4 దశాబ్దాల తర్వాత చర్యలు చేపట్టిన ప్రభుత్వం
అత్యంత జాగ్రత్తల మధ్య వ్యర్థాల తరలింపు
వ్యర్థాలను కాల్చేసి, అవశేషాలను పూడ్చడానికి సన్నాహాలు
భోపాల్: భారత దేశ చరిత్రలో అత్యంత దారుణమైన పారిశ్రామిక ప్రమాదంగా నిలిచిన భోపాల్ గ్యాస్ లీకేజీ ఉదంతంలో 40 సంవత్సరాల తర్వాత కీలక ఘట్టం జరిగింది. విషపూరిత గ్యాస్ లీకేజీ తర్వాత ఇంకా యూనియన్ కార్బైడ్ కర్మాగారంలో మిగిలిపోయిన అత్యంత ప్రమాదకర వ్యర్థాల తొలగింపు ప్రక్రియ ఎట్టకేలకు పూర్తయింది.
బుధవారం రాత్రి 9 గంటలపుడు ఏకంగా 337 టన్నుల బరువైన వ్యర్థాలను ప్రత్యేకమైన కంటైనర్లలో జాగ్రత్తగా ప్యాక్‌చేసి 250 కిలోమీటర్ల దూరంలోని వ్యర్థ్యాల దహన కర్మాగారానికి తరలించారు.
గురువారం తెల్లవారుజామున నాలుగు గంటలకు ఈ ట్రక్కులన్నీ ధర్ జిల్లాలోని పీతంపూర్ పారిశ్రామిక వాడకు చేరుకున్నాయని ధర్ ఎస్పీ మనోజ్ సిన్హా చెప్పారు. వ్యర్థాలను దహనం చేసి అందులో ఏరకమైన విష పదార్థలు లేవని నిర్ధారణ చేసుకున్నాకే మిగిలిన అవశేషాలను నేలలో పాతిపెట్టనున్నారు. 1984 డిసెంబర్ రెండో తేదీ రాత్రి భోపాల్‌లోని యూనియన్ కార్బైడ్ పురుగుమందుల కర్మాగారం నుంచి అత్యంత విషపూరితమైన మిథైల్ ఐసోసైనేట్ గ్యాస్ లీక్ అయింది.
అది ఎక్కడి జనాన్ని అక్కడే విగతజీవులుగా మార్చేసిన దారుణోదంతం తెల్సిందే. విష వాయువులు పీల్చి దాదాపు 5,480 మంది అక్క డిక్కడే చనిపోయారు. వేలాది మంది వికలాంగులయ్యారు. విషవాయువును పీల్చిన ఆనాటి తరం వాళ్లకు ఈ నాలుగు దశాబ్దాల కాలంలో లక్షలాది మంది వైకల్యంతో జన్మించారు. ఇంకెందరో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు.
ప్రపంచంలోని అతిపెద్ద పారిశ్రామిక విపత్తులలో ఒకటిగా ఇది నిలిచిపోయింది. అంబులెన్సులు, పోలీసు వాహనాలు, అగ్నిమాపక దళాల ప్రత్యేక పర్యవేక్షణలో వ్యర్థాల తరలింపు ప్రక్రియ జరిగింది. ఇందుకోసం 250 కిలోమీటర్ల పొడవునా గ్రీన్ కారిడార్‌ను ఏర్పాటుచేశారు. విషపూరిత వ్యర్థాలలో మట్టి, పురుగుమందుల అవశేషాలు, తయారీ ప్రక్రియల్లో మిగిలిపోయిన రసాయనాలతో సహా ఐదు రకాల ప్రమాదకరమైన పదార్థాలు ఉన్నాయి.
మందలించిన హైకోర్టు
రాష్ట్ర రాజధానిలోని ఈ కర్మాగారం నుంచి వ్యర్థాలను తొలగించాలని సుప్రీంకోర్టు గతంలోనే పలుమార్లు ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ అధికారులు చర్యలు తీసుకోలేదు. ఫ్యాక్టరీని ఖాళీ చేయకపోవడంపై మధ్యప్రదేశ్ హైకోర్టు ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ ఉదాసీనత కొత్త విషాదానికి దారి తీస్తుందని కోర్టు పేర్కొంది. వ్యర్థాలను తొలగించడానికి నాలుగు వారాల గడువు విధిస్తూ డిసెంబర్ మూడో తేదీన తీర్పునిచ్చింది. వ్యర్థాలను 2025 జనవరి ఆరో తేదీలోపు పూర్తిగా తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలను పాటించకుంటే కోర్టు ధిక్కార చర్యలు తీసుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఈ మేరకు ప్రభుత్వం తరలింపు చర్యలు చేపట్టింది.
అత్యంత భద్రత మధ్య..
వ్యర్థాలను సురక్షితంగా తరలించేందుకు విస్తృత ఏర్పాట్లు చేశారు. కర్మాగారంలో 337 మెట్రిక్ టన్నుల విష వ్యర్థాలున్నాయి. ఆదివారం నుంచే వీటిని మూటలు కట్టే పనులు మొదలుపెట్టారు. వీటిని ప్రత్యేకంగా రూపొందించిన 12 కంటైనర్లలో లోడ్ చేశారు. ప్రతి కంటైనర్‌లో సుమారు 30 టన్నుల వ్యర్థాలను నింపారు. రసాయన చర్యలను నివారించడానికి అత్యంత మందంగా ఉండే పాలిథీన్ సంచుల్లో ప్యాక్ చేశారు.
వ్యర్థాల తరలింపుకోసం కర్మాగారం చుట్టూతా 200 మీటర్ల పరిధిలో ఎవరూ రాకుండా నిషేధం విధించారు. సుమారు 200 మంది కార్మికులు ఈ ప్రక్రియలో నిమగ్నమయ్యారు. పీపీఈ కిట్లు ధరించి కట్టుదిట్టమైన భద్రతా ప్రమానాలను పాటిస్తూ వ్యర్థాలను కంటైనర్లలో నింపారు. బుధవారం రాత్రి 9 గంటలకు 12 కంటైనర్ ట్రక్కులు కర్మాగారం నుంచి బయలుదేరాయి. 50 మంది పోలీసులు కంటైనర్లకు రక్షణ కల్పిస్తున్నారు. అత్యున్నత భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా వ్యర్థాలను తరలిస్తున్నామని పోలీసు కమిషనర్ తెలిపారు.
పీతంపూర్‌లో దహన కర్మాగారం..
పీతంపూర్‌లోని వ్యర్థాల దహన కర్మాగారం రాష్ట్రంలోని ఏకైక అత్యాధునిక కర్మాగారం. దీనిని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డ్ మార్గదర్శకాల ప్రకారం రాంకీ ఎన్విరో ఇంజనీర్స్ నిర్వహిస్తోంది. 2015లో ట్రయల్‌రన్‌లో భాగంగా గంటకు 90 కిలోల వ్యర్థాల చొప్పున 10 టన్నుల యూనియన్ కార్బైడ్ వ్యర్థాలను ప్రయోగాత్మకంగా దహనం చేశారు. ఇది విజయవంతం కావడంతో మిగిలిన వ్యర్థాలను కాల్చేయనున్నారు. భూమికి 25 అడుగుల ఎత్తులో నిర్మించిన ప్రత్యేక వేదికపై వ్యర్థాలను కాల్చనున్నారు. ఈ ప్రక్రియ కోసం కఠినమైన శాస్త్రీయ ప్రోటోకాల్స్‌ను అనుసరిస్తారు. గంటకు 90 కిలోల వ్యర్థాల చొప్పున మొత్తం 337 టన్నుల వ్యర్థాలను కాల్చడానికి సుమారు 153 రోజులు పడుతుంది. ఈ వేగాన్ని గంటకు 270 కిలోలకు పెంచితే 51 రోజుల్లో పూర్తిగా వ్యర్థాలను కాల్చేయొచ్చు.
12 trucks carrying 337 tonnes of toxic waste from the Union Carbide factory in Bhopal, stored for 40 years, left at 9:05 p.m. for Pithampur near Indore. The waste is expected to arrive early on January 2nd, following a 250-km green corridor with heavy security.
📹@MehulMalpani pic.twitter.com/zU78cVRE85— The Hindu (@the_hindu) January 1, 2025
స్థానికుల నుంచి వ్యతిరేకత
2015లో పీతంపూర్‌లో 10 టన్నుల యూనియన్ కార్బైడ్ వ్యర్థాలను ప్రయోగాత్మకంగా కాల్చివేయడం వల్ల సమీప గ్రామాల మట్టి, భూగర్భ జలాలు, నీటి వనరులు కలుషితమయ్యాయని స్థానికులు ఆందోళన తెలిపారు. ఈ నేపథ్యంలో వ్యర్థాల తరలింపునకు స్థానిక ప్రజల నుంచి తీవ్ర నిరసన ఎదురవుతోంది. ఆదివారం పెద్ద సంఖ్యలో ప్రజలు నిరసన ప్రదర్శన చేపట్టారు. వ్యర్థాలను పీతంపూర్‌కు బదులు విదేశాలకు పంపాలని డిమాండ్ చేస్తూ 10కి పైగా సంస్థలు గురువారం బంద్‌కు పిలుపునిచ్చాయి.
తగిన ట్రయల్స్ లేకుండా వ్యర్థాల తొలగింపు ప్రక్రియను ప్రశ్నిస్తూ ఇండోర్‌లోని మహాత్మాగాంధీ మెమోరియల్ హాస్పిటల్ పూర్వ విద్యార్థుల సంఘం వైద్యులు పిటిషన్ దాఖలు చేశారు. అయితే అన్ని అభ్యంతరాలను పరిశీలించిన తర్వాతే వ్యర్థాలను కాల్చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు భోపాల్ ఘటన సహాయక, పునరావాస విభాగ డైరెక్టర్ స్వతంత్ర కుమార్ సింగ్ తెలిపారు. అన్నీ సవ్యంగా జరిగితే, మూడు నెలల్లో వ్యర్థాలను కాల్చివేస్తామని చెప్పారు. ఏదైనా ఆటంకం జరిగితే తొమ్మిది నెలల వరకు పట్టవచ్చ న్నారు. కాల్చిన తర్వాత, వ్యర్థాల బూడిదలో ఏదైనా హానికరమైన మూలకం మిగిలి ఉందా లేదా అని పరిశీలిస్తామని పేర్కొన్నారు. విషపూరిత మూలకాల జాడలు లేవని నిర్ధారించాక బూడిదను భూగర్భజలంతో కలవని రీతిలో భూమిలో పాతిపెడతామన్నారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారుల పర్యవేక్షణలో నిపుణుల బృందం ఈ ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
ఇది కూడా చదవండి: బోరుబావి ప్రమాదాలు.. ఒకసారి విఫలం.. మరోసారి సఫలం
Comments
Please login to add a commentAdd a comment