సాక్షి, న్యూఢిల్లీ/అహ్మదాబాద్: దేశంలో రెండో దశ కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ మార్చి 1 నుంచి ప్రారంభం కానుంది. 60 ఏళ్లకు పైగా వయసున్న, 45 ఏళ్లకు పైగా వయసుండి వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారికి కరోనా టీకా ఇవ్వనున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా, ప్రైవేట్ ఆసుపత్రుల్లో రుసుము చెల్లించి టీకా పొందవచ్చు. ప్రైవేట్ హాస్పిటళ్లలో కరోనా టీకా ధరను కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఒక్కో డోసుకు రూ.250 వరకు వసూలు చేయొచ్చని అధికార వర్గాలు శనివారం తెలిపాయి. అంతకుమించి వసూలు చేయడానికి వీల్లేదని స్పష్టం చేశాయి.
ఇందులో టీకా డోసు ధర రూ.150 కాగా, సర్వీసు చార్జీ రూ.100 ఉంటుంది. ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు ఇచ్చేదాకా ఇదే ధర అమల్లో ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు తెలియజేసినట్లు వెల్లడించారు. ఒక్కొక్కరు రెండు డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రైవేట్ హాస్పిటళ్లలో రెండు డోసులకు గాను మొత్తం రూ.500 చెల్లించాలి. రెండో దశ వ్యాక్సినేషన్, ప్రైవేట్ ఆసుపత్రుల్లో టీకా ధరపై కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్య శాఖ కార్యదర్శులు, అధికారులతో మాట్లాడారు.
ఆన్–సైట్ రిజిస్ట్రేషన్ సదుపాయం
కోవిడ్–19 వ్యాక్సినేషన్ సెంటర్లుగా పనిచేస్తూ కరోనా వ్యాక్సిన్ అందజేసే ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల వివరాలను కో–విన్ 2.0 పోర్టల్, ఆరోగ్య సేతు యాప్‌లో పొందుపర్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలియజేసింది. ఆయా కేంద్రాల్లో లబ్ధిదారులకు ఏ రోజు, ఏ సమయంలో వ్యాక్సిన్ ఇస్తారన్న సమాచారం ఇందులో ఉంటుందని పేర్కొంది. లబ్ధిదారులు కో–విన్ 2.0 పోర్టల్ లేదా ఆరోగ్య సేతు యాప్ ద్వారా ముందుగా అపాయింట్‌మెంట్ పొందాలని సూచించింది.
వారు తమకు అందుబాటులో ఉన్న వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఎంచుకోవచ్చని వివరించింది. ఆన్–సైట్ రిజిస్ట్రేషన్ సదుపాయం కూడా ఉందని గుర్తుచేసింది. అంటే సమీపంలోని వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్లి, అప్పటికప్పుడు పేరు నమోదు చేసుకొని, టీకా పొందవచ్చు. 45 ఏళ్ల నుంచి 59 ఏళ్లలోపు వయసుండి వివిధ వ్యాధులతో బాధపడుతున్నవారు ఆర్‌ఎంపీ సంతకం చేసిన ధ్రువపత్రాన్ని సమర్పించాలి. అలాగే మార్చి 1 నుంచి కో–విన్ 2.0 పోర్టల్ ద్వారా ముందస్తు రిజిస్టర్ చేసుకోవచ్చు.
ఆరోగ్య ఉప కేంద్రాల్లోనూ టీకా
ఆయుష్మాన్ భారత్–ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనలో చేరిన 10,000 ప్రైవేట్ ఆస్పత్రులు, కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకంలో(సీజీహెచ్‌ఎస్)లో చేరిన 600కి పైగా ఆసుపత్రులతోపాటు రాష్ట్ర ఆరోగ్య బీమాలో భాగంగా ఉన్న ఆసుపత్రుల్లో కరోనా టీకా అందజేస్తారు. రెండో దశలో టీకా అందించే అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల జాబితాను ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో పాటు జాతీయ ఆరోగ్య అథారిటీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు. వీటికి అదనంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, సబ్ డివిజనల్ ఆసుపత్రులు, సీహెచ్‌సీలు, పీహెచ్‌సీలు, ఆరోగ్య ఉప కేంద్రాలు, ఆరోగ్య సంరక్షణ కేంద్రాలను కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్లుగా ఉపయోగించుకుంటారు.
కో–విన్‌లో రిజిస్ట్రేషన్‌తో టీకా
వ్యాక్సినేషన్ రెండో దశ మార్చి ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానుంది. టీకా వేయించుకునే వారు కో–విన్ యాప్ ద్వారా ముందుగా పేరు నమోదు చేయించుకోవచ్చు. లేదా నేరుగా కోవిడ్–19 వ్యాక్సినేషన్ కేంద్రా(సీవీసీ)లకు వెళ్లి పేరు రిజిస్టర్ చేయించుకుని టీకా వేయించుకోవచ్చునని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కో–విన్ యాప్‌తోపాటు ఆరోగ్య సేతు వంటి ఐటీ అప్లికేషన్ల ద్వారా పేర్లను ముందుగా నమోదు చేసుకోవచ్చు. టీకా సెషన్ ప్రాంతంలోకి లబ్ధిదారులు నేరుగా వెళ్లి రిజిస్టర్ చేయించుకోవచ్చు. కో–విన్ యాప్ 2.0 కొత్త వెర్షన్ నేడో రేపో విడుదల కానుంది. దీన్లో టీకా సెషన్ ప్రాంతం, సమయాన్ని ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది.
లబ్ధిదారులు కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాల్లో ఏది కావాలో ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉండదు. లబ్ధిదారులు తమ సొంత రాష్ట్రం కాకుండా వేరే ప్రాంతంలోనూ టీకా వేయించుకునేందుకు వీలుంది. 60 ఏళ్లు పైబడిన వారు గుర్తింపు కార్డును, 45 ఏళ్లు పైబడి ఇతర వ్యాధులతో బాధపడే వారు మెడికల్ సర్టిఫికెట్లను వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. 45 నుంచి 59 ఏళ్ల మధ్య ఉన్న వ్యాధుల బాధితులకు సంబంధించి 20 రకాల ఆరోగ్య పరిస్థితులను కేంద్రం గుర్తించింది. ఇందులో గుండె జబ్బులు, కిడ్నీ వ్యాధులు, హైపర్‌టెన్షన్ తదితరాలున్నాయి.
డౌన్‌లోడ్ ఎలా?
కో–విన్ యాప్ 2.0 వెర్షన్‌ను సోమవారం నుంచి గూగుల్ ప్లే స్టోర్ నుంచి గానీ యాపిల్ ప్లే స్టోర్ నుంచి గానీ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందులో యూజర్ అడ్మినిస్ట్రేటర్ మాడ్యూల్, బెనిఫిషియరీ మాడ్యూల్, బెనిఫిషియరీ ఎక్నాలెడ్జ్‌మెంట్, స్టేటస్ అప్‌డేట్ అనే మాడ్యూళ్లున్నాయి. ఫ్రంట్‌లైన్ వర్కర్ల జాబితాలో లేని వారు పేరు నమోదుకు రిజిస్ట్రేషన్ మాడ్యూల్‌లోని సెల్ఫ్ రిజిస్ట్రేషన్‌లో ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ వంటి దాదాపు పది ధ్రువీకరణల్లో ఏదేని ఒకటి అప్‌లోడ్ చేయాలి. మొబైల్ ఫోన్ నంబర్ రిజిస్టర్ చేశాక లబ్ధిదారులకు ఓటీపీ అందుతుంది. దీనిద్వారా అకౌంట్ క్రియేట్ అవుతుంది. టీకా తీసుకున్న తర్వాత ఎక్నాలెడ్జ్‌మెంట్ అందుతుంది.
Comments
Please login to add a commentAdd a comment