ముంబై : ముంబై ఎయిర్ పోర్ట్‌కు నిరుద్యోగులు పోటెత్తారు. 600 ఉద్యోగాలకు అప్లయ్ చేసుకునేందుకు 25 వేల మంది నిరుద్యోగులు తరలివచ్చారు. దీంతో ముంబై ఎయిర్‌పోర్ట్ నిరుద్యోగులతో కిక్కిరిసిపోయింది.
ప్రముఖ ఏవియేషన్ దిగ్గజం ఎయిరిండియా మంగళవారం నిర్వహించిన రిక్రూట్‌మెంట్ డ్రైవ్ తొక్కిసలాటకు దారితీసింది. ఎయిరిండియాకు మొత్తం 2,200 మంది ఎయిర్ లోడర్లు అవసరం. ప్రస్తుతం 600 మంది ఎయిర్‌పోర్ట్ లోడర్ల (హ్యాండీమ్యాన్) కోసం ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు నిర్వహించింది. ఈ ఇంటర్వ్యూలకు సుమారు 25వేలమందికి కంటే ఎక్కువ మంది హాజరయ్యారు. అయితే అభ్యర్ధుల్ని ఎంపిక, ఫారమ్‌ల ధరఖాస్తు స్వీకరణలో తీవ్ర ఇబ్బందులు తలెత్తినట్లు తెలుస్తోంది. జాబ్ అప్లికేషన్ కోసం అభ్యర్ధులు ఎగబడడంతో వారిని కంట్రోల్ చేయలేకపోయినట్లు సమాచారం.
దరఖాస్తుదారులు ఆహారం, నీరు లేకుండా గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చిందని, ఫలితంగా వారిలో చాలా మంది అస్వస్థతకు గురైనట్లు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.
జీతం రూ.25వేలు
ఎయిర్‌పోర్ట్ లోడర్‌ల జీతం నెలకు రూ.20,000 నుండి రూ.25,000 వరకు ఉంటుంది.అయితే చాలా మంది ఓవర్‌టైమ్ అలవెన్సుల తర్వాత రూ. 30,000 కంటే ఎక్కువ సంపాదించే అవకాశం ఉంది. ఇక ఈ ఉద్యోగం పొందాలంటే కనీస అర్హతలు తప్పని సరి. శారీరకంగా బలంగా ఉంటే సరిపోతుంది.
500 కిలోమీటర్ల దూరం నుంచి
ఇక 25వేల మంది అభ్యర్ధుల్లో ఒకరైన బీబీఏ రెండో సంవత్సరం చదువుతున్న ప్రథమేశ్వర్ ఈ ఇంటర్వ్యూ కోసం 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న బుల్దానా జిల్లాకు నుంచి ముంబై ఎయిర్‌పోర్ట్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ప్రథమేశ్వర్ మాట్లాడుతూ.. నేను ఎయిర్‌పోర్ట్ లోడర్ జాబ్‌కు అప్లయ్ చేయడానికి వచ్చాను. ఈ ఉద్యోగానికి రూ.22,500 మాత్రమే ఇస్తారంట అని నిట్టూర్చాడు.ఈ ఉద్యోగం వస్తే చదువు మానేస్తారా అని ప్రశ్నించగా.. ‘ఏం చేస్తాం.. ఇంత నిరుద్యోగం ఉంది.. మరిన్ని ఉద్యోగావకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను’ అని బదులిచ్చారు. ప్రస్తుతం నిరుద్యోగులతో కిక్కిరిసిపోయిన ముంబై ఎయిర్ పోర్ట్ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment