ఇద్దరు వధువులతో పెళ్లికొడుకు ఉమాపతి
కోలారు: నాటకీయ పరిణామాల మధ్య అక్కా చెల్లెళ్లను ఒక్కరే పెళ్లాడడం సాధారణంగా సినిమాల్లో చూస్తుంటాం. ఇటువంటి వింతలు నిజజీవితంలో అరుదుగా జరుగుతుంటాయి. కర్ణాటకలోని కోలారు జిల్లా ముళబాగిలు తాలూకాలోని వేగమడుగు గ్రామంలో ఇది జరిగింది. తన చెల్లిని కూడా వివాహం చేసుకోవాలని అక్క కాబోయే భర్తను పట్టుబట్టి ఒప్పించడం విశేషం. వివరాలు.. తాలూకాలోని తిమ్మరావుతనహళ్ళి గ్రామ పంచాయతీ వేగమడుగు గ్రామానికి చెందిన రాణెమ్మ, నాగరాజప్ప రైతు దంపతుల కుమార్తెలు సుప్రియ, లలితలు. చెల్లెలు లలిత మూగ–బధిర. ఆమెను ఎవరు పెళ్లి చేసుకుంటారని అక్క సుప్రియ బాధపడేది.
పెళ్లిపీటలపై మెలిక
ఈ తరుణంలో సుప్రియకు బాగేపల్లికి చెందిన ఉమాపతి అనే యువకునితో పెళ్లి నిశ్చయమైంది. ఈ నెల 7వ తేదీన పెళ్లి మండపంలో వరుడు తాళి కట్టబోతుండగా సుప్రియ తన ఆలోచనను చెప్పింది. చెల్లిని కూడా నీవు పెళ్లాడితే కానీ ఈ వివాహం జరగదని మొండికేయడంతో పెద్దల అనుమతితో ఉమాపతి ఇద్దరికీ మాంగళ్యధారణ చేశాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూడగా సోషల్ మీడియాలో ఇద్దరు భామల ముద్దుల మొగుడు వైరల్ అవుతున్నాడు. మరోవైపు వధువు లలితకు ఇంకా 18 ఏళ్లు దాటలేదని తెలియడంతో శిశు సంక్షేమ, పోలీసు అధికారులు వచ్చి వరుడు సహా ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment