
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భారతీయ కొత్త చట్టాలతో బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందని తెలంగాణ హైకోర్టు అదనపు సొలిసిటర్ జనరల్ బి.నర్సింహ శర్మ అన్నారు. బంజారాహిల్స్‌లోని సుల్తాన్ ఉలూం లా కాలేజీలో అన్‌లాకింగ్ ‘కొత్త దిశలు–భారత దేశం క్రిమినల్ చట్టాలు’ అనే అంశంపై ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రాంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలు చాలా బాగున్నాయన్నారు.
ఇవి సామాన్యులకు సత్వర న్యాయం జరిగే విధంగా రూపొందించడం అభినందనీయమన్నారు. గత చట్టాల్లో లేని ఎన్నో అంశాలను ప్రస్తుత చట్టాల్లో ఏర్పాటు చేశారని చెప్పారు. ముఖ్యంగా మహిళలకు, పిల్లలకు ప్రస్తుతం చట్టాల్లో ఎంతో ప్రాధాన్యతనిచ్చారని పేర్కొన్నారు. టెర్రరిస్టు యాక్టివిటీలు, ఆర్గనైజ్డ్ క్రైం చేసే వారికి కఠిన శిక్షలు ఉంటాయని తెలిపారు.
ముఖ్యంగా హిట్ అండ్ రన్ కేసుల్లో ప్రస్తుతం సెక్షన్లలో ప్రమాదానికి కారణమై బాధితులను ఆస్పత్రిలో చేర్చి పోలీసులకు సమాచారం ఇచ్చిన వారికి శిక్ష తగ్గుతుందని.. అలా కాకుండా నిర్లక్ష్యంగా వెళ్లిపోయే వారికి కఠిన శిక్షలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో ఓయూ లా కాలేజీ ప్రొఫెసర్ డాక్టర్ జీబీ రెడ్డి, రిటైర్డ్ ప్రొఫెసర్ కృష్ణమాచారి, లా కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సీహెచ్ వెంకటేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment