డోక్లామ్‌లో భారత్ గస్తీ.. చైనా ఆగ్రహం
బీజింగ్: భారత్‌తో సరిహద్దు వివాదంపై చైనా మీడియా మరికొన్ని కీలక విషయాలను వెల్లడించింది. శాంతియుతంగా సమస్య పరిష్కారించుకోవాలని చైనా చెబుతూనే, వివాదాస్పద డోక్లామ్ ప్రాంతంలో 53 మంది భారత సైనికుల బృందం ఓ యుద్ధట్యాంకుతో ఎందుకు గస్తీ కాస్తుందని ప్రశ్నించింది. డోక్లామ్ తమ పరిధిలోకి వస్తుందని చెప్పినా భారత్ వెనక్కి తగ్గకపోవడంపై చైనా విదేశాంగశాఖ సీరియస్‌గా ఉంది. ఇరు దేశాల మధ్య యుద్ధానికి కౌంట్‌డౌన్ మొదలైందని పేర్కొన్న చైనా మీడియా.. ఇందుకు సంబంధించి చైనా ప్రభుత్వం నివేదిక తయారు చేసినట్లు తెలిపింది.
యుద్ధం వస్తే అందుకు తాము సంసిద్ధంగా ఉన్నామంటూ 'డ్రాగన్' పదే పదే హెచ్చరిస్తున్నా.. వారి బెదిరింపులకు భారత్ వెనుకడుగు వేయలేదు. దాదాపు 50 రోజులుగా ఇరు దేశాల మధ్య వివాదం కొనసాగుతోంది. అయితే దాదాపు ఆరు వారాల పాటు 350 మంది భారత ఆర్మీ బృందం డోక్లామ్‌లో ఉన్నదని, జూలై నెలాఖరుకు ఓ యుద్ధట్యాంకుతో 40 మంది సైనికులు కాపాలా ఉన్నట్లు చైనా మీడియా ప్రచురించింది. ఆగస్టు రెండో తేదీ నాటికి వీరి సంఖ్య 48కి చేరుకోగా, రెండు రోజుల కింద భారత సైనికులు 53 మంది డోక్లామ్‌లో ఉన్నట్లు గుర్తించినట్లు చైనా రక్షణశాఖ అధికార ప్రతినిధి గెంగ్ షువాంగ్ తెలిపారు.
భారత్ చర్యలు తమ సైన్యం ఉత్తరాఖండ్, కశ్మీర్‌లోకి అడుగుపెట్టేలా ఉన్నాయని పేర్కొన్న ఓ చైనా ప్రతినిధి.. డోక్లామ్ సమస్యకు శాంతి చర్చలతో పరిష్కారం అవుతుందన్న నమ్మకం లేదన్నారు. తమ భూభాగాలతో పాటు సార్వభౌమత్వాన్ని కాపాడుకునే సామర్థ్యం తమకు ఉందంటూ భారత్‌కు హెచ్చరికలు పంపింది. డోక్లామ్‌లో భారత బలగాలను వెనక్కి రప్పించాలని లేనిపక్షంలో యుద్ధానికి సమయం ఆసన్నమైందని, జరగబోయే పరిణామాలకు సిద్ధంగా ఉండాలని చైనా భావిస్తున్నట్లు అక్కడి మీడియాలో ప్రచారం జరుగుతోంది.