
దీనికి సంబంధించి పెళ్లి పెద్దలపై కేసులు నమోదు చేసినట్లు కల్యాణ్ డోంబివలి మున్సిపల్ కార్పొరేషన్ (కేడీఎంసీ) అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
థానే: కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించడంతో పాటు చాలా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. పెళ్లిళ్ల వంటి శుభకార్యాలకు కూడా 50 మందికి మించి హాజరు కావొద్దని ప్రభుత్వాలు ఆంక్షలు విధించాయి. కానీ ప్రభుత్వ ఆంక్షలను బేఖాతరు చేస్తూ థానే జిల్లాలోని కల్యాణ్‌లో జరిగిన ఓ పెళ్లికి ఏకంగా 700 మంది అతిథులు హాజరయ్యారు. దీనికి సంబంధించి పెళ్లి పెద్దలపై కేసులు నమోదు చేసినట్లు కల్యాణ్ డోంబివలి మున్సిపల్ కార్పొరేషన్ (కేడీఎంసీ) అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
ఈ పెళ్లి మార్చి 10న జరిగిందని, ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో అతిథులు వచ్చారని తెలియగానే కేడీఎంసీ అధికారులు సంఘటనా స్థలికి వెళ్లి పరిశీలించారని, అప్పుడు అక్కడ 700 మంది వరకు ఉన్నారని అధికారులు వెల్లడించారు. పెళ్లికి హాజరైనవారు మాస్కులు ధరించలేదని, భౌతికదూరం సహా ఎలాంటి కోవిడ్–19 నిబంధనలు పాటించలేదని పేర్కొన్నారు. దీంతో పెళ్లి జరిపించిన రాజేశ్ మాత్రే, మహేశ్ రావూత్‌లపై కేసులు నమోదు చేశామన్నారు. అలాగే గత పది రోజుల్లో కరోనా నిబంధనలు పాటించని 1,131 మంది నుంచి రూ.5,64,900 జరిమానా వసూలు చేసినట్లు అధికారులు వెల్లడించారు.