న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో దాదాపు పదేళ్ల తర్వాత అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. మరో పది రోజుల్లో మొదటి దశ పోలింగ్ జరగనున్న నేపత్యంలో ప్రధాన పార్టీలు ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో దాదాపు మూడు దశాబ్దాల తర్వాత తొలిసారి మహిళా కాశ్మీరీ పండిట్‌లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.
జమ్మూకశ్మీర్‌లో సర్పంచ్‌గా పనిచేసిన డైసీ రైనా అనే మహిళా కాశ్మీరీ పండింట్ ఎమ్మెల్యే అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేశారు. ఎన్డీయూ కూటమిలో బీజేపీ మిత్రపక్షంగా ఉన్న రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(అథవాలే) తరుపున పుల్వామాలోని రాజ్‌పోరా అసెంబ్లీ నియోజకవర్గం ఆమె బరిలోకి దిగుతున్నారు.
అయితే జమ్మూకశ్మీర్‌లో మొత్తం తొమ్మిది మంది మహిళలు పోటీ చేస్తుండగా అందులో రైనా ఒకరు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్థానిక యువత తమ గొంతుకగా నిలవాలని కోరుకున్నందున తాను పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.
‘ఇక్కడి యువకులు నన్ను పోటీ చేయమని బలవంతం చేశారు. వారి వాయిస్ జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి చేరేలా చూడాలని నన్ను అడిగారు. నేను ఇక్కడ సర్పంచ్‌గా పని చేస్తున్నాను. ఇక్కడి యువకులను తరుచుగా కలుస్తుంటాను. వారి సమస్యలను విని అర్థం చేసుకున్నాను. ఇక్కడి యువత ఏం తప్పు చేయనప్పటికీ బాధ పడుతున్నారు. 1990వ కాలంలో జమ్మూ కాశ్మీర్‌లో జన్మించిన యువకులు కేవలం బుల్లెట్లను మాత్రమే చూశారు’ అని పేర్కొన్నారు.
కాగా రైనా న్యూఢిల్లీలోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేసి, 2020లో సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే వసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఎప్పుడు నిర్ణయించుకున్నారని రైనాను ప్రశ్నించగా.. తాను అసలు ఎన్నికల్లో పోటీ చేయాలని కూడా అనుకోలేదని చెప్పారు. అయితే పుల్వామాను చక్కదిద్దగలనని చెప్పి ఒక్కరోజు ముఖ్యమంత్రి కావాలని యువకులు తనను కోరినట్లు ఆమె పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా శ్రీనగర్‌లోని హబ్బా కడల్ అసెంబ్లీ నియోజకవర్గం కాశ్మీరీ పండింట్‌ల విషయంలో ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. రెండో దశలో భాగంగా సెప్టెంబర్ 25న మరో 26 నియోజకవర్గాలతో పాటు హబ్బా కడల్‌కు ఎన్నికలు జరగనున్నాయి. అయితే అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి మొత్తం 14 మంది నామినేషన్ దాఖలు చేయగా.. వారిలో ఆరుగురు కాశ్మీరీ పండింట్‌లు ఉన్నారు.
మొత్తం 90 స్థానాలున్న జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కమిషన్ ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. మొదటి దశ పోలింగ్ సెప్టెంబర్ 18న, మిగతా రెండు రౌండ్లు సెప్టెంబర్ 25, అక్టోబర్ 1న జరగనున్నాయి. అక్టోబర్ 8వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఆర్టికల్ 370 రద్దు అనంతరం జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇవి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఓటరు ఏ పార్టీకి పట్టం కట్టనున్నాడనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment