కనిపించే దైవం: 60 ఏళ్లుగా ఉచిత వైద్యం | 87 old doctor braves Covid-19 to treat villagers in Maharashtra | Sakshi
Sakshi News home page

కనిపించే దైవం: 60 ఏళ్లుగా సైకిలు పైనే ఇంటింటికీ

Oct 23 2020 12:27 PM | Updated on Oct 23 2020 12:48 PM

87 old doctor braves Covid-19 to treat villagers in Maharashtra - Sakshi

సాక్షి, ముంబై : ప్రాణాంతక కరోనా వైరస్ సమయంలో తమ జీవితాలను పణంగా పెట్టి మరీ వైద్యులు, ఇతర సిబ్బంది తమ అమూల్యమైన సేవలందిస్తున్నారు. అనేకమందిని కాపాడుతున్నారు.  తాజాగా మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాకు చెందిన రాంచంద్ర దండేకర్ (87) మరింత ఆదర్శంగా నిలుస్తున్నారు.  కరోనావైరస్ మహమ్మారికి భయంతో చాలామంది సీనియర్ సిటిజన్లు ఇంటినుంచి బయటికి రావాలంటే వణికిపోతున్నారు. కానీ ఈ సీనియర్ వైద్యుడు మాత్రం మారుమూల గ్రామాల్లో పర్యటిస్తూ రోగుల వద్దకే వెళ్లి ఉచితంగా తన సేవలందించడం విశేషం. 

వైద్యులు దేవుడితో సమానమనే మాటకు నిలువెత్తు నిదర్శనం రాంచంద్ర దండేకర్. ప్రస్తుత ఆరోగ్య సంక్షోభ సమయంలో కూడా దీన్ని అక్షరాలా నిజం చేస్తున్నారు. హోమియోపతి, ఆయుర్వేద వైద్యుడైన రాంచంద్ర కరోనా బారిన పడ్డ వారితోపాటు, ఇంటింటికి వెళ్లి నిరుపేదలకు సేవలందిస్తున్నారు. కరోనా సోకినట్టు అనుమానం వస్తే.. సంబంధిత రోగులకు మార్గనిర్దేశనం చేస్తున్నారు. ఇందుకోసం తన సైకిలుపై రోజుకి 10 కిలోమీటర్లు ప్రయాణిస్తారు. కనీసం చెప్పులుకూడా లేకుండానే గత 60 ఏళ్లుగా సైకిలు పైనే వెళ్లి మరీ చికిత్స అందిస్తున్నారట. 

ఎప్పటిలాగానే తన పనితాను చేస్తున్నానని దండేకర్ చెప్పుకొచ్చారు. గ్రామీణ పేదలకు నిస్వార్థంగా సేవచేయడం కొనసాగించాలనుకుంటున్నానని తెలిపారు. ప్రతి గ్రామంలో రోజుకు 20 ఇళ్లను సందర్శిస్తారని దండేకర్ కుమారుడు గర్వంగా చెబుతున్నారు. తన వెంట మొబైల్ ఫోన్, కనీసం వాచ్ కూడా తీసుకెళ్లరని వెల్లడించారు. మరీ దూర ప్రాంతాలకు వెళ్లవలసి వస్తే.. బస్సులో వెళ్లి, అక్కడ మళ్లీ సైకిల్ మీదే తన సేవలను కొనసాగిస్తారనీ, ఆలస్యమైతే గ్రామంలోనే ఎవరో ఒకరి ఇంట్లో విశ్రాంతి తీసుకుని మరునాడు ఇంటికి వస్తారని తెలిపారు. అందుకే ఆయన్ను అంతా 'డాక్టర్ సహబ్ ముల్ వాలే' అని పిలుచుకుంటారు.

1957-58లోనాగ్‌పూర్ కాలేజ్ ఆఫ్ హోమియోపతి నుంచి డిప్లొమా పూర్తి చేసిన దండేకర్ చంద్రపూర్ హోమియోపతి కళాశాలలో లెక్చరర్‌గా సంవత్సరం పనిచేశారు. ఆ తరువాత మారుమూల గ్రామాల్లో వైద్య సేవ చేయాలని నిర్ణయించుకున్నారు. కరోనా పేరుతో కార్పొరేట్ ఆసుపత్రుల నుంచి, సామాన్య వైద్యులదాకా అందిన కాడికి దోచేస్తున్నఈ తరుణంలో రాంచంద్ర సేవలపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా దేశంలో కోవిడ్-19 అత్యంత ప్రభావిత రాష్ట్రంగా మహారాష్ట్ర కొనసాగుతోంది.  కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం రాష్ట్రంలో ఇప్పటివరకు 42,633 మంది మరణించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement