల నిర్మాణం చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. అదేవిధంగా, పాకిస్తాన్‌తో సరిహద్దు వెంబడి పంజాబ్, రాజస్తాన్ రాష్ట్రాల పరిధిలో 2,100 కిలోమీటర్ల పొడవైన అంతర్గత, అనుసంధాన రహదారులను నిర్మించాలని యోచిస్తోంది. చైనాతో సరిహద్దుల్లో సంక్షోభం తలెత్తిన సందర్భాల్లో బలగాల తరలింపు వేగంగా జరిగేలా వ్యూహాత్మకంగా కీలకమైన 44 రోడ్లను నిర్మించాల్సి ఉందని కేంద్ర ప్రజా పనుల విభాగం (సీపీడబ్ల్యూడీ) వార్షిక నివేదిక పేర్కొంది. సరిహద్దుల్లో రహదారుల నిర్మాణం బాధ్యతలను ఈ సంస్థ చూసుకుంటుంది. సీపీడబ్ల్యూడీ పంపిన ప్రతిపాదనలు కేబినెట్ కమిటీ ఆమోదించే అవకాశాలున్నాయి. జమ్మూకశ్మీర్ మొదలుకొని అరుణాచల్ ప్రదేశ్ వరకు భారత్–చైనాల మధ్య 4 వేల కిలోమీటర్ల మేర వాస్తవ నియంత్రణ రేఖ ఉంది. ఎంతో కీలకమైన ఈ ప్రాంతంలో 44 రోడ్ల నిర్మాణానికి రూ.21వేల కోట్లు అవసరమవుతాయని అంచనా వేసింది. దీంతోపాటు రాజస్తాన్, పంజాబ్లలోని భారత్– పాక్ సరిహద్దు వెంబడి అంతర్గత, అనుసంధాన రహదారుల నిర్మాణానికి రూ.5,400 కోట్లు అవసరమవుతాయని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. -
ఇక సరిహద్దులో బ్రహ్మోస్
న్యూఢిల్లీ: ఇండియా-చైనా సరిహద్దులో అత్యంతశక్తిమంతమైన బ్రహ్మోస్ క్షిపణులను మోహరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పొరుగుదేశానికి ధీటుగా ఉండాలని, ఎప్పటికప్పుడు శత్రువు వ్యూహాలను తిప్పకొట్టాలనే ఉద్దేశంతో వీటిని విస్తరించాలని నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా తూర్పు సరిహద్దు వద్ద వీటిని మోహరించాలని నిర్ణయించినట్లు, ఈ మేరకు కేంద్రం నుంచి అనుమతులు కూడా వచ్చినట్లు డిఫెన్స్ అధికారులు చెప్పారు. 290 కిలో మీటర్ల దూరంలోని లక్ష్యాన్ని తుత్తునియలు చేయగల సూపర్ సోనిక్ అణు క్షిపణులను భారత్ మోహరించాలనుకుంటుంది. మొత్తం రూ.4,300 కోట్ల వ్యయంతో ఈ నాలుగో బ్రహ్మోస్ దళాన్ని సిద్ధం చేయాలని భావిస్తున్నారు. మొత్తం 100 క్షిపణులను సిద్ధం చేయనున్నారు. అలాగే ఐదు మొబైల్ లాంచింగ్ వెహికల్స్ కూడా సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ తరహా క్షిపణులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. చివరి పరీక్ష గత సంవత్సరం (2015) మే నెలలో చేశారు.