జైపూర్ : రాజస్తాన్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కోటా జిల్లాలోని చంబల్ నదిలో పడవ బోల్తా పడి ఏడుగురు మరణించగా మరో 14 మంది గల్లంతయ్యారు. పడవలో మొత్తం 25 నుంచి 30మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదంపై అధికారులకు సమాచారమిచ్చిన స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు. కొందరు గజ ఈతగాళ్లు ఇప్పటికే నదిలో దిగి బాధితులను రక్షించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే పడవలో కొందరు బైక్‌లను కూడా తీసికెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పడవలో పరిమితికి మించి ప్రయాణికులు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ కారణంగానే పడవ అదుపుతప్పి నీటిలో పడిపోయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఘటనాస్థలికి చేరుకున్న రెస్క్యూ బృందాలు ఇప్పటికే ఏడు మృతదేహాలను బయటకు తీశాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వెల్లడించాయి. ప్రత్యేక బృందాలతో చంబల్ నది మొత్తం జల్లెడ పడుతున్నారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ సంతాపం వ్యక్తం చేశారు. ఇది చాలా దురదృష్టకరమైన ఘటన అని, అధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షిస్తున్నామన్నారు. బాధిత కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. (11 రోజులుగా స్ట్రెచర్ మీదే : అస్థిపంజరంలా)
Comments
Please login to add a commentAdd a comment