తల్లి కోసం పోలీసుల్ని వేడుకుంటున్న వ్యక్తి(ఫోటో కర్టెసీ: ఇండియా టుడే)
లక్నో: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. ప్రతి రోజు మూడు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఆస్పత్రల్లో బెడ్లకు, ఆక్సిజన్‌కు తీవ్ర కొరత ఏర్పడింది. ప్రాణవాయువు కోసం పలువురు సోషల్ మీడియా వేదికగా విన్నవిస్తున్నారు. దేశంలో ఆక్సిజన్ కొరతకు అద్దం పట్టే దృశ్యానికి సంబంధించిన వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీనిలో పీపీఈ కిట్ ధరించి.. పోలీసుల ఎదుట మోకాళ్ల మీద కూర్చున్న ఓ వ్యక్తి.. ఆక్సిజన్ సిలిండర్ తొలగించవద్దని.. అలా చేస్తే తన తల్లి మరణిస్తుందని.. దయచేసి సిలిండర్ తొలంగించొద్దని వేడుకుంటున్న హృదయవిదారక దృశ్యాలు అందరినీ కలచివేస్తున్నాయి. ఆ వివరాలు..
ఆగ్రాకి చెందిన మహిళకు కరోనా సోకగా ఆమె కుమారుడు ఓ ప్రైవేట్ ఆస‍్పత్రిలో చేర్పించి ట్రీట్‌మెంట్ ఇప్పిస్తున‍్నాడు. అయితే బాధితురాలికి ఊపిరాడక ఆక్సిజన్ అవసరం ఏర్పడింది. ఈ క్రమంలో ఆమె కుమారుడు ఆక్సిజన్ సిలిండర్ కోసం ఆస్పత్రిలో ఆరా తీసినా ప్రయోజనం లేకుండా పోయింది. అయితే అదే సమయంలో సదరు ప్రైవేట్ ఆస్పత్రి నుంచి పోలీసుల ఆధ్వర్యంలో సిలిండర్లను అంబులెన్స్ లోకి తరలిస్తుండగా ఆ వ్యక్తి పోలీసుల దగ్గరకు వెళ్లి 'సార్ ప్లీజ్ నా తల్లి చనిపోతుంది. దయచేసి ఆక్సిజన్ సిలిండర్లను తీసివేయవద్దు. మీరు నా తల్లిని బ్రతికిస్తే ఎక్కడి నుంచైనా ఆక్సిజన్ సిలిండర్లను తీసుకొస‍్తాను. కరోనా సోకి ఆస్పత్రిలో జాయిన్ అయిన మా అమ్మను ఆరోగ్యంగా ఇంటికి తీసుకొస్తానని కుటుంబసభ్యులకు మాటిచ్చాను’’ అంటూ మోకాళ్లపై కూర్చొని పోలీసుల్ని అర్థించాడు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వ్యక్తి అంతలా ప్రాధేయపడినా పోలీసులు అతడి అభ్యర్థనను పట్టించుకోకుండా సిలిండర్లను తరలించే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోని యూత్ కాంగ్రెస్ తన ట్విట్టర్‌లో షేర్ చేయయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. ఇక పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా ఆగ్రా ఎస్పీ మాట్లాడుతూ.. 'ఆగ్రాలో ఆక్సిజన్ సిలిండర్ల కొరత ఎక్కువగానే ఉంది. కాబట్టే ప్రజలు తమ వ్యక్తిగత సిలిండర్లను ఆస్పత్రికి అందించారు. వీడియోలో కనిపిస్తున్నట్లు అవి ఆక్సిజన్ ఉన్న సిలిండర్లు కాదు. ఖాళీవి. వాటిని తరలించే సమయంలో ఆ యువకుడు ఆక్సిజన్ కావాలని పోలీసుల్ని అభ్యర్ధించాడు' అంటూ ఆగ్రా ఎస్పీ మీడియా సమావేశంలో వెల్లడించారు.
కరోనా బాధితుల్ని ఇలానే ట్రీట్ చేస్తారా యోగీ..
ఆగ్రా ఆస్పత్రి ఘటనపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘తన తల్లిని బ్రతికించుకునేందుకు కొడుకు ఆక్సిజన్ సిలిండర్ల కోసం ప్రాధేయపడుతుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారు. నిజంగా ఇది అమానవీయ చర్య. సీఎం యోగి కరోనా బాధితుల్ని ఇలాగే ట్రీట్ చేస్తారా’’ అంటూ రాహుల్ గాంధీ ప్రశ్నించారు.
ఆస్పత్రుల్లో సరిపడా పడకల్లేక.. ఆక్సీజన్ సిలిండర్లు లేక కరోనా బాధితులు పడుతున్న వెతలు అన్నీ ఇన్నీ కావు. రెండు రోజుల క‍్రితం ఉత్తర్ ప్రదేశ్ ఆగ్రాకు చెందిన రేణు సింఘాల్ కరోనా సోకిన తన భర్త రవి సింఘాల్ కు నోటితో ఊపిరి అందించే ప్రయత్నించారు. ఆ ఊపిరి అందేలోపే భర్త ప్రాణాలు పోయాయనని కన్నీరుమున్నీరుగా విలపించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment