నరేంద్ర మోదీ- జిన్‌పింగ్ (ఫైల్ ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ చైనాతో ఉన్న డోక్లాం సమస్యను చర్చించకపోడంపై కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో రెండు రోజుల పాటు జరిగిన బ్రిక్స్ పదో శిఖరాగ్ర సదస్సులో మోదీ పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ సదస్సులో భాగంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మోదీ సమావేశం అయ్యారు. ఇరునేతల మధ్య సమావేశంలో జాతీయ సమస్య అయిన డోక్లాం గురించి ప్రధాని చర్చింకపోవడంపై కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా తీవ్రంగా తప్పుపట్టారు.
రణ్‌దీప్ సూర్జేవాలా శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘జాతీయ సరిహద్దు సమస్య అయిన డోక్లాంపై చైనాతో ఎందుకు చర్చించలేదు. సరిహద్దులో చైనా దురాక్రమణను ఎందుకు ప్రశ్నించలేకపోయారు. 56 అంగుళాల ఛాతి, ఎర్రటి కళ్లు, ధైర్యంతో ప్రత్యర్ధిని ఎప్పుడు హెచ్చరిస్తారు. ఆ సమయం కోసం 132 కోట్ల మంది భారతీయులు ఎంతో ఆత్రుతగాఎదురుచూస్తున్నారు. డోక్లాంలో చైనా తన బలగాలను పటిష్టం చేస్తోందని ఇటీవల అమెరికా కాంగ్రెస్ కమిటీ పేర్కొంది.
భారత సరిహద్దు భద్రతకు ముప్పు ఉందని అమెరికా ఇదివరకే ప్రకటించింది. అయినా ప్రధాని మోదీ, రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇంత వరకు ఏలాంటి చర్యలు తీసుకోలేదు. మోదీ గతంలో పలుమార్లు చైనా పర్యటనకు వెళ్లారు. కానీ భారత సరిహద్దులో చైనా చేస్తున్న దుశ్చర్యను మాత్రం ఖండించలేదు. భూటాన్‌తో చైనాకు ఏలాంటి దౌత్యపరమైన సంబంధాలు లేవు. అయినా కూడా భారత్ ప్రమేయం లేకుండా చైనా డోక్లాం అంశంపై భూటాన్‌తో చర్చలు జరిపింది’ అని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment