Doklam Issue
-
సరిహద్దులో చైనా కొత్త ఎత్తుగడ
న్యూఢిల్లీ: డోక్లాం పీఠభూమి ప్రాంతంలో అన్ని కాలాలలో రహదారి మార్గం సుగమం చేసుకోవడానికి రోడ్డు నిర్మాణ కార్యకలాపాలను చైనా వేగవంతం చేసినట్లు ఎన్డీటీవీ సేకరించిన ఉపగ్రహ చిత్రాల ఆధారంగా వెల్లడయ్యింది. ఈ ప్రాంతంలో 2017లో చైనా భారత్ మధ్య 70 రోజుల పాటు ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ ప్రాంతంలోని చైనా నిర్మాణ కార్మికులు ఉపరితల సొరంగమార్గాన్ని 500 మీటర్ల వరకు పొడిగించుకున్నట్లు ఉపగ్రహ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. శీతాకాలంలో ఈ మార్గం అంతా మంచుతో కప్పబడి ఉంటుందని, దానికోసమే ఏ కాలంలోనైనా ప్రయాణించేలా ఈ రవాణా సౌకర్యాన్ని పెంచుకున్నట్లు స్పష్టమౌతోందని సైనిక నిపుణులు భావిస్తున్నారు. డోక్లాం పీఠభూమి తమ భూభాగంలోనిదేనంటూ చైనా, భూటాన్ ప్రకటించుకుంటున్నాయి. ఈ విషయంలో భారత్, భూటాన్‌కి మద్దతిస్తోంది. -
చైనా సరిహద్దుల్లో 44 కీలక రోడ్లు
న్యూఢిల్లీ: డోక్లాం ప్రతిష్టంభన, పాక్ సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. భారత్– చైనా సరిహద్దుల వెంబడి వ్యూహాత్మకమైన 44 రోడ్ల నిర్మాణం చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. అదేవిధంగా, పాకిస్తాన్‌తో సరిహద్దు వెంబడి పంజాబ్, రాజస్తాన్ రాష్ట్రాల పరిధిలో 2,100 కిలోమీటర్ల పొడవైన అంతర్గత, అనుసంధాన రహదారులను నిర్మించాలని యోచిస్తోంది. చైనాతో సరిహద్దుల్లో సంక్షోభం తలెత్తిన సందర్భాల్లో బలగాల తరలింపు వేగంగా జరిగేలా వ్యూహాత్మకంగా కీలకమైన 44 రోడ్లను నిర్మించాల్సి ఉందని కేంద్ర ప్రజా పనుల విభాగం (సీపీడబ్ల్యూడీ) వార్షిక నివేదిక పేర్కొంది. సరిహద్దుల్లో రహదారుల నిర్మాణం బాధ్యతలను ఈ సంస్థ చూసుకుంటుంది. సీపీడబ్ల్యూడీ పంపిన ప్రతిపాదనలు కేబినెట్ కమిటీ ఆమోదించే అవకాశాలున్నాయి. జమ్మూకశ్మీర్ మొదలుకొని అరుణాచల్ ప్రదేశ్ వరకు భారత్–చైనాల మధ్య 4 వేల కిలోమీటర్ల మేర వాస్తవ నియంత్రణ రేఖ ఉంది. ఎంతో కీలకమైన ఈ ప్రాంతంలో 44 రోడ్ల నిర్మాణానికి రూ.21వేల కోట్లు అవసరమవుతాయని అంచనా వేసింది. దీంతోపాటు రాజస్తాన్, పంజాబ్లలోని భారత్– పాక్ సరిహద్దు వెంబడి అంతర్గత, అనుసంధాన రహదారుల నిర్మాణానికి రూ.5,400 కోట్లు అవసరమవుతాయని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. -
‘56 అంగుళాల ఛాతి ఎప్పుడు చూపిస్తారు’
సాక్షి, న్యూఢిల్లీ : దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ చైనాతో ఉన్న డోక్లాం సమస్యను చర్చించకపోడంపై కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో రెండు రోజుల పాటు జరిగిన బ్రిక్స్ పదో శిఖరాగ్ర సదస్సులో మోదీ పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ సదస్సులో భాగంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మోదీ సమావేశం అయ్యారు. ఇరునేతల మధ్య సమావేశంలో జాతీయ సమస్య అయిన డోక్లాం గురించి ప్రధాని చర్చింకపోవడంపై కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా తీవ్రంగా తప్పుపట్టారు. రణ్‌దీప్ సూర్జేవాలా శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘జాతీయ సరిహద్దు సమస్య అయిన డోక్లాంపై చైనాతో ఎందుకు చర్చించలేదు. సరిహద్దులో చైనా దురాక్రమణను ఎందుకు ప్రశ్నించలేకపోయారు. 56 అంగుళాల ఛాతి, ఎర్రటి కళ్లు, ధైర్యంతో ప్రత్యర్ధిని ఎప్పుడు హెచ్చరిస్తారు. ఆ సమయం కోసం 132 కోట్ల మంది భారతీయులు ఎంతో ఆత్రుతగాఎదురుచూస్తున్నారు. డోక్లాంలో చైనా తన బలగాలను పటిష్టం చేస్తోందని ఇటీవల అమెరికా కాంగ్రెస్ కమిటీ పేర్కొంది. భారత సరిహద్దు భద్రతకు ముప్పు ఉందని అమెరికా ఇదివరకే ప్రకటించింది. అయినా ప్రధాని మోదీ, రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇంత వరకు ఏలాంటి చర్యలు తీసుకోలేదు. మోదీ గతంలో పలుమార్లు చైనా పర్యటనకు వెళ్లారు. కానీ భారత సరిహద్దులో చైనా చేస్తున్న దుశ్చర్యను మాత్రం ఖండించలేదు. భూటాన్‌తో చైనాకు ఏలాంటి దౌత్యపరమైన సంబంధాలు లేవు. అయినా కూడా భారత్ ప్రమేయం లేకుండా చైనా డోక్లాం అంశంపై భూటాన్‌తో చర్చలు జరిపింది’ అని వెల్లడించారు. -
‘మోదీ మాస్టర్ ప్లాన్‌తో ఉన్నారేమో!’
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. ప్రధాని నరేంద్ర మోదీపై వ్యంగ్యాస్త్రలు సంధించారు. డోక్లామ్ విషయంలో మౌనంగా ఉంటున్న ప్రధాని.. బహుశా పెద్ద ప్లాన్‌తోనే ఉన్నారేమోనంటూ ఎద్దేవా చేశారు. ఈ మేరకు మంగళవారం తన ట్విట్టర్లో రాహుల్ గాంధీ ఓ ట్వీట్ చేశారు. ‘డోక్లామ్ నుంచి భారత్ గుణపాఠాలు నేర్చుకుని ఉంటుందని చైనా అంటోంది. గత వారం ట్విట్టర్లో నిర్వహించిన ఓ పోల్‌లో 63 శాతం మంది మోదీ తన హగ్‌ప్లోమసీ(మోదీ కౌగిలింతలకు పెట్టిన పేరు)ని ఉపయోగించి కూడా డోక్లామ్ అంశానికి సమస్య చూపలేకపోతున్నారన్నారు. కానీ, మీరనుకునేది చాలా తప్పు. ఇండియా కోసం మన 56 ఇంచుల ఛాతీ(మోదీని ఉద్దేశించి) దగ్గర ఏదైనా పెద్ద ఉపాయమే ఉంటుందని భావిస్తున్నా’ అని రాహుల్ పేర్కొన్నారు. “India should have learnt lessons from Doklam” says China. Last week thousands took my Twitter poll. 63% felt Modi Ji would use hugplomacy, blame RM and cry in public to deal with the Doklam issue! For India’s sake, I hope you were wrong and our 56 inch strongman has a plan. https://t.co/2BiIisZHkl — Rahul Gandhi (@RahulGandhi) 27 March 2018 కాగా, డోక్లామ్ తమ దేశానికి చెందినదేనని.. గత అనుభవాలతో భారత్ గుణపాఠాలు నేర్చుకుని ఉంటుందని చైనా విదేశాంగ ప్రతినిధి వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ కేంద్ర వైఫల్యాన్ని ఎండగడుతూ ట్వీట్ చేశారన్న మాట. ఇది కూడా చదవండి.. భారత్ తప్పు సరిదిద్దుకో! -
భూటాన్ భారత్‌కు హ్యాండిస్తే ఎలా?
సాక్షి, న్యూఢిల్లీ : డోక్లాం సంక్షోభం సమసిసోయిందని సరిహద్దులో చైనా ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడటం లేదని విదేశాంగ శాఖ ఓ ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో ఒకవేళ చైనా-భూటాన్‌లు సంధి చేసుకుంటే.. మధ్యలో భారత్ పరిస్థితి ఏంటని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నారు. గురువారం విదేశాంగ శాఖ ప్రతినిధులతో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ భేటీ జరిగింది. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ... డోక్లాం ప్రస్తావన తీసుకొచ్చారు. ‘సరిహద్దులో సమస్య సమసిపోయినట్లేనని చెబుతున్నారు. అలాంటప్పుడు చైనా-భూటాన్‌లు ఓ ఏకాభిప్రాయానికి వస్తే భారత్ పరిస్థితి ఏంటి? సమస్యసాత్మక ప్రాంతంలో ఆ రెండు పొరుగు దేశాలు భూ ఒప్పందం చేసుకునే అవకాశాలు లేకపోలేదు కదా!. ఆ దిశగా మీకు ఏమైనా సమాచారం ఉందా?’ అని విదేశాంగ కార్యదర్శిని ప్రశ్నించారు. దీనికి స్పందించిన కార్యదర్శి విజయ్ గోఖలే.. అలాంటి అవకాశం ఉందని చెబుతూనే... పరిస్థితులు మాత్రం అందుకు సానుకూలంగా లేవని చెప్పటం కొసమెరుపు. అయితే ఈ విషయంలో భారత్ వెంటే తాము ఉంటామన్న సంకేతాలను భూటాన్ అందించిందని ఆయన వివరించారు. ఇక రక్షణ కార్యదర్శి సంజయ్ మిత్రా స్పందిస్తూ... పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని.. జూలై 2017 తర్వాత ఎలాంటి మోహరింపులు చోటు చేసుకోలేదని చెప్పారు. గత నెలలో శాటిలైట్ ఇమేజ్‌లు అనుమానాస్పద కట్టడాన్ని సూచించినప్పటికీ.. అది తమ సరిహద్దులోనే చేపడుతున్నట్లు చైనా వివరణ ఇచ్చిందని ఆయన వివరించారు. ఇక కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నేతృత్వంలోని ఈ ప్యానెల్.. సరిహద్దు సమస్యలు, రక్షణ చర్యలపై అధికారులతో భేటీలో సుదీర్ఘంగా చర్చించింది. -
‘అరుణాచల్’లోకి చొచ్చుకొచ్చిన చైనా
ఇటానగర్ / న్యూఢిల్లీ: గతేడాది డోక్లామ్ ఘటన మర్చిపోకముందే చైనా మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. చైనాకు చెందిన రోడ్డు నిర్మాణ సిబ్బంది డిసెంబర్ 28న అరుణాచల్‌ప్రదేశ్‌లోని టుటింగ్ ప్రాంతంలోకి కిలోమీటర్ మేర చొచ్చుకొచ్చారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భారత బలగాలు అడ్డుకోవడంతో వారంతా వెనక్కు మళ్లారని వెల్లడించాయి. ఈ ఘటనలో చైనా సిబ్బంది నుంచి రెండు ప్రొక్లెయినర్లతో పాటు పలు యంత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నాయి. చైనీయులు వేసిన రోడ్డుమార్గానికి అడ్డంగా భారత బలగాలు రాళ్లతో గోడను నిర్మించాయన్నారు. ఈ ప్రాంతం ఇండో టిబెటిన్ బోర్డర్ పోలీస్ పరిధిలోనే ఉన్నప్పటికీ.. ప్రస్తుతం ఇక్కడ ఆర్మీ భారీ సంఖ్యలో చేరుకుందని వెల్లడించారు. -
శీతాకాలంలోనూ డోక్లాంలో చైనా సైన్యం?
బీజింగ్: శీతాకాలంలో డోక్లాం వద్ద కాస్త ఎక్కువ సంఖ్యలోనే బలగాలను మోహరిస్తామని చైనా ఆర్మీ సంకేతాలిచ్చింది. ఆ ప్రాంతం చైనాదేనని మరోసారి పేర్కొంది. సరిహద్దుల్లో చైనా రోడ్డు నిర్మాణాన్ని ఆపేయడంతో రెండున్నర నెలల వివాదానికి ముగింపు పలుకుతూ భారత్ గత ఆగస్టు 28న ఈ సమస్యను పరిష్కరించుకోవడం తెలిసిందే. సాధారణంగా డోక్లాం వద్ద చలికాలంలో వాతావరణం మరింత కఠినంగా ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో భారత్, చైనాలు డోక్లాం ప్రాంతం నుంచి తమ బలగాలను ఉపసంహరించేవి. -
డోక్లాం తర్వాత మరో వివాదం?
సాక్షి, న్యూఢిల్లీ : భారత్-చైనాల మధ్య రెండు నెలలకుపైగా డోక్లాం వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన విషయం తెలిసిందే. భూటాన్‌కు మద్దతుగా భారత్ నిలవటం.. చైనా దుందుడుకు చేష్టలు.. ప్రతిగా భారత్ దళాలు ముందుకు దూసుకుపోవటం... ఇలా దాదాపు ట్రై జంక్షన్ వద్ద పరిస్థితులు యుద్ధ వాతావరణాన్నే తలపించాయి. చివరకు అంతర్జాతీయ సమాజం చొరవతో దౌత్యం ద్వారానే సమస్యను భారత్ సామరస్యంగా పరిష్కరించగలిగింది. అయితే రానున్న రోజుల్లో మరో సమస్య ద్వారా ఇరు దేశాల మధ్య వివాదం రాజుకునే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అదే నదుల సమస్య. ఎగువన ఉన్న బ్రహ్మపుత్ర, సట్లేజ్ నదులు చైనా గుండానే మన దేశంలో ప్రవహిస్తున్నాయి. అయితే ఆయా నదులకు వరదలు వచ్చే సమయంలో అప్రమత్తత చేయాల్సిన బాధ్యత చైనాదే. ఈ మేరకు ఇరు దేశాల మధ్య దశాబ్దాల క్రితమే కీలక ఒప్పందం కూడా జరిగింది. మే 15 నుంచి అక్టోబర్ 15 మధ్య ముఖ్యంగా వర్షకాల సమయంలో బీజింగ్ వాతావరణ శాఖ ఇచ్చే సమాచారమే మనకు ముఖ్యం. కానీ, డోక్లాం వివాద నేపథ్యంలో చైనా గత కొన్ని నెలలుగా ఎలాంటి సమాచారం ఇవ్వటంలేదు. ఈ ఏడాది సరిగ్గా అదే సమయంలో డోక్లాం వద్ద పరిస్థితులు ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో చైనా ఆ పని చేయలేదు. దీంతో బ్రహ్మపుత్ర నదికి సంభవించిన వరదల్లో 160 మంది అస్సాంలో మృతి చెందగా. రాష్ట్రంలోని 29 జిల్లాలు అతలాకుతలం అయి భారీగా నష్టం సంభవించింది. మరోవైపు సట్లేజ్ నదికి వచ్చిన వరదల్లో పంజాబ్‌లో 10 వేల ఎకరాల పంట భూమి నాశనం అయ్యింది. చైనా చెప్పేది నమ్మొచ్చా? దీనిపై బీజింగ్ వర్గాలు స్పందించాయి. హైడ్రోలాజికల్ డేటాను అందించకపోవటానికి కారణాలు వివరిస్తున్నాయి. టిబెట్ ప్రాంతంలో నెలకొల్పిన వరద గుర్తింపు కేంద్రాలు వరదల దాటికి నాశనం కావటంతోనే న్యూఢిల్లీ కేంద్రానికి సరైన సమాచారం అందించలేకపోయామని.. పునరుద్ధరణ పనులు ఎప్పటి వరకు పూర్తవుతాయో ఖచ్ఛితంగా చెప్పలేమని గెంగ్ షువాంగ్ అనే అధికారి తెలిపారు. అయితే మనతోపాటే ఒప్పందం చేసుకున్న బంగ్లాదేశ్‌కు మాత్రం చైనా పక్కా సమాచారం అందించటంతో .. డ్రాగన్ దేశం కావాలనే చేస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఈ అంశంపై వివాదం తలెత్తే అవకాశం లేకపోలేదన్నది విశ్లేషకుల మాట. -
మళ్లీ మళ్లీ ‘డోక్లాం’ వద్దు!
సరిహద్దు సమస్యలపై కలిసి ముందుకెళ్దాం ► ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ నిర్ణయం ► పరస్పర విశ్వాసం పెంచుకునేందుకు చర్యలు ► ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ముందడుగు ► అభిప్రాయ భేదాలు వివాదాలుగా మారొద్దు: మోదీ జియామెన్: 73 రోజులుగా భారత్–చైనా దేశాల మధ్య వివాదాలను సృష్టించిన డోక్లాం సమస్యకు ఫుల్స్టాప్ పెట్టాలని ఇరుదేశాలు నిర్ణయించాయి. సరిహద్దు సమస్యలను పక్కనపెట్టి ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా ప్రయత్నాలు ప్రారంభించాలని భారత్, చైనా దేశాల అధినేతలు ప్రధాని మోదీ, జిన్‌పింగ్‌లు నిర్ణయించారు. జియామెన్‌లో గంటసేపు ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. డోక్లాం వంటి సమస్యలు మళ్లీ ఇరుదేశాల మధ్య దూరాన్ని పెంచకుండా భద్రతా బలగాల మధ్య సహకారాన్ని బలోపేతం చేసేందుకు కృషిచేయాలని అధినేతలు నిర్ణయించారు. ఇరు దేశాల మధ్య అభిప్రాయభేదాలు వివాదాలుగా మారకుండా చర్చలతో పరిష్కరించుకుందామని మోదీ పిలుపునిచ్చారు. అనంతరం జిన్‌పింగ్‌తో జరిపిన ద్వైపాక్షిక సమావేశం ఫలప్రదమైందని మోదీ ట్వీట్ చేశారు. నిర్మాణాత్మక సంబంధాలపై.. భారత్–చైనా దేశాల అభివృద్ధికి తోడ్పాటునందించేలా సంయుక్త ఆర్థిక, భద్రత, వ్యూహాత్మక బృందాల ఏర్పాటుపైనా మోదీ–జిన్‌పింగ్ చర్చించారు. ఇరుదేశాల మధ్య పరస్పర విశ్వాసాన్ని పెంచుకోవటంపై ఇద్దరు నేతలు దృష్టిపెట్టారు. రక్షణ, భద్రతా బలగాలు బలమైన సంబంధాలను, సహకారాన్ని పెంపొందించుకుంటూ ఇటీవల జరిగిన పరిస్థితులు భవిష్యత్తులో జరగకుండా జాగ్రత్తపడాలని సమావేశంలో నిర్ణయించారు. ‘ఇరు దేశాల అధినేతలు, అధికారుల మధ్య నిర్మాణాత్మక, ముందుచూపుతో కూడిన సమావేశం జరిగింది. సరిహద్దుల్లో శాంతి నెలకొల్పటంతోపాటుగా ఇరుదేశాల సంబంధాలను అభివృద్ధి చేసుకునే దిశగా చర్చలు జరిగాయి’ అని చర్చల వివరాలను భారత విదేశాంగ కార్యదర్శి జైశంకర్ చెప్పారు. ఇరు దేశాల మధ్య భేదాభిప్రాయాలున్నప్పటికీ పరస్పర గౌరవంతో ఉమ్మడి వేదిక ద్వారా వీటిని పరిష్కరించుకునేలా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోనున్నారు. ఈ అభిప్రాయభేదాలు వివాదాలుగా మారకుండా ‘ఆస్తానా’ నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలని నిర్ణయించారు. బ్రిక్స్ సదస్సును విజయవంతంగా నిర్వహించినందుకు జిన్‌పింగ్‌కు మోదీ అభినందనలు తెలిపారు. తెరపైకి పంచశీల సూత్రాలు ‘పంచశీల శాంతి సూత్రాలు, పరస్పర రాజకీయ విశ్వాసం, పరస్పర ప్రయోజన సహకారం, ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధి విషయంలో భారత్‌తో కలిసి పనిచేసేందుకు చైనా సిద్ధంగా ఉంది’ అని జిన్‌పింగ్ అన్నారు. ‘భారత్, చైనా దేశాలు ఒకరికొకరు అవకాశాలు మాత్రమే. ముప్పు కాదు. ఇరుదేశాలు ఒకరికొకరు ముఖ్యమైన పొరుగుదేశాలు, కీలకమైన మార్కెట్లు, వర్దమాన దేశాలు. చైనా అభివృద్ధిని భారత్ సరైన, హేతువాద దృష్టికోణంతో చూస్తుందని భావిస్తున్నాం’ అని అన్నారు. ‘సరిహద్దుల్లో శాంతి నెలకొల్పేందుకు మనం కలిసి పనిచేద్దాం’ అని అన్నారు. సరిహద్దుల్లో శాంతి, సమానత్వం పెంచే అంశంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి కలిసి కృషిచేయాలని జిన్‌పింగ్ పేర్కొన్నారని.. చైనా విదేశాంగ అధికార ప్రతినిధి గెంగ్ పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణ, భాగస్వామ్యాన్ని బలోపేతం కోసం రెండు ప్రభుత్వాలు ఏకాభిప్రాయంతో పనిచేస్తున్నాయని ఇరువురు నేతలు పేర్కొన్నట్లు తెలిపారు. బ్రిక్స్ నాయకత్వంలో.. ఉగ్రవాద పోరాటంలో వ్యూహాత్మక సహకారంతో ముందుకెళ్లాలని మోదీ పునరుద్ఘాటించారు. మంగళవారం జరిగిన ‘బ్రిక్స్ వర్దమాన మార్కెట్లు, అభివృద్ధి చెందుతున్న దేశాల చర్చలు’ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ ‘మనం చేసే ప్రతి పని ప్రపంచంపై ప్రభావం చూపిస్తుంది. అందుకే సరైన ప్రపంచాన్ని నిర్మించటాన్ని మన బాధ్యతగా మార్చుఉందాం. వచ్చే పదేళ్లలో ప్రపంచంలో రానున్న మార్పులకు బ్రిక్స్ నాయకత్వం వహించాలి’ అని మోదీ సూచించారు. కార్యక్రమంలో బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా దేశాల ప్రతినిధులతోపాటుగా బ్రిక్స్ ఆతిథ్య దేశాలైన ఈజిప్టు, తజికిస్తాన్, థాయ్‌లాండ్, మెక్సికో, కెన్యా దేశాల ప్రతినిధులూ పాల్గొన్నారు. నేడు సూచీతో ద్వైపాక్షిక చర్చలు నేపితా: చైనా పర్యటన ముగించుకుని రెండ్రోజుల పర్యటన నిమిత్తం మయన్మార్ చేరుకున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. ఆ దేశాధ్యక్షుడు హెచ్టిన్ క్యావ్‌తో మోదీ సమావేశమైన ఇరుదేశాల మధ్య చారిత్రక సంబంధాల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం మోదీ మయన్మార్ సైనిక గౌరవ వందనం అందుకున్నారు. ఆ దేశ కౌన్సెలర్, ముఖ్యనేత ఆంగ్‌సాన్ సూచీతో బుధవారం ప్రధాని సమావేశమై పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నారు. ఈ సందర్భంగా రాఖినే రాష్ట్రంలో రోహింగ్యా ముస్లింలపై దాడులు, హింసపై మోదీ చర్చించనున్నట్లు తెలుస్తోంది. -
బ్రిక్స్ కొత్త పుంతలు
ఈసారి చైనాలోని జియామెన్‌లో జరిగిన బ్రిక్స్ దేశాధినేతల శిఖరాగ్ర సదస్సులో మన దేశానికి దౌత్యపరంగా ఘనవిజయం లభించింది. ఉగ్రవాద ఉదంతాలకు కారణమవుతున్న జైషే మహమ్మద్, లష్కరే తొయిబా సహా పలు పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలపై ఆ సదస్సు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేసింది. ఇలాంటి సంస్థలను ప్రోత్సహిస్తున్నవారిపై కఠినంగా వ్యవహరించాలని, ఆ ఉగ్రవాద సంస్థ లపై సమష్టిగా పోరాడాలని నిర్ణయించింది. ఇలాంటి తీర్మానం కోసం మన దేశం పలు సంవత్సరాలుగా పట్టుబడుతోంది. కానీ ప్రతిసారీ మన ప్రయత్నాలకు ఏదో సాకు చూపి అడ్డుతగులుతోంది. ఇన్నాళ్లకు చైనా సైతం భారత్‌తో గళం కలిపింది. తీర్మానానికి సహకరించింది. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ఎలాంటి నేపథ్యంలో జరి గిందో అందరికీ తెలుసు. రెండు నెలలక్రితం డోక్లాం వద్ద భారత్–చైనాల మధ్య తలెత్తిన వివాదం ఎటువైపు పోతుందో, దానివల్ల ఎలాంటి పరిణామాలు ఏర్పడ తాయోనని చాలామంది ఆందోళనపడ్డారు. ఒకవైపు బ్రిక్స్ సదస్సు తేదీలు దగ్గర పడుతున్నా పరిస్థితి మెరుగుపడకపోవడం కలవరం కలిగించింది. దీనికితోడు చైనాకు చెందిన వివిధ స్థాయి అధికారులు బెదిరింపులకు దిగారు. దీన్నంతటినీ గమనించాక ఆ సదస్సుకు అసలు ప్రధాని నరేంద్ర మోదీ వెళ్తారా లేదా అన్న సందేహం తలెత్తింది. కానీ చడీచప్పుడూ లేకుండా సాగిన దౌత్యం ఫలించింది. దళా లను వెనక్కు తీసుకోవాలని ఇరు దేశాలూ నిర్ణయించుకున్నాయి. పర్యవసానంగా బ్రిక్స్‌లో ఈ విజయం సాధ్యమైంది. ఈ విజయం చిన్నదేమీ కాదు. గోవాలో నిరుడు బ్రిక్స్ సదస్సు జరిగినప్పుడు ఉగ్రవాద సంస్థలను నేరుగా ఖండించాల్సిన అవసరం ఉన్నదని సభ్య దేశాలైన రష్యా, చైనా, బ్రెజిల్, దక్షిణాఫ్రికాలకు నచ్చజెప్పేందుకు మన దేశం చేయని ప్రయ త్నమంటూ లేదు. ఆ సదస్సులో మాట్లాడిన నరేంద్రమోదీ పాకిస్తాన్ తీరు తెన్నులను బ్రిక్స్ నేతల దృష్టికి తీసుకొచ్చారు. ఉగ్రవాద సంస్థలకు వత్తాసుగా నిలుస్తున్న పాకిస్తాన్‌కు రాజకీయ, ఆయుధ సాయాన్ని తగ్గించుకోవాలని పరో క్షంగా చైనాకు చెప్పారు. తీరా సంయుక్త ప్రకటన రూపొందే సమయానికి చైనా అడ్డుపుల్ల వేసింది. తనతో రష్యాను కూడా కలుపుకొంది. ఉగ్రవాదానికి అడ్డుకట్ట వేయాలని ‘ప్రపంచ దేశాలకు’ పిలుపునివ్వడం మినహా ఆ ప్రకటన మరేమీ చెప్ప లేకపోయింది. ఉగ్రవాద సంస్థ ఐఎస్నూ, సిరియాలో విధ్వంసాలకు పాల్పడుతున్న అల్‌కాయిదా, జభత్ అల్ నస్రా సంస్థలనూ ఖండించిన ఆ ప్రకటన జైషే మహ మ్మద్, లష్కరే తొయిబా, హక్కానీ నెట్ వర్క్ లాంటి సంస్థల పేరెత్తేందుకు ముందుకు రాలేదు. నిజానికి ఐఎస్‌తోపాటు ఈ సంస్థలన్నిటినీ ఐక్యరాజ్యసమితి చాన్నాళ్లక్రితం నిషేధించింది. అటువంటప్పుడు పాక్ ప్రేరేపిత సంస్థల విషయంలో వ్యత్యాసం చూపాల్సిన అవసరం ఏమున్నదని మన దేశం అడిగితే మౌనమే జవా బైంది. జైషే మహమ్మద్ మన పార్లమెంటు భవనంపై 2001లో దాడులకు పాల్ప డింది. 2008లో ముంబైపై లష్కరే తొయిబా దాడిచేసి 166మందిని పొట్టనబెట్టు కుంది. ఈ దాడులకు సూత్రధారులైనవారిని అప్పగించాలని కోరుతున్నా పాకిస్తాన్ బుకాయిస్తోంది. ఈ సంస్థల గురించి, వీటికి మద్దతిస్తున్న పాకిస్తాన్ తీరు గురించి గోవా సదస్సులో మోదీ చెప్పినప్పుడు చైనా, రష్యాలు ఆ దేశానికి బ్రిక్స్‌లో సభ్య త్వం లేదు కదా అన్న వాదన తీసుకొచ్చాయి. అయితే వాటి కార్యకలాపాల వల్ల బ్రిక్స్ సభ్య దేశం ఆర్ధికంగా దెబ్బతింటున్నప్పుడు దాని ప్రభావం సంస్థలో ఇతర దేశాలపైనా, అంతిమంగా సంస్థ ప్రగతి పైనా పడదా అని మన దేశం నిలదీసింది. అయితే చైనా, రష్యాలు చొరవ చూపలేదు. ఈసారి జియామెన్ సదస్సు చేసిన తీర్మానం మన ప్రచ్ఛన్న దౌత్యం సాధించిన విజయమని చెప్పుకోవాలి. అయితే ఈ విషయంలో చేయాల్సిన కృషి ఇంకా చాలా ఉంది. ఎందుకంటే రెండేళ్లక్రితం లష్కరే తొయిబా కమాండర్ జకీవుర్ రెహ్మాన్ లఖ్వీని జైలు నుంచి విడుదల చేసిన పాక్ వైఖరిని ఖండించే అభిశంసన తీర్మానానికి ఐక్యరాజ్యసమితి ఆంక్షల కమిటీలో చైనా అడ్డుపడింది. లఖ్వీకి సంబంధించి భారత్ తమకు సరైన సాక్ష్యాలు అందించలేకపోయిందని సాకు చెప్పింది. అటు తర్వాత జైషే చీఫ్ మసూద్ అజర్‌ను ‘ప్రపంచ ఉగ్రవాది’గా ప్రకటించే తీర్మానంపై కూడా ఇలాగే వ్యవహరించింది. ఐక్యరాజ్యసమితిలో ఏ దేశంపైన అయినా చర్య తీసుకోవడం మాట అటుంచి కనీసం అభిశంసించడం కూడా చాలా ప్రయాసతో కూడిన పని. భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వమున్న అయిదు దేశాల్లో ఏ ఒక్కటి కాదన్నా ఆ తీర్మానాలు వీగిపోతాయి. ఇప్పుడు బ్రిక్స్ సంయుక్త ప్రకటన చూస్తే ఉగ్రవాద సంస్థలపై చైనా వైఖరిలో మార్పు వచ్చినట్టే కనిపిస్తోంది. అది ఐక్యరాజ్య సమితి వంటి వేదికలపైన కూడా ప్రతిఫలిస్తుందా లేదా అన్నది చూడాలి. ఉగ్రవాదం విషయంలో మాత్రమే కాదు...ఇతరత్రా అంశాల్లో కూడా ఈసారి బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు చెప్పుకోదగ్గ పురోగతి సాధించింది. మారిన అంతర్జాతీయ పరిస్థితులకనుగుణంగా ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎం ఎఫ్)లలో సంస్కరణలు తీసుకురావాలని బ్రిక్స్ కోరింది. అమెరికా కనుసన్నల్లో ఉండే ఈ రెండు సంస్థల తీరుతెన్నులు, వర్ధమాన దేశాలకు సాయం అందించడంలో అవి విధించే ఆంక్షలు ఆ దేశాల అభివృద్ధికి అవరోధంగా ఉంటున్నాయన్న ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. డబ్లు్యటీఓ వంటి సంస్థల్లో వర్ధమాన దేశాలు కలిసికట్టుగా వ్యవహరించి అగ్రరాజ్యాలను ఎంతోకొంత అదుపు చేస్తున్నాయి. రాయితీలు పొందగలుగుతున్నాయి. కానీ ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌లలో మాత్రం ఆ పని చేయలేకపోతున్నాయి. ఇకపై ఆ పరిస్థితి ఉండబోదని బ్రిక్స్ తాజా తీర్మానం వెల్లడిస్తోంది. అలాగే ప్రపంచీకరణ పేరిట వర్ధమాన దేశాలపై అనేక నిబంధనలు విధించి అక్కడి మార్కెట్లను కబళించిన అగ్రరాజ్యాలు ఇప్పుడు ‘అమెరికా ఫస్ట్’వంటి రక్షణ విధానాలతో గోడలు నిర్మించుకుంటున్నాయి. ఈ తీరును కూడా బ్రిక్స్ తప్పుబట్టింది. ఈ పరిణామాలన్నీ శుభసూచకమైనవి. ఈ ఐక్యత ఇకపై కూడా కొనసాగుతుందని ఆశిద్దాం. -
డోక్లామ్‌లో భారత్ గస్తీ.. చైనా ఆగ్రహం
బీజింగ్: భారత్‌తో సరిహద్దు వివాదంపై చైనా మీడియా మరికొన్ని కీలక విషయాలను వెల్లడించింది. శాంతియుతంగా సమస్య పరిష్కారించుకోవాలని చైనా చెబుతూనే, వివాదాస్పద డోక్లామ్ ప్రాంతంలో 53 మంది భారత సైనికుల బృందం ఓ యుద్ధట్యాంకుతో ఎందుకు గస్తీ కాస్తుందని ప్రశ్నించింది. డోక్లామ్ తమ పరిధిలోకి వస్తుందని చెప్పినా భారత్ వెనక్కి తగ్గకపోవడంపై చైనా విదేశాంగశాఖ సీరియస్‌గా ఉంది. ఇరు దేశాల మధ్య యుద్ధానికి కౌంట్‌డౌన్ మొదలైందని పేర్కొన్న చైనా మీడియా.. ఇందుకు సంబంధించి చైనా ప్రభుత్వం నివేదిక తయారు చేసినట్లు తెలిపింది. యుద్ధం వస్తే అందుకు తాము సంసిద్ధంగా ఉన్నామంటూ 'డ్రాగన్' పదే పదే హెచ్చరిస్తున్నా.. వారి బెదిరింపులకు భారత్ వెనుకడుగు వేయలేదు. దాదాపు 50 రోజులుగా ఇరు దేశాల మధ్య వివాదం కొనసాగుతోంది. అయితే దాదాపు ఆరు వారాల పాటు 350 మంది భారత ఆర్మీ బృందం డోక్లామ్‌లో ఉన్నదని, జూలై నెలాఖరుకు ఓ యుద్ధట్యాంకుతో 40 మంది సైనికులు కాపాలా ఉన్నట్లు చైనా మీడియా ప్రచురించింది. ఆగస్టు రెండో తేదీ నాటికి వీరి సంఖ్య 48కి చేరుకోగా, రెండు రోజుల కింద భారత సైనికులు 53 మంది డోక్లామ్‌లో ఉన్నట్లు గుర్తించినట్లు చైనా రక్షణశాఖ అధికార ప్రతినిధి గెంగ్ షువాంగ్ తెలిపారు. భారత్ చర్యలు తమ సైన్యం ఉత్తరాఖండ్, కశ్మీర్లోకి అడుగుపెట్టేలా ఉన్నాయని పేర్కొన్న ఓ చైనా ప్రతినిధి.. డోక్లామ్ సమస్యకు శాంతి చర్చలతో పరిష్కారం అవుతుందన్న నమ్మకం లేదన్నారు. తమ భూభాగాలతో పాటు సార్వభౌమత్వాన్ని కాపాడుకునే సామర్థ్యం తమకు ఉందంటూ భారత్‌కు హెచ్చరికలు పంపింది. డోక్లామ్‌లో భారత బలగాలను వెనక్కి రప్పించాలని లేనిపక్షంలో యుద్ధానికి సమయం ఆసన్నమైందని, జరగబోయే పరిణామాలకు సిద్ధంగా ఉండాలని చైనా భావిస్తున్నట్లు అక్కడి మీడియాలో ప్రచారం జరుగుతోంది. -
యుద్ధానికి కౌంట్ డౌన్ స్టార్ట్: చైనా మీడియా
న్యూఢిల్లీ: ఓ పక్క శాంతి సమన్వయంతో ముందుకెళ్లాలంటూనే చైనా మరోసారి రెచ్చగొట్టే చర్యకు దిగింది. ముఖ్యంగా ఆ దేశ మీడియా గొడవను మరింత పెద్దది చేసేలా కథనాన్ని వెలువరించింది. ఇక భారతదేశంతో యుద్ధానికి కౌంట్ డౌన్ మొదలయ్యిందని(కౌంట్ డౌన్ స్టార్ట్ టు మిలిటరీ యాక్షన్) అంటూ చైనా అధికార పత్రిక కథనం పేర్కొంది. చైనాకు చెందిన ఓ ఉన్నతాధికారి కూడా ఈ వ్యాఖ్యలు బలపరిచేలా మాట్లాడారు. ఢిల్లీ చేస్తున్న చర్యలు తమ సైన్యం ఉత్తరాఖండ్, కశ్మీర్లోకి అడుగుపెట్టేలా ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు. డోక్లామ్ సమస్యకు శాంతి చర్చలతో పరిష్కారం అవుతుందన్న ఆశలు సన్నగిల్లాయని పేర్కొన్నారు. మరోపక్క, సమరానికి సమయం దగ్గరపడిందని, శాంతి ద్వారాలు మూసుకుపోయాయని, జరగబోయే పరిణామాలకు భారత్ పూర్తి బాధ్యత వహించాలంటూ చైనాకు చెందిన ఓ అధికార పత్రిక కథనం రాసింది.