
ప్రతీకాత్మక చిత్రం
తిరువనంతపురం : కేరళలో జికా వైరస్ కలకలం సృష్టిస్తోంది. కొత్తగా మరో ఐదు జికా కేసులు వెలుగు చూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 28కి చేరింది. తాజాగా జికా బారిన పడిన వారిలో అనయారాకు చెందిన ఇద్దరు.. కున్నుకుళి, పొట్టాం, ఈస్ట్‌పోర్టుకు ఒక్కోరి చొప్పున ఉన్నారు. అధికారులు అనయారా ప్రాంతానికి 3 కిలోమీటర్ల పరిధిలో జికా వైరస్ క్లస్టర్‌ను గుర్తించారు. వైరస్ ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు దోమల నివారణకు చర్యలు తీసుకుంటున్నారు. దీనిపై కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీనా జార్జ్ మాట్లాడుతూ.. ‘‘ తిరువనంతపురంలోని ఇతర ప్రాంతాల్లో దోమల నివారణకోసం ప్రత్యేక శ్రద్ధలు తీసుకుంటున్నాము. ప్రజలు ఇళ్లలో కానీ, చుట్టప్రక్కల కానీ, నీటిని నిల్వ ఉండనీయకండి. తద్వారా కేవలం జికా మాత్రమే కాదు దోమల ద్వారా వ్యాప్తి చెందే ఇతర ప్రమాదకర వ్యాధుల నివారణ కూడా సాధ్యపడుతుంది’’ అని అన్నారు.
కాగా, జికా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేరళ ప్రభుత్వం రాష్ట్రంలో హై అలెర్ట్ ప్రకటించింది. జికా వైరస్ బారిన పడకుండా అందరూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. అదేవిధంగా కేరళ పొరుగు రాష్ట్రమైన కర్ణాటక కూడా జికా వైరస్ వ్యాప్తి విషయంలో అప్రమత్తమైంది.
Comments
Please login to add a commentAdd a comment