ఇక సరిహద్దులో బ్రహ్మోస్
న్యూఢిల్లీ: ఇండియా-చైనా సరిహద్దులో అత్యంతశక్తిమంతమైన బ్రహ్మోస్ క్షిపణులను మోహరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పొరుగుదేశానికి ధీటుగా ఉండాలని, ఎప్పటికప్పుడు శత్రువు వ్యూహాలను తిప్పకొట్టాలనే ఉద్దేశంతో వీటిని విస్తరించాలని నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా తూర్పు సరిహద్దు వద్ద వీటిని మోహరించాలని నిర్ణయించినట్లు, ఈ మేరకు కేంద్రం నుంచి అనుమతులు కూడా వచ్చినట్లు డిఫెన్స్ అధికారులు చెప్పారు.
290 కిలో మీటర్ల దూరంలోని లక్ష్యాన్ని తుత్తునియలు చేయగల సూపర్ సోనిక్ అణు క్షిపణులను భారత్ మోహరించాలనుకుంటుంది. మొత్తం రూ.4,300 కోట్ల వ్యయంతో ఈ నాలుగో బ్రహ్మోస్ దళాన్ని సిద్ధం చేయాలని భావిస్తున్నారు. మొత్తం 100 క్షిపణులను సిద్ధం చేయనున్నారు. అలాగే ఐదు మొబైల్ లాంచింగ్ వెహికల్స్ కూడా సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ తరహా క్షిపణులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. చివరి పరీక్ష గత సంవత్సరం (2015) మే నెలలో చేశారు.