తిరువనంతపురం: కేరళ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్‌ఐ)కి చెందిన 15 మంది కార్యకర్తలకు మరణశిక్ష విధించింది. 2021లో కేరళ బీజేపీ నేత రంజిత్ శ్రీనివాసన్ హత్య కేసులో ఆ రాష్ట్ర సెషన్స్ కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. మావెలిక్కర జిల్లా అదనపు జడ్జి జస్టిస్ వీజీ శ్రీదేవి ఈ శిక్షను ఖరారు చేశారు.
కేరళలో 2021 డిసెంబర్‌లో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి రంజిత్ శ్రీనివాసన్‌ను పీఎఫ్‌ఐ కార్యకర్తలు హత్య చేసినట్లు న్యాయస్థానం నిర్దారించింది. బాధితుని ఇంటి సభ్యుల ముందే కిరాతకంగా దాడి చేసినట్లు రుజవైంది. ఈ కేసులో 15 మంది పీఎఫ్‌ఐ కార్యకర్తలను న్యాయస్థానం దోషులుగా తేల్చి, మరణశిక్షను ఖరారు చేసింది.
ఆ రోజు ఏం జరిగిందంటే..?
డిసెంబర్ 19, 2021.. ఆ రోజు ఆదివారం.. ఉదయం 6.15గంటలు
కేరళ ఆరోగ్యశాఖలో పని చేసి రిటైరయిన వినోదిని అలప్పుళలో కుటుంబంతో కలిసి ఉంటున్నారు. ఆమెకు ఇద్దరు అబ్బాయిలు. ఒకరు రంజిత్ శ్రీనివాస్, రెండో వాడు అభిజిత్. రంజిత్ శ్రీనివాస్ మొదటి నుంచి రాజకీయాలపై ఆసక్తి ఎక్కువ. మనిషి సాఫ్ట్ అయినా.. మంచి ప్రసంగాలిస్తాడు, అందరితో కలివిడిగా ఉంటాడు. కేరళ బీజేపీలో OBC మోర్చాకు రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాడు.
రంజిత్ శ్రీనివాస్‌కు పెళ్లయింది, ఇద్దరు అమ్మాయిలు. భార్య పేరు లిశా. పెద్దమ్మాయి భాగ్య, చిన్నమ్మాయి హృద్య. సాధారణంగా తెల్లవారుజామునే వాకింగ్‌కు వెళ్లడం రంజిత్‌కు అలవాటు. ఆదివారాలు మాత్రం ఇంటిపట్టునే ఉంటాడు. ఇక పిల్లల్లో భాగ్య ఉదయాన్నే ట్యూషన్‌కు వెళ్తుంది.
మరోసారి డిసెంబర్ 19, ఆదివారం విషయానికొద్దాం. ఆ రోజు ఉదయం 6.15గంటల సమయం. ఆదివారం కాబట్టి ఇంట్లోనే ఉండిపోయాడు రంజిత్. వంట గదిలో వినోదిని, లిశా పని చేసుకుంటున్నారు. శబరి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకొచ్చిన అభిజిత్ శనివారం రోజే రాత్రి ఇంటికి వచ్చి గాఢ నిద్రలో ఉన్నాడు.
పెద్దమ్మాయి భాగ్య మాత్రం గేటు తీసి ట్యూషన్‌కు వెళ్లింది. ఇంకా గేటు కూడా మూయలేదు.. ఈ లోగా ఓ గుంపు దూసుకొచ్చింది. ఓ బలమైన సుత్తితో రంజిత్ తలపై దాడి చేశాడు ఓ దుండగుడు. తల దిమ్మతిరిగేలా కొట్టిన దెబ్బకు రంజిత్ కింద పడిపోగానే మిగతా వారు దాడికి దిగారు. వినోదిని, లిశా ఆపేందుకు ప్రయత్నించినా.. చంపుతామని కత్తులతో బెదిరించారు. ఈ లోగా అభిజిత్ వచ్చేసరికి మిగిలింది శూన్యం. అప్పటి రక్తపు మడుగులో ఉన్న రంజిత్ తుదిశ్వాస విడిచాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితులు నిషేధిత పీఎఫ్‌ఐ కార్యకర్తలుగా గుర్తించారు.
అత్యంత కిరాతకంగా హత్య
ఈ కేసులో హంతకుల ఉద్దేశ్యం కేవలం చంపడం మాత్రమే కాదని పోలీసు అధికారులు నిర్దారించారు. తలపై సుత్తితో కొట్టినప్పుడే సగం ప్రాణం పోయింది. అయినా దుండగులు చాలా సేపు కత్తులతో దాడి చేస్తూనే ఉన్నారు. రంజిత్ రెండు కాళ్లను నరికేసినా వాళ్ల కోపం తగ్గలేదు.
"మా అన్నను అంబులెన్స్‌లో ఎక్కించేందుకు ఎంతో కష్టపడాల్సి వచ్చింది, పరిస్థితి అత్యంత భయానకంగా ఉండడం, రక్తపు మడుగు కావడంతో ఎవరూ ముందుకు రాలేదు. మా పక్కింటి కుర్రాడు ఒకరు సాయం చేయడంతో అతి కష్టమ్మీద అంబులెన్స్‌లోకి చేర్చాం. అలప్పుళ మెడికల్ కాలేజీకి చేరేసరికి ఏం మిగలలేదు."
- అభిజిత్, రంజిత్ సోదరుడు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, బెంగళూరు
ఇదీ చదవండి: పాకిస్థాన్ నావికుల్ని కాపాడిన భారత నేవీ
Comments
Please login to add a commentAdd a comment