
బెంగళూరు: కర్ణాటకలో చిరుత పిల్లల మరణాలు కలకలం రేపుతున్నాయి. తీవ్రమైన అంటువ్యాధి సోకి బెంగళూరులోని బన్నెరఘట్ట బయోలాజికల్ పార్క్‌లో ఏడు చిరుత కూనలు మృతిచెందాయి. అత్యంత వేగంగా వ్యాప్తి చెందే అంటువ్యాధి ‘ఫీలైన్ పాన్ల్యూకోపెనియా బారిన పడి 15 రోజుల వ్యవధిలోనే 8 పిల్లలు మరణించినట్లు పార్క్ అధికారులు మంగళవారం వెల్లడించారు.
అధికారుల వివరాల ప్రకారం.. ఆగస్టు 22న తొలిసారి ఈ వైరస్ బయటపడినట్లు తెలిపారు. 15 రోజుల్లోనే ఎనిమిది చిరుత పిల్లలకు వైరస్ సోకి చనిపోయినట్లు పేర్కొన్నారు. సఫారీ ప్రాంతంలో తొమ్మిది కూనలను వదిలిపెట్టగా వాటిలో నాలుగు వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. రెస్క్యూ సెంటర్‌లో ఉండే మరో మూడింటికి కూడా అంటువ్యాధి సోకి చికిత్స పొందుతూ మరణించాయన్నారు.
మరణించిన ఏడు పిల్ల చిరుతల వయసు మూడు నుంచి ఎనిమిది నెలల లోపు ఉంటుందని పేర్కొన్నారు. అన్నీ కూనలకు వ్యాక్సినేషన్ చేయించినప్పటికీ వైరస్ సోకి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు.
చదవండి: జమ్మూకశ్మీర్ ఎన్‌కౌంటర్: లష్కరే తోయిబా కమాండర్ హతం
అయితే ప్రస్తుతం వైరస్‌లో నియంత్రణలో ఉందని.. గత 15 రోజులలో ఎలాంటి మరణాలు సంభవించలేదని, వెటర్నటీ డాక్టర్‌లో చర్చలు జరిపి వైరస్ కట్టడికి అవసరమైన చర్యలన్నీ తీసుకున్నామని చెప్పారు. అలాగే జంతు ప్రదర్శనశాలలో పరిశుభ్రత చర్యలు చేపట్టామని రెస్క్యూ సెంటర్ పూర్తిగా శానిటైజ్ చేసినట్లు పేర్కొన్నారు.
ఫీలైన్ పాన్ల్యూకోపెనియా అనే అంటువ్యాధి పిల్లి జాతికి చెందిన పార్వేవైరస్ వల్ల కలుగుతుందని.. ఈ వైరస్ ప్రభావం కూనలపై ఎక్కువగా ఉంటుందని చెప్పారు. దీని బారిన పడితే.. జీర్ణవ్యవస్థ పూర్తిగా ప్రభావితమవుతుందని పేర్కొన్నారు. తీవ్రమైన విరేచనాలు, వాంతులు డీహైడ్రేషన్ లక్షణాలు కనిపిస్తాయని చివరికి మరణానికి దారితీస్తుందన్నారు. ఇది వేగంగా వ్యాపిస్తుందని, వ్యాధి సోకిన నాలుగైదు రోజుల్లో జంతువు చనిపోతుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment