
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆప్ సిట్టింగ్ ఎమ్మెల్యే సహా ఆప్ మాజీ ఎమ్మెల్యే తాజగా బీజేపీలో చేరారు. వీరితో పాటుగా పలువురు ఆప్ నేతలు, కార్యకర్తలు కూడా కాషాయ కండువా కప్పుకున్నారు.
కాగా, ఆప్ ఎమ్మెల్యే కర్తార్ సింగ్ తన్వార్, మాజీ ఎమ్మెల్యే రాజ్ కుమార్ ఆనంద్.. ఈరోజు బీజేపీలో చేరారు. ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా, జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్ సమక్షంలో వీరు బీజేపీలో చేరారు. ఈ నేపథ్యంలో కమలం పార్టీ నేతలు వారికి పార్టీ కండువాలు కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. ఛతర్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తన్వార్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. మరోవైపు, పటేల్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి ఆనంద్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక.. దళిత వర్గానికి చెందిన ఆనంద్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని గత ఆప్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.
#WATCH | Sitting AAP MLA Kartar Singh Tanwar joins BJP, in Delhi. pic.twitter.com/Rw3KIedu5p
— ANI (@ANI) July 10, 2024
ఇదిలా ఉండగా.. ఢిల్లి లిక్కర్ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కేజ్రీవాల్ ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ కారణంగా ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆప్ ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేదు. అన్ని స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు.