దాదర్ (ముంబై): బాంద్రాలోని బ్యాండ్‌స్టండ్ ప్రాంతంలో బీఎంసీకి చెందిన ఉద్యాన వనంలో ‘ట్రీ–హౌస్’ రూపుదిద్దుకుంటోంది. పర్యావరణ శాఖ మంత్రి ఆదిత్య ఠాక్రే సంకల్పంతో ముంబైలో మొదటిసారిగా చేపడుతున్న ఈ ట్రీ–హౌజ్ పర్యాటకులను ఆకట్టుకోనుంది. అందుకు అవసరమైన కోటి రూపాయలు జిల్లా ప్లానింగ్ కమిటీ నిధుల నుంచి సమకూరుస్తున్నారు. పనులు పూర్తయి ట్రీ–హౌస్ వినియోగంలోకి వస్తే స్థానికుతోపాటు పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. కాలక్షేపం కోసం పెద్ద సంఖ్యలో ఇక్కడికి ప్రజలు తరలివచ్చే అవకాశం ఉంది.
ముంబైని స్వచ్ఛంగా, సౌందర్యంగా తీర్చిదిద్దడంతోపాటు పర్యాటక ప్రాంతాలను మరింత అభివృద్ధి చేయాలని ఆదిత్య ఠాక్రే సంకల్పించారు. అందులో భాగంగా ముంబైలో అక్కడక్కడ పర్యాటక, ఉద్యానవనాల్లో అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. అందులో భాగంగా పశ్చిమ బాంద్రాలోని బ్యాండ్‌స్టండ్ సముద్ర తీరం వద్ద ఏర్పాటు చేసిన ట్రీ–హౌస్ పనులు జోరుగా సాగుతున్నాయని బీఎంసీ అసిస్టెంట్ కమిషనర్ కిరణ్ దిఘావ్కర్ అన్నారు. ఇలాంటి ట్రీ–హౌస్ ముంబైలో ఇదే తొలిసారి అని, పర్యాటకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రత్యేకతలివే..
►ట్రీ–హౌస్‌ను పూర్తిగా కలపతో నిర్మిస్తున్నారు. ఇందులోకి నేలపై నుంచి వెళ్లేందుకు నిచ్చెన అందుబాటులో ఉంటుంది. అంతేగాకుండా పక్కనే ఉన్న మరో చెట్టు పైనుంచి కూడా ట్రీ–హౌస్‌లోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
►ఎదురుగా సముద్రం, సుమారు 500 చదరపు మీటర్ల స్ధలంలో దీన్ని నిర్మిస్తున్నారు. ఈ ప్రాంతాన్ని పిల్లలు, పర్యాటకులు, ముంబైకర్లు సందర్శించి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు.
►ఫొటోలు దిగేందుకు సెల్ఫీ పాయింట్ కూడా ఏర్పాటు చేస్తున్నారు.
►పచ్చదనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో పర్యాటకులకు అడవిలో ఉన్న అనుభూతి కలుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment