న్యూఢిల్లీ: డోక్లాం ప్రతిష్టంభన, పాక్ సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. భారత్– చైనా సరిహద్దుల వెంబడి వ్యూహాత్మకమైన 44 రోడ్ల నిర్మాణం చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. అదేవిధంగా, పాకిస్తాన్‌తో సరిహద్దు వెంబడి పంజాబ్, రాజస్తాన్ రాష్ట్రాల పరిధిలో 2,100 కిలోమీటర్ల పొడవైన అంతర్గత, అనుసంధాన రహదారులను నిర్మించాలని యోచిస్తోంది. చైనాతో సరిహద్దుల్లో సంక్షోభం తలెత్తిన సందర్భాల్లో బలగాల తరలింపు వేగంగా జరిగేలా వ్యూహాత్మకంగా కీలకమైన 44 రోడ్లను నిర్మించాల్సి ఉందని కేంద్ర ప్రజా పనుల విభాగం (సీపీడబ్ల్యూడీ) వార్షిక నివేదిక పేర్కొంది. సరిహద్దుల్లో రహదారుల నిర్మాణం బాధ్యతలను ఈ సంస్థ చూసుకుంటుంది. సీపీడబ్ల్యూడీ పంపిన ప్రతిపాదనలు కేబినెట్ కమిటీ ఆమోదించే అవకాశాలున్నాయి. జమ్మూకశ్మీర్ మొదలుకొని అరుణాచల్ ప్రదేశ్ వరకు భారత్–చైనాల మధ్య 4 వేల కిలోమీటర్ల మేర వాస్తవ నియంత్రణ రేఖ ఉంది. ఎంతో కీలకమైన ఈ ప్రాంతంలో 44 రోడ్ల నిర్మాణానికి రూ.21వేల కోట్లు అవసరమవుతాయని అంచనా వేసింది. దీంతోపాటు రాజస్తాన్, పంజాబ్‌లలోని భారత్– పాక్ సరిహద్దు వెంబడి అంతర్గత, అనుసంధాన రహదారుల నిర్మాణానికి రూ.5,400 కోట్లు అవసరమవుతాయని ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment