న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ నేత, పంజాబ్ మంత్రి హర్జోత్ సింగ్ బెయిన్స్ త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారిణి జ్యోతి యాదవ్‌ను ఆయన మనువాడనున్నారు. వీరి వివాహం ఈ నెల చివర్లో జరగనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అంతేగాక ఇటీవలె ఈ జంట నిశ్చితార్థం కూడా చేసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే వివాహ బంధంతో ఒకటై కొత్త జీవితాన్ని ప్రాంభించనున్న హర్జోత్ సింగ్, జ్యోతి యాదవ్‌లకు పంజాబ్ అసెంబ్లీ స్పీకర్ కుల్తార్ సింగ్ సంధ్వన్ అభినందనలు తెలిపారు.
రూపానగర్ జిల్లాలోని ఆనంద్‌పూర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి తొలిసారి శాసనసభకు ఎన్నికైన హర్జోత్ సింగ్ ప్రస్తుతం భగవంత్ మాన్ కేబినెట్‌లో విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. అనంతర్‌పూర్ సాహిబ్‌లోని గంభీపూర్ గ్రామానికి చెందిన 32 ఏళ్ల బైన్స్.. రాజకీయాల్లోకి రాకముందు వృత్తిరీత్యా అడ్వకేట్. పంజాబ్ యూనివర్సిటీ నుంచి 2014లో బీఏ ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. అంతేగాక 2018లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ లాలో సర్టిఫికెట్ పొందారు.
పంజాబ్ ఆప్ యూత్ వింగ్ అధ్యక్షుడిగా పనిచేశారు. 2017లో జరిగిన ఎన్నికల్లో సాహ్నేవాల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. తరువాత 2022లో జరిగిన ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక హర్యానాలోని గురుగ్రామ్‌కు చెందిన జ్యోతి యాదవ్. పంజాబ్ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారణి.. ప్రస్తుతం మానస జిల్లా ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నారు.
అంతకుముందు లుథియానాలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా పనిచేస్తున్న సమయంలో లుథియానా సౌత్ ఎమ్మెల్యే రాజిందర్‌పాల్ కౌర్ చిన్నతో వివాదం కారణంగా ఆమె అందరి దృష్టిని ఆకర్షించారు. కాగా పంజాబ్‌లో గతేడాది ఆప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరాష్ట్ర సీఎం భగవంత్ మాన్ గురుప్రీత్ కౌర్‌ను పెళ్లాడారు, ఆప్ ఎమ్మెల్యే నరీందర్ కౌర్ భరాజ్-నరీందర్‌పాల్ సింగ్ సవానా పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం మరో జంట పెళ్లి బంధంతో ఒక్కటి కానున్నారు.
చదవండి: పార్లమెంట్‌లో రాహుల్ వ్యాఖ్యల దుమారం.. క్షమాపణలు చెప్పాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment