
న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాక్సినేషన్ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన తొలి రోజే దేశం మొత్తం మీద ప్రజలకు 85.15 లక్షలకు పైగా టీకా డోసులిచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఒక్కరోజులో ఇన్ని టీకాలు ఇవ్వడం ఇదే ప్రథమమని ప్రకటించింది. జనవరి 16న ఆరంభమైన భారత కోవిడ్ టీకా కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు 28.36 కోట్లమందికి పైగా టీకాలందుకున్నారని కోవిన్ పోర్టల్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ‘కోవిడ్‌పై పోరులో టీకానే మన బలమైన ఆయుధం. టీకా అందుకున్న అందరికీ శుభాకాంక్షలు. ఫ్రంట్‌లైన్ వర్కర్లకు ధన్యవాదాలు. వెల్‌డన్ ఇండియా’ అని ప్రధాని మోదీ ప్రశంసలు గుప్పించారు. గతంలో సింగిల్‌డే టీకా రికార్డు ఏప్రిల్ 1న రికార్డయింది. ఆరోజు 48 లక్షల టీకా డోసులు అందించారు. . సోమ వారం అత్యధికంగా మధ్యప్రదేశ్‌లో టీకాలివ్వగా, అనంతర స్థానాల్లో కర్ణాటక, ఉత్తరప్రదేశ్ నిలిచాయి.
అందరికీ ఉచిత టీకా
జూన్ 7న ప్రభుత్వమే 18 ఏళ్ల పైబడిన అందరికీ టీకాలనిస్తుందని ప్రధాని ప్రకటించారు. ఈ కార్యక్రమం సోమవారం నుంచి ఆరంభమైంది. ప్రజలంతా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని కరోనాపై పోరును బలోపేతం చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంతో దేశ యువత, మధ్యతరగతి, పేద ప్రజానికం లబ్ది పొందుతారని ఆయన ట్వీట్ చేశారు. ప్రజా భాగస్వామ్యంతోనే కోవిడ్‌పై పోరును భారత్ బలోపేతం చేస్తుందన్నారు. టీకాలపై వాస్తవాలు తెలుసుకోవాలని, అనవసర పుకార్లు నమ్మవద్దని ఆయన ప్రజలను కోరారు. ‘‘ప్రపంచంలో అతిపెద్ద ఉచిత టీకా కార్యక్రమం’’గా పేర్కొంటున్న ఈ వ్యాక్సిన్ డ్రైవ్‌ను కేంద్రం ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వ టీకా కేంద్రాల్లో 18ఏళ్ల పైబడిన అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. అందరం కలిసి ఉమ్మడిగా కరోనాను జయిద్దామని ప్రధాని అభిలషించారు. దేశీయ ఉత్పత్తిదారుల నుంచి 75 శాతం వ్యాక్సిన్లను కేంద్రమే సమీకరించనుంది. మిగిలిన ఉత్పత్తిని ప్రైవేట్ ఆస్పత్రులకు ఉత్పత్తి సంస్థలు విక్రయించుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment