గతవారం కుర్లాలో ఏ–332 బెస్ట్ బస్సుకు ఘోరప్రమాదం
మరమ్మతులు, ఫిట్‌నెస్ టెస్ట్‌లు పూర్తి
రాకపోకలకు అనుమతించిన అధికారులు
దాదర్: కుర్లాలో ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన ఏ–332 బెస్ట్ బస్సు తిరిగి రోడ్డెక్కింది. గతవారం ప్రమాదం నేపథ్యంలో కుర్లా బస్ డిపోలో ఈ బస్సుకు గత ఐదారు రోజుల నుంచి మరమ్మతులు జరుగుతున్నాయి. పనులు పూర్తి, పరీక్షలు సఫలం కావడంతో తిరిగి ఈ బస్సు రాకపోకలు సాగించేందుకు అధికారులు అనుమతినిచ్చారు.
గత సోమవారం రాత్రి 9.35 గంటల ప్రాంతంలో పశ్చిమ దిశలో కుర్లా రైల్వే స్టేషన్ నుంచి అంధేరీ దిశగా బయలుదేరిన ఏ–332 నంబరు ఎలక్ట్రిక్ ఏసీ బస్సు ఎల్‌బీఎస్ రోడ్డుపై అదుపు తప్పింది. అడ్డువచ్చిన అనేక వాహనాలను ఢీ కొడుతూ వేగంగా ముందుకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందగా, 42 మంది తీవ్రంగా గాయపడ్డారు. బెస్ట్ అధికారులు, పోలీసులు వెంటనే రంగంలోకి దిగి తగిన చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గురైన బస్సును కుర్లా బస్ డిపోకు తరలించారు. ముందు జాగ్రత్త చర్యగా మరుసటి రోజు అంటే మంగళవారం రోజున కుర్లా రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరే బస్సులన్నింటినీ నిలిపివేశారు. ఇప్పటికే బెస్ట్ సంస్ధలో బస్సుల కొరత తీవ్రంగా ఉండటంతో సాధారణ మరమ్మతుల నిమిత్తం డిపోకి వచ్చిన బస్సులను సాధ్యమైనంత త్వరగా మరమ్మతులు పూర్తిచేసి పంపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో పలు తనిఖీల అనంతరం గత వారం రోడ్డు ప్రమాదానికి గురైన ఏ–332 బస్సును కూడా వెంటనే రోడ్డెక్కించారు. ఈ విషయం తెలుసుకున్న అనేక మంది ప్రయాణికులు కుర్లా స్టేషన్ బస్టాండ్‌లో ఆగి ఉన్న బస్సును చూడడానికి గుమిగూడారు. గత సోమవారం రాత్రి ప్రమాడానికి గురైన బస్సు ఇదేనంటూ చర్చించుకున్నారు. కొందరైతే ఈ బస్సులో ఎక్కేందుకు ముఖం చాటేశారు.
Comments
Please login to add a commentAdd a comment