ఫైల్ ఫోటో
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియాకు తాజాగా మరో షాక్ తగిలింది. కరోనా ప్రామాణికాలను సరిగా పాటించడం లేదనే ఆరోపణలు ఎదుర్కొంటున్నసమయంలో మరో అంతర్జాతీయ ఎయిరిండియా విమానంలో ప్రయాణించిన ఏడుగురు కరోనా బారిన పడటం మరిత ఆందోళన రేపింది. ఢిల్లీనుంచి న్యూజిలాండ్ చేరుకున్న మూడు రోజుల తరువాత వీరికి కోవిడ్-19 నిర్ధారణ అయింది.
ఆగస్టు 23న ఢిల్లీ-ఆక్లాండ్ విమానంలో వచ్చిన ఏడుగురికి పాజిటివ్ వచ్చిందని ఆక్లాండ్‌లో రోజువారీ విలేకరుల సమావేశంలో న్యూజిలాండ్ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ కరోలిన్ మెక్‌ల్నే శుక్రవారం వెల్లడించారు. దీంతో వీరికి ఆక్లాండ్‌లోని జెట్ పార్క్ హోటల్‌లోని క్వారంటైన్ కేంద్రానికి తరలించామన్నారు. అయితే దీనిపై స్పందించేందుకు ఎయిరిండియా తిరస్కరించింది. ఈ దశలో ఎటువంటి వ్యాఖ్యలు చేయలేమని తెలిపింది.
కరోనావైరస్ మహమ్మారి కారణంగా అంతర్జాతీయ ప్రయాణీకుల విమానాలు నిలిపివేసినప్పటికీ, వందే భారత్ మిషన్, వివిధ దేశాల ద్వైపాక్షిక ఒప్పందాల ప్రకారం ప్రత్యేక అంతర్జాతీయ విమానాలు నడుస్తున్నాయి. ఇటీవల ఢిల్లీ-హాంకాంగ్ విమానంలో 11 మంది ప్రయాణికులకు కరోనా రావడంతో ఈ నెలాఖరు (ఆగస్టు) చివరి వరకు ఎయిరిండియా విమానాలను హాంకాంగ్ నిషేధించిన సంగతి తెలిసిందే. మరోవైపు దేశంలో కరోనా ఉధృతి రోజు రోజుకు పెరుగుతోంది. 77,266 తాజా కేసులతో ఈ సంఖ్య 34,63,973 కు చేరుకోగా, 24 గంటల వ్యవధిలో 1,057 కొత్త మరణాలతో మొత్తం మరణాల సంఖ్య 62,550కి చేరింది.
Comments
Please login to add a commentAdd a comment