మనాలీ కిటకిట.. మూడు రోజుల్లో 50 వేల మంది పర్యాటకులు | 50000 Tourists Reached Manali In Three Days | Sakshi
Sakshi News home page

మనాలీ కిటకిట.. మూడు రోజుల్లో 50 వేల మంది పర్యాటకులు

Published Mon, May 27 2024 9:15 AM | Last Updated on Mon, May 27 2024 9:59 AM

50000 Tourists Reached Manali In Three Days

వేడి వాతావరణం నుంచి ఉపశమనం పొందేందుకు పలువురు చల్లని ప్రదేశాలకు చేరుకుంటున్నారు. ఈ కోవలో హిమాచల్‌ ప్రదేశ్‌లోని పర్యాటక నగరం మనాలి పర్యాటకులతో సందడిగా మారింది.

మనాలీలో వారాంతాల్లో పర్యాటకుల సంఖ్య రెండింతలు పెరిగింది. గత రెండు వారాలతో పోలిస్తే ఈ వారాంతంలో అధికంగా పర్యాటకులు మనాలికి తరలివచ్చారు. మూడు రోజుల్లో 50,000 మందికి పైగా పర్యాటకులు మనాలికి వచ్చారు. పర్యాటకులతో కూడిన 7,500 వాహనాలు మనాలికి చేరుకున్నాయి.

మనాలిలోని హిడింబ దేవాలయం ఆదివారం పర్యాటకులతో నిండిపోయింది. అమ్మవారి దర్శనం కోసం పర్యాటకులు పెద్ద ఎత్తున బారులు తీరారు. రద్దీ కారణంగా  కొందరు పర్యాటకులు బయటి నుండే అమ్మవారిని దర్శించుకుని తిరిగి వెళ్లిపోయారు. రోహ్తంగ్, లాహౌల్ వ్యాలీతో పాటు, మనాలిలోని మాల్ రోడ్‌లో ప్రభుత్వం పర్యాటక ప్రదర్శన నిర్వహించింది. గ్రీన్ ట్యాక్స్ బారియర్ వద్ద బయట రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటక వాహనాల సంఖ్య 2,500 దాటింది.

మనాలిలో హోటల్ గదులు 70 నుండి 90 శాతం వరకు బుక్ అయ్యాయి. పర్యాటకులు  ఇక్కడి నుంచి సోలంగ్నాల, సిస్సు, కోక్సర్, రోహ్తంగ్, హిడింబ ఆలయం, వశిష్ఠలను చూసేందుకు వెళుతున్నారు. సాయంత్రం కాగానే మనాలిలోని మాల్ రోడ్డు పర్యాటకులతో నిండిపోతోంది.

హోటళ్లన్నీ పర్యాటకులతో నిండిపోయాయని హోటళ్ల సంఘం అధ్యక్షుడు ముఖేష్ ఠాకూర్ తెలిపారు. రానున్న రోజుల్లో పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని అన్నారు. హిమాచల్‌ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ బీఎస్‌ ఓక్తా మాట్లాడుతూ వారాంతపు రోజుల్లో మనాలీకి వచ్చే టూరిస్టుల సంఖ్య పెరుగుతున్నదని, కార్పొరేషన్‌లోని హోటళ్లు దాదాపుగా నిండిపోయాయని  పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement