12 Members Of Rajkot BJP MP Family Killed In Morbi Bridge Collapse - Sakshi
Sakshi News home page

Morbi Bridge Collapse: కేబుల్‌ బ్రిడ్జి విషాదం. 12 మంది ఎంపీ కుటుంబ సభ్యులు మృతి

Published Mon, Oct 31 2022 11:02 AM | Last Updated on Mon, Oct 31 2022 12:29 PM

12 Members of Rajkot BJP MP Family Killed In Morbi Bridge Collapse - Sakshi

గుజరాత్‌లోని మోర్బీ నగరంలో మచ్చు నదీపై తీగల వంతెన కూలిన ఘోర దుర్భటన యావత్‌ భారత్‌ను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. సెలవు దినం.. ఆపై ఛట్‌ పూజ సంబరాలతో వందలాది మంది ఆహ్లాదంగా నదిపై జరిపిన సరదా విహారం ప్రాణాంతకంగా మారింది. అందరూ హడావిడిగా ఉండగా ఒక్కసారిగా బ్రిడ్జి కుప్పకూలడంతో ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే చాలా మంది నదిలో పడిపోయారు. చేతికి అందిన తీగలు పట్టుకొని కొందరు నదిలో పడకుండా ఆపుకోగలిగారు. వంతెన పునరుద్దరించిన నాలుగు రోజుల్లోనే కూలిపోవడంతో 130 మందికి పైగా జల సమాధి అ‍వ్వడం తీరని విషాదంగా మారింది. మృతుల్లో అత్యధికులు మహిళలు, చిన్నారులే ఉండటం మరింత ఆవేదన కలిగిస్తోంది. 

ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మోర్బీ బ్రిడ్జి కూలిన ఘటనలో బీజేపీ ఎంపీ  కుటుంబానికి చెందిన పలువురు మృతి చెందారు. రాజ్‌కోట్‌కు చెందిన బీజేపీ ఎంపీ మోహన్‌భాయ్ కళ్యాణ్‌జీ కుందారియా సోదరికి చెందిన 12 మంది కుటుంబ సభ్యులు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ‘‘వంతెన కూలిన దుర్ఘటనలో ఐదుగురు పిల్లలతో సహా నా సోదరి కుటుంబంలోని 12 మంది సభ్యులను కోల్పోయాను. ఘటనా స్థలంలో ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్, స్థానిక యంత్రాంగం సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టాయి.

ప్రమాదం నుంచి బయటపడిన వారికి చికిత్స అందుతోంది. నదిలో ఉన్నవారి మృతదేహాలను వెలికితీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రెస్క్యూ బోట్లు కూడా సంఘటనా స్థలంలో ఉన్నాయి. వంతెన కూలిన ఘటనలో పిల్లలు, మహిళలు ఎక్కువగా ఉన్నారు.  60 మృతదేహాలను వెలికితీశాం’  అని ఎంపీ పేర్కొన్నారు.
చదవండి: 140 ఏళ్ల నాటి బ్రిడ్జి.. ఇటీవలే మరమత్తులు.. 4 రోజులకే పెను విషాదం

132కు చేరిన మృతుల సంఖ్య
మోర్భీ కేబుల్‌ బ్రిడ్జి కూలిన ఘటనలో మృతుల సంఖ్య 132కు చేరింది. ఇప్పటివరకు 177 మందిని రక్షించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని పోలీసులు పేర్కొన్నారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌, ఎన్డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక బృందాలు సహాయక చర్యల్లో పలుపంచుకుంటున్నారని చెప్పారు. ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. దీనితో సంబంధం ఉన్నవారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హోం మంత్రి షర్ష్‌ సంఘ్వీ తెలిపారు. బ్రిడ్జి కూలిన ఘటనపై సెక్షన్‌లు 304, 308, 114 ల కింద కేసు నమోదు చేసినట్లు  తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌)ను ఏర్పాటు చేశారు.

140 ఏళ్లనాటి వంతెన
 కాగా ఈ వంతెనను 140 ఏళ్ల నాటిది. 1879 ఫిబ్రవరి 20న అప్పటి ముంబై గవర్నర్‌ రిచర్డ్‌ టెంపుల్‌ దీనిని నిర్మాణాన్ని ప్రారంభించారు. 1880లో నిర్మాణం పూర్తయ్యింది. బ్రిటిష్‌ కాలం నాటి ఈవంతెనకు  రూ. 2 కోట్లతో 7 నెలల పాటు మమరమత్తులు నిర్వహించి ఆధునీకరించారు. అయితే రిపేర్‌ తర్వాత వంతెనకు సేఫ్టి సర్టిఫికెట్‌ తీసుకోకుండానే తిరిగి తెరిచినట్లు మున్సిపల్‌ అధికారులు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement