మళ్లీ మళ్లీ ‘డోక్లాం’ వద్దు!
సరిహద్దు సమస్యలపై కలిసి ముందుకెళ్దాం
► ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ నిర్ణయం
► పరస్పర విశ్వాసం పెంచుకునేందుకు చర్యలు
► ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ముందడుగు
► అభిప్రాయ భేదాలు వివాదాలుగా మారొద్దు: మోదీ
జియామెన్: 73 రోజులుగా భారత్–చైనా దేశాల మధ్య వివాదాలను సృష్టించిన డోక్లాం సమస్యకు ఫుల్‌స్టాప్ పెట్టాలని ఇరుదేశాలు నిర్ణయించాయి. సరిహద్దు సమస్యలను పక్కనపెట్టి ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా ప్రయత్నాలు ప్రారంభించాలని భారత్, చైనా దేశాల అధినేతలు ప్రధాని మోదీ, జిన్‌పింగ్‌లు నిర్ణయించారు. జియామెన్‌లో గంటసేపు ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి.
డోక్లాం వంటి సమస్యలు మళ్లీ ఇరుదేశాల మధ్య దూరాన్ని పెంచకుండా భద్రతా బలగాల మధ్య సహకారాన్ని బలోపేతం చేసేందుకు కృషిచేయాలని అధినేతలు నిర్ణయించారు. ఇరు దేశాల మధ్య అభిప్రాయభేదాలు వివాదాలుగా మారకుండా చర్చలతో పరిష్కరించుకుందామని మోదీ పిలుపునిచ్చారు. అనంతరం జిన్‌పింగ్‌తో జరిపిన ద్వైపాక్షిక సమావేశం ఫలప్రదమైందని మోదీ ట్వీట్ చేశారు.
నిర్మాణాత్మక సంబంధాలపై..
భారత్–చైనా దేశాల అభివృద్ధికి తోడ్పాటునందించేలా సంయుక్త ఆర్థిక, భద్రత, వ్యూహాత్మక బృందాల ఏర్పాటుపైనా మోదీ–జిన్‌పింగ్ చర్చించారు. ఇరుదేశాల మధ్య పరస్పర విశ్వాసాన్ని పెంచుకోవటంపై ఇద్దరు నేతలు దృష్టిపెట్టారు. రక్షణ, భద్రతా బలగాలు బలమైన సంబంధాలను, సహకారాన్ని పెంపొందించుకుంటూ ఇటీవల జరిగిన పరిస్థితులు భవిష్యత్తులో జరగకుండా జాగ్రత్తపడాలని సమావేశంలో నిర్ణయించారు. ‘ఇరు దేశాల అధినేతలు, అధికారుల మధ్య నిర్మాణాత్మక, ముందుచూపుతో కూడిన సమావేశం జరిగింది.
సరిహద్దుల్లో శాంతి నెలకొల్పటంతోపాటుగా ఇరుదేశాల సంబంధాలను అభివృద్ధి చేసుకునే దిశగా చర్చలు జరిగాయి’ అని చర్చల వివరాలను భారత విదేశాంగ కార్యదర్శి జైశంకర్ చెప్పారు. ఇరు దేశాల మధ్య భేదాభిప్రాయాలున్నప్పటికీ పరస్పర గౌరవంతో ఉమ్మడి వేదిక ద్వారా వీటిని పరిష్కరించుకునేలా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోనున్నారు. ఈ అభిప్రాయభేదాలు వివాదాలుగా మారకుండా ‘ఆస్తానా’ నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలని నిర్ణయించారు. బ్రిక్స్ సదస్సును విజయవంతంగా నిర్వహించినందుకు జిన్‌పింగ్‌కు మోదీ అభినందనలు తెలిపారు.
తెరపైకి పంచశీల సూత్రాలు
‘పంచశీల శాంతి సూత్రాలు, పరస్పర రాజకీయ విశ్వాసం, పరస్పర ప్రయోజన సహకారం, ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధి విషయంలో భారత్‌తో కలిసి పనిచేసేందుకు చైనా సిద్ధంగా ఉంది’ అని జిన్‌పింగ్ అన్నారు. ‘భారత్, చైనా దేశాలు ఒకరికొకరు అవకాశాలు మాత్రమే. ముప్పు కాదు. ఇరుదేశాలు ఒకరికొకరు ముఖ్యమైన పొరుగుదేశాలు, కీలకమైన మార్కెట్‌లు, వర్దమాన దేశాలు. చైనా అభివృద్ధిని భారత్ సరైన, హేతువాద దృష్టికోణంతో చూస్తుందని భావిస్తున్నాం’ అని అన్నారు.
‘సరిహద్దుల్లో శాంతి నెలకొల్పేందుకు మనం కలిసి పనిచేద్దాం’ అని అన్నారు. సరిహద్దుల్లో శాంతి, సమానత్వం పెంచే అంశంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి కలిసి కృషిచేయాలని జిన్‌పింగ్ పేర్కొన్నారని.. చైనా విదేశాంగ అధికార ప్రతినిధి గెంగ్ పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణ, భాగస్వామ్యాన్ని బలోపేతం కోసం రెండు ప్రభుత్వాలు ఏకాభిప్రాయంతో పనిచేస్తున్నాయని ఇరువురు నేతలు పేర్కొన్నట్లు తెలిపారు.
బ్రిక్స్ నాయకత్వంలో..
ఉగ్రవాద పోరాటంలో వ్యూహాత్మక సహకారంతో ముందుకెళ్లాలని మోదీ పునరుద్ఘాటించారు. మంగళవారం జరిగిన ‘బ్రిక్స్ వర్దమాన మార్కెట్లు, అభివృద్ధి చెందుతున్న దేశాల చర్చలు’ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ ‘మనం చేసే ప్రతి పని ప్రపంచంపై ప్రభావం చూపిస్తుంది. అందుకే సరైన ప్రపంచాన్ని నిర్మించటాన్ని మన బాధ్యతగా మార్చుఉందాం. వచ్చే పదేళ్లలో ప్రపంచంలో రానున్న మార్పులకు బ్రిక్స్ నాయకత్వం వహించాలి’ అని మోదీ సూచించారు. కార్యక్రమంలో బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా దేశాల ప్రతినిధులతోపాటుగా బ్రిక్స్ ఆతిథ్య దేశాలైన ఈజిప్టు, తజికిస్తాన్, థాయ్‌లాండ్, మెక్సికో, కెన్యా దేశాల ప్రతినిధులూ పాల్గొన్నారు.
నేడు సూచీతో ద్వైపాక్షిక చర్చలు
నేపితా: చైనా పర్యటన ముగించుకుని రెండ్రోజుల పర్యటన నిమిత్తం మయన్మార్ చేరుకున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. ఆ దేశాధ్యక్షుడు హెచ్‌టిన్ క్యావ్‌తో మోదీ సమావేశమైన ఇరుదేశాల మధ్య చారిత్రక సంబంధాల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం మోదీ మయన్మార్ సైనిక గౌరవ వందనం అందుకున్నారు. ఆ దేశ కౌన్సెలర్, ముఖ్యనేత ఆంగ్‌సాన్ సూచీతో బుధవారం ప్రధాని సమావేశమై పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నారు. ఈ సందర్భంగా రాఖినే రాష్ట్రంలో రోహింగ్యా ముస్లింలపై దాడులు, హింసపై మోదీ చర్చించనున్నట్లు తెలుస్తోంది.