ghaziabad jail
-
కలకలం.. జైల్లో 140 మంది ఖైదీలకు హెచ్ఐవీ నిర్ధారణ
లక్నో: జైలులో 140 మంది ఖైదీలకు హెచ్ఐవీ నిర్ధారణ కావడం సంచలనం రేపుతోంది. మరో 35 మందికి టీబీ ఉన్నట్లు తేలింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో ఘజియాబాద్‌లోని దాస్నా జైలులో వెలుగు చూసింది. ఈ విషయాన్ని స్వయంగా జైలు సీనియర్ అధికారులే ధ్రువీకరించారు. మొత్తం జైలులో 5500 మంది ఖైదీలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించగా.. అందులో 140 మంది ఖైదీలకు హెచ్ఐవీ పాజిటివ్‌గా తేలిందని వెల్లడించారు. కాగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. జైలు లోపలికి వచ్చే ప్రతీ ఖైదీకి హెచ్ఐవీ, టీబీ పరీక్షలు నిర్వహించడం తప్పనిసరి. ఘజియాబాద్ జైలులోని ఖైదీలకు ఎమ్‌ఎమ్‌జీ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న యాంటీరెట్రోవైరల్ థెరపీ సెంటర్ వైద్యులు పరీక్షలు చేస్తారని జైలు సూపరింటెండెంట్ అలోక్ కుమార్ సింగ్ తెలిపారు. 2016లో ఘజియాబాద్ దస్నా జిల్లా జైల్లోకి వచ్చిన ఖైదీలకు పరీక్షలు చేయగా అందులో 46 మందికి హెచ్ఐవీ నిర్ధారణ అయ్యింది. అప్పటి నుంచి వారు జైల్లోనే ఉంటున్నారు. ప్రస్తుతం హెచ్ఐవీ బారిన పడిన బాధితుల సంఖ్య 140కి చేరిందని అలోక్ కుమార్ సింగ్ తెలిపారు. అందులో 35 మందికి టీబీ కూడా సోకిందని వెల్లడించారు. రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ద్వారా హెచ్ఐవీ రోగులకు చికిత్స అందిస్తున్నామన్నారు. పరిమితికి మించిన ఖైదీలతో దస్నా జైలు కిక్కిరిసి పోయిందని అధికారులు తెలిపారు. జైలులో 1706 మంది ఖైదీలను మాత్రమే ఉంచేందుకు సదుపాయాలు ఉండగా.. ప్రస్తుతం జైలులో మొత్తం 5,500 మంది ఖైదీలు ఉన్నట్లు పేర్కొన్నారు. 2016 నుంచి ఇప్పటి వరకు సుమారుగా 120 నుంచి 150 మంది హెచ్ఐవీ బాధితులు జైల్లో ఉన్నారని పేర్కొన్నారు. ఈ వ్యాధి స్పర్శ ద్వారా వ్యాపించదని, ప్రభుత్వ సూచనల మేరకు ఈ ఖైదీలందరినీ సాధారణ ఖైదీలతో పాటు ఉంచుతున్నామని అధికారులు చెప్పారు. ప్రస్తుతానికి భయపడాల్సిన పని లేదన్నారు. హెచ్ఐవీ బారిన పడిన ఖైదీల్లో ఎక్కువ డ్రగ్స్‌కు బానిసలని, డ్రగ్స్ కోసం వాడే సిరంజీలను వాడడం వల్ల ఇన్ఫెక్షన్ బారిన పడి ఉంటారని జైలు అధికారులు భావిస్తున్నారు. చదవండి: అది మసాజ్ కాదు.. ట్రీట్మెంట్.. జైలు వీడియోపై ఆప్ కౌంటర్.. -
వైద్య సహాయకునిగా రాజేష్, టీచర్‌గా నూపుర్ తల్వార్!!
యావజ్జీవ జైలు శిక్ష పడిన తల్వార్ దంపతులు జైల్లో కొత్త పాత్రలు పోషిస్తున్నారు. రాజేష్ తల్వార్‌కు జైలు ఆస్పత్రిలో సీనియర్ వైద్యులకు సహాయకుని బాధ్యతలు అప్పగించగా, నూపుర్ తల్వార్‌కు టాచర్ పని అప్పగించారు. వీళ్లిద్దరూ బాగా ఉన్నత విద్యావంతులు కావడంతో వాళ్లకు తగిన పని అప్పజెప్పాలన్న ఉద్దేశంతో ఈ బాధ్యతలు ఇచ్చారు. ఇందుకు గాను వారిద్దరికీ జైలు నిబంధనల ప్రకారం తగిన వేతనం కూడా చెల్లిస్తామని ఘజియాబాద్ జైలు సూపరింటెండెంట్ వీరేష్ రాజ్ శర్మ తెలిపారు. వాళ్లు ఒక్క ఆదివారం తప్ప మిగిలిన అన్ని రోజుల్లోనూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేయాల్సి ఉంటుంది. బుధవారం నాడే వాళ్లు పని మొదలుపెట్టారు. రాజేష్, నూపుర్‌లను వరుసగా 11, 13 నెంబరు బ్యారక్‌లలో ఉంచారు. వీటిలో వాళ్లతో పాటు 11, 35 మంది ఇతర ఖైదీలుంటారు. రాజేష్ తల్వార్‌కు ఖైదీ నెంబర్ 9342, నూపుర్‌కు 9343 కేటాయించారు. వీళ్లిద్దరికీ జైల్లో వీఐపీ హోదా మాత్రం ఇవ్వడంలేదు. దంపతులిద్దరూ నవళ్లు చదవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. జైలుకు వచ్చేటప్పుడే నూపుర్ మూడు నవళ్లు తీసుకున్నారు. వార్తాపత్రికలు మాత్రం వాళ్లు చదవడంలేదని సూపరింటెండెంట్ శర్మ చెప్పారు.