మోర్బీ: గుజరాత్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. మోర్బీ జిల్లాలోని ప్రాంతంలో మచ్చు నదిపైనున్న కేబుల్ బ్రిడ్జి ఆదివారం సాయంత్రం కుప్పకూలింది. ఉన్నట్టుండి బ్రిడ్జి తెగిపోవడంతో పెద్ద సంఖ్యలో పర్యాటకులు నదిలో పడిపోయారు. బ్రిడ్జి కూలిన ఘటనలో మృతుల సంఖ్య 132కు చేరింది. ఇప్పటివరకు 177 మందిని రక్షించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని పోలీసులు పేర్కొన్నారు. ప్రమాద సమయంలో వంతెనపై దాదాపు 500 మందికిపైగా ఉన్నట్లు తెలిపారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, ఎన్డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక బృందాలు సహాయక చర్యల్లో పలుపంచుకుంటున్నారని చెప్పారు.
Early morning visuals from the accident site in #Morbi where over 130 people have died after a cable bridge collapsed.
Gujarat Minister Harsh Sanghavi present at the spot. pic.twitter.com/mOtsYcINt2
— NDTV (@ndtv) October 31, 2022
మోర్బీలోని మచ్చు నదిపై కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి చెందారు. వెంటనే గుజరాత్ సీఎం గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో ఫోన్‌లో మాట్లాడారు మోదీ. ఘటన వివరాలను తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు.ఈ ఘటనలో మరణించిన వారికి గుజరాత్ ప్రభుత్వం రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించగా, కేంద్రం రూ.2 లక్షలు ప్రకటించింది. గాయపడిన వారికి రూ.50 వేల సాయం ప్రకటించింది. ఇక మోదీ అహ్మదాబాద్‌లో తలపెట్టిన రోడ్ షోను ప్రమాదం నేపథ్యంలో రద్దు చేసుకున్నారు.
కట్టింది 1880లో...!
తీగల సాయంతో వేలాడే మోర్బీ సస్పెన్షన్ బ్రిడ్జిపై నడవడం సందర్శకులకు మధురానుభూతి కలిగిస్తుంది. నిత్యం వందలాది మంది దీన్ని సందర్శిస్తుంటారు. ఇది 140 ఏళ్ల నాటిది! 1879 ఫిబ్రవరి 20న అప్పటి ముంబై గవర్నర్ రిచర్డ్ టెంపుల్ దీని నిర్మాణాన్ని ప్రారంభించారు. 1880లో నిర్మాణం పూర్తయ్యింది. ఇందుకు అప్పట్లోనే రూ.3.5 లక్షలు ఖర్చయ్యాయి. వంతెన పొడవు 765 అడుగులు (233 మీటర్లు). వెడల్పు 1.25 మీటర్లు. దీని నిర్మాణానికి అవసరమైన సామగ్రిని ఇంగ్లండ్ నుంచి తెప్పించారు. నాటి మోర్బీ పాలకుడు సర్ వాగ్జీ ఠాకూర్ అప్పట్లో యూరప్‌లో ఉన్న అత్యాధునిక పరిజ్ఞానాలను రంగరించి దీన్ని కట్టించాడు. ఇది మోర్బీ పట్టణంలోని దర్బార్‌గఢ్, నజార్‌బాగ్ ప్రాంతాలను అనుసంధానిస్తుంది. దీన్ని చారిత్రక వారసత్వ కట్టడాల జాబితాలో చేర్చారు.
7 నెలల పాటు రిపేర్లు.. 26వ తేదీనే రీ ఓపెన్
బ్రిటిష్ హయాంలో కట్టిన ఈ పాదచారుల వంతెనను ఇంజనీరింగ్ అద్భుతంగా చెబుతుంటారు. దీనికి ఇటీవలే మరమ్మతులు చేయడంతో పాటు ఆధునీకరించారు. రూ.2 కోట్లతో 7 నెలలకు పైగా పనులు జరిగాయి. ఈ సందర్భంగా వంతెన ఏ మేరకు సురక్షితమన్న అంశం గుజరాత్ అసెంబ్లీలో కూడా చర్చకు వచ్చింది. దీని పటిష్టతపై పలువురు ఎమ్మెల్యేలు అనుమానం వ్యక్తం చేయగా అంతా బాగానే ఉందని ప్రభుత్వం బదులిచ్చింది. గుజరాతీ నూతన సంవత్సరం సందర్భంగా ఈ నెల 26వ తేదీన రీ ఓపెన్ చేసి సందర్శకులను అనుమతిస్తున్నారు. నాలుగు రోజులకే ఘోరం జరిగిపోయింది. మరమ్మతుల తర్వాత వంతెనకు మున్సిపాలిటీ ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఇంకా అందలేదని అధికారులు తెలిపారు.
1979లో బద్దలైన మచ్చూ డ్యాం... వేలాదిమంది జలసమాధి
మోర్బీ పట్టణంలో తీగల వంతెన ప్రమాదం 1979లో ఇదే మచ్చూ నదిపై జరిగిన ఘోర దుర్ఘటనను మరోసారి గుర్తుకు తెచి్చంది. 1979 ఆగస్టు 11న మోర్బీ సమీపంలోని మచ్చూ–2 డ్యామ్ తెగిపోయింది. దాంతో పట్టణాన్ని భారీ వరద ముంచెత్తింది. ఈ విషాదంలో 2,000 మందికిపైగా చనిపోయారు. సౌరాష్ట్రలో కరువు పీడిత ప్రాంతాలకు సాగునీరు అందించడానికి ఈ డ్యామ్‌ను 1972లో నిర్మించారు.
Comments
Please login to add a commentAdd a comment