ముంబై: మహారాష్ట్రలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలతో కలిసి ఏక్‌నాథ్ షిండే క్యాంపు రాజకీయాలకు తెరలేపిన విషయం తెలిసిందే. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం నుంచి శివసేన వైదొలగాలని, బీజేపీతో జట్టు కట్టాలని ఏక్‌నాథ్ షిండే డిమాండ్ చేస్తున్నారు. అయితే గౌహతిలో ఉన్న ఎమ్మెల్యేలంతా 24 గంటల్లో ముంబై వచ్చి సీఎం ఉద్దవ్ ఠాక్రేతో చర్చిస్తే ఎమ్‌వీఏ కూటమి నుంచి వైదొలిగే ఆలోచన చేస్తామని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ప్రకటించారు.
70 గదులు బుకింగ్
దాదాపు 42 ఎమ్మెల్యేలతో కలిసి ఏక్‌నాథ్ షిండే ప్రస్తుతం గౌహతిలోని ఫైవ్ స్టార్ హోటల్‌లో బస చేస్తున్నారు. హోటల్ పేరు రాడిసన్ బ్లూ. ఆ హోటల్‌లో మొత్తం 196 గదులు ఉన్నాయి. ఎమ్మెల్యేలు ఏడు రోజులకుగానూ 70 గదులు బుక్ చేసుకున్నట్లు హోటల్ వర్గాలు, స్థానిక రాజకీయ నాయకుల ద్వారా తెలుస్తోంది. ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని ఎమ్మెల్యేలు తొలుత బీజేపీ పాలిత గుజరాత్‌లోని సూరత్‌లోని ఓ హోటల్‌లో బస చేశారు. అనంతరం మరో బీజేపీ పాలిత రాష్ట్రమైన అస్సాంలోని గౌహతికి బుధవారం మకాం మార్చారు.
చదవండి: Maharashtra Political Crisis: హాట్ టాపిక్‌గా మారిన నెంబర్ గేమ్!
రోజుకు రూ. 8 లక్షలు
రాడిసన్ బ్లూ హోటల్‌లోని 70 గదులకు ఏడు రోజులకు రూ. 56 లక్షలు చెల్లించాల్సి వస్తోంది. అంటే ఒక్క రోజు గది, ఆహారం ఇతర అవసరలకయ్యే ఖర్చు రూ.8 లక్షలు అన్నమాట. అయితే హోటల్‌లోని మొత్తం 196 గదుల్లో ఇప్పటికే 70 బుక్ చేసుకోవడంతో ఇక ఎమ్మెల్యేలకు కొత్తగా రూమ్‌లు కేటాయించేది లేదంటూ హోటల్ యాజమాన్యం తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. హోటల్‌లోని బాంక్వేట్ హాల్‌ను కూడా మూసేసింది. హోటల్‌లో బస చేసే వారికి మినహా రెస్టారెంట్ కూడా మూసివేశారు.
మరి ఆ ఖర్చుల సంగతేంటి?
ఇవే కాక మొత్తం ‘ఆపరేషన్’ ఖర్చులో చార్టర్డ్ ఫ్లైట్‌లు, ఇతర రవాణా ఖర్చుల సంగతేంటి అనేది కూడా తెలీదు. అంతేగాక హోటల్‌లో ఉంటున్న ఎమ్మెల్యేల ఖర్చు తడిచి మోపడవుతోంది. మరి వీటన్నింటిని ఎవరూ చెల్లిస్తున్నారనేది కూడా ప్రశ్నర్థకమే. అయితే అసోంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. అండ్ రాడిసన్ దగ్గర అసోం బీజేపీ మంత్రులే పహారా కాస్తున్నారు. దీంతో క్యాంపు ఖర్చంతా కమలం ఖాతాలోనే పడే అవకాశాలూ లేకపోలేదు. గౌహతిలోని రాడిసన్ బ్లూ హోటల్ వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.
చదవండి: ప్రాణాలకు తెగించి కాపాడాడు.. కొంచెం ఆలస్యమైనా ఎంత ఘోరం జరిగేదో..
ఇదిలా ఉండగా గౌహతి హోటల్ నుంచి తాజాగా విడుదల చేసిన వీడియో ప్రకారం ఏక్‌నాథ్ షిండే వర్గంలో ప్రస్తుతం 42 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో 35 మంది శివసేన, ఏడుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు. మరోవైపు ఉద్ధవ్ ఠాక్రే గురువారం ఉదయం తన నివాసంలో పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆదిత్య ఠాక్రేతో సహా 13 మంది ఎమ్మెల్యేలు మాత్రమే పాల్గొన్నారు. దీంతో మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో భాగస్వామ్యమైన శివసేన పార్టీలో చీలిక దాదాపు ఖరారైనట్లు కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment