తిరువనంతపురం : కేరళలోని పాలక్కడ్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తమకు ఇష్టం లేకుండా తమ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడన్న కారణంతో ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన జిల్లాలోని తెన్కురిస్సి ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాలు.. 27 ఏళ్ల అనీష్ అనే వ్యక్తి ఒక యువతిని ప్రేమించాడు. అయితే యువతి తండ్రి ప్రభుకుమార్ ఆ ప్రాంతంలో బాగా పలుకుబడి ఉన్న వ్యక్తిగా పేరు సంపాదించాడు. తన కూతురును ప్రేమించడానికి వీలేదని అనీష్‌ను చాలాసార్లు హెచ్చరించాడు. అయితే యువతి కూడా అనీష్‌ను ఇష్టపడడంతో మూడు నెలల క్రితం వారిద్దరు పెళ్లి చేసుకున్నారు.
అనీష్ పెళ్లి ఇరు కుటుంబాల మధ్య చిచ్చును రేపి గొడవలకు దారి తీసింది. దీంతో అనీష్ దంపతులు పోలీసులను ఆశ్రయించగా వారు జోక్యం చేసుకొని కుటుంబాల మధ్య రాజీ కుదిర్చారు. అయితే యువతి కుటుంబసభ్యులు రాజీకి అంగీకరించినా అనీష్ దంపతులను మాత్రం చంపుతామని బెదిరించేవారు. అప్పటినుంచి అనీష్ దంపతులు ఇరు కుటుంబాలకు దూరంగా ఉంటున్నారు. కాగా శుక్రవారం సాయంత్రం అనీష్ ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా యువతి తండ్రి ప్రభు కుమార్, ఆమె మేనమామ సురేశ్‌లు అతన్ని అడ్డుకున్నారు. అతనిపై పదునైన వస్తువులతో దాడి చేసి అక్కడినుంచి పారిపోయారు. రక్తపు మడుగులో పడి ఉన్న అనీష్‌ను స్థానికులు సమీప ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. కాగా ఆసుపత్రికి చేరేలోగానే అనీష్ ప్రాణాలు విడిచాడు. అనీష్ భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమె తండ్రి ప్రభు కుమార్, మేనమామ సురేశ్‌లను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment