
న్యూఢిల్లీ: దేశంలో వ్యాక్సిన్ పొందిన వారి సంఖ్య శనివారానికి 56,36,868కు చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీరిలో ఉత్తర ప్రదేశ్ నుంచి అత్యధికంగా, 6,73,542 మంది, మహారాష్ట్ర నుంచి 4,34,943 మంది, రాజస్తాన్ నుంచి 4,14,422 మంది, కర్ణాటక నుంచి 3,60,592 మంది ఉన్నట్లు తెలిపింది. కేవలం 21 రోజుల్లోనే 50 లక్షల మార్కును దాటిందని పేర్కొంది. వ్యాక్సినేషన్ పొందిన వారిలో 52,66,175 మంది ఆరోగ్య కార్యకర్తలు, 3,70,693 ఫ్రంట్ కేర్ వర్కర్లు ఉన్నట్లు వెల్లడించింది. కోవిన్ ద్వారా రిజిస్టర్ చేసుకున్న హెల్త్‌కేర్ వర్కర్లలో 54.7శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తయినట్లు తెలిపింది.
వ్యాక్సినేషన్ వేగం పెంచండి
జనవరి 16న మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నవారికి ఈ నెల 13న రెండో డోస్ వ్యాక్సినేషన్ చేయాల్సి ఉన్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ వేగాన్ని పెంచాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది. ఈ నెల 20లోగా ఆరోగ్య కార్యకర్తలందరికీ కనీసం ఒక్కసారైనా వ్యాక్సిన్ షెడ్యూల్ కేటాయించాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషన్ చెప్పారు. ప్రస్తుతం కేటాయిస్తున్న సెషన్లలో వ్యాక్సినేషన్ పొందాల్సిన వారి సంఖ్యను పెంచేందుకు అవకాశం ఉందని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వ్యాక్సినేషన్ సాగుతున్న తీరును పరిశీలించేందుకు రాష్ట్ర/జిల్లా/బ్లాక్ స్థాయిలో సమన్వయ సమావేశాలు జరగాలని సూచించారు. కొత్తగా ఉత్పన్నమవుతున్న సమస్యలను చర్చించి తగిన నిర్ణయాలు తీసుకొనేలా ఆయా సమావేశాలు సాగాలన్నారు.ఈ నెల 20 తర్వాత హెల్త్ వర్కర్ల కోసం మోప్ అప్ రౌండ్ ఏర్పాటు చేయాలని, మార్చి 6 తర్వాత ఫ్రంట్‌లైన్ వర్కర్ల కోసం మోప్ అప్ రౌండ్ ఉండాలని చెప్పారు. త్వరలోనే కోవిన్ 2.0 వెర్షన్ విడుదలవుతుందని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment