140 Inmates Test HIV Positive In Uttar Pradesh Dasna Jail - Sakshi
Sakshi News home page

కలకలం.. జైల్లో 140 మంది ఖైదీలకు హెచ్‌ఐవీ నిర్ధారణ

Published Sat, Nov 19 2022 3:30 PM | Last Updated on Sat, Nov 19 2022 4:18 PM

140 Inmates Test HIV Positive In Uttar Pradesh Dasna Jail - Sakshi

లక్నో: జైలులో 140 మంది ఖైదీలకు హెచ్‌ఐవీ నిర్ధారణ కావడం సంచలనం రేపుతోంది. మరో 35 మందికి టీబీ ఉన్నట్లు తేలింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో ఘజియాబాద్‌లోని దాస్నా జైలులో వెలుగు చూసింది. ఈ విషయాన్ని స్వయంగా జైలు సీనియర్‌ అధికారులే ధ్రువీకరించారు. మొత్తం జైలులో 5500 మంది ఖైదీలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించగా.. అందులో 140 మంది ఖైదీలకు హెచ్‌ఐవీ పాజిటివ్‌గా తేలిందని వెల్లడించారు.

కాగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. జైలు లోపలికి వచ్చే ప్రతీ ఖైదీకి హెచ్ఐవీ, టీబీ పరీక్షలు నిర్వహించడం తప్పనిసరి. ఘజియాబాద్ జైలులోని ఖైదీలకు ఎమ్‌ఎమ్‌జీ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న యాంటీరెట్రోవైరల్ థెరపీ సెంటర్ వైద్యులు పరీక్షలు చేస్తారని జైలు సూపరింటెండెంట్ అలోక్ కుమార్ సింగ్ తెలిపారు.

2016లో ఘజియాబాద్‌ దస్నా జిల్లా జైల్లోకి వచ్చిన ఖైదీలకు పరీక్షలు చేయగా అందులో 46 మందికి హెచ్‌ఐవీ నిర్ధారణ అయ్యింది. అప్పటి నుంచి వారు జైల్లోనే ఉంటున్నారు. ప్రస్తుతం హెచ్‌ఐవీ బారిన పడిన బాధితుల సంఖ్య 140కి చేరిందని అలోక్ కుమార్ సింగ్ తెలిపారు. అందులో 35 మందికి టీబీ కూడా సోకిందని వెల్లడించారు. రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ద్వారా హెచ్‌ఐవీ రోగులకు చికిత్స అందిస్తున్నామన్నారు.

పరిమితికి మించిన ఖైదీలతో దస్నా జైలు కిక్కిరిసి పోయిందని అధికారులు తెలిపారు. జైలులో 1706 మంది ఖైదీలను మాత్రమే ఉంచేందుకు సదుపాయాలు ఉండగా.. ప్రస్తుతం జైలులో మొత్తం 5,500 మంది ఖైదీలు ఉన్నట్లు పేర్కొన్నారు. 2016 నుంచి ఇప్పటి వరకు సుమారుగా 120 నుంచి 150 మంది హెచ్‌ఐవీ బాధితులు జైల్లో ఉన్నారని పేర్కొన్నారు.

ఈ వ్యాధి స్పర్శ ద్వారా వ్యాపించదని, ప్రభుత్వ సూచనల మేరకు ఈ ఖైదీలందరినీ సాధారణ ఖైదీలతో పాటు ఉంచుతున్నామని అధికారులు చెప్పారు. ప్రస్తుతానికి భయపడాల్సిన పని లేదన్నారు. హెచ్‌ఐవీ బారిన పడిన ఖైదీల్లో ఎక్కువ డ్రగ్స్‌కు బానిసలని, డ్రగ్స్ కోసం వాడే సిరంజీలను వాడడం వల్ల ఇన్ఫెక్షన్ బారిన పడి ఉంటారని జైలు అధికారులు భావిస్తున్నారు. 
చదవండి: అది మసాజ్ కాదు.. ట్రీట్‌మెంట్‌.. జైలు వీడియోపై ఆప్‌ కౌంటర్‌..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement