![Air show proof of India's strength in aerospace Says President Kovind - Sakshi](/styles/webp/s3/article_images/2021/02/6/294B.jpg.webp?itok=fn7rH0ZH)
కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్రపతి కోవింద్, కర్ణాటక సీఎం యడియూరప్ప
సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలోని యలహంకలో ఆసియాలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా మూడు రోజులుగా కొనసాగుతున్న 13వ అంతర్జాతీయ వైమానిక ప్రదర్శన శుక్రవారం ముగిసింది. చివరి రోజు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హాజరై, వైమానిక ప్రదర్శనను తిలకించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అంతర్జాతీయ వైమానిక ప్రదర్శనతో భారత ఖ్యాతి ఖండాంతరాలకు వ్యాపించిందని అన్నారు. కోవిడ్–19 పరిస్థితుల్లోనూ వైమానిక ప్రదర్శనను విజయవంతంగా పూర్తి చేశారని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పను ప్రశంసించారు. సుమారు 530 కంపెనీలు వైమానిక ప్రదర్శనలో పాల్గొన్నట్లు చెప్పారు. హైబ్రిడ్ ఫార్మాట్‌లో తొలిరోజు ఏరో షో ప్రారంభించడం గర్వంగా ఉందన్నారు. తేజస్ యుద్ధ విమానాల కోసం హెచ్‌ఏఎల్‌తో రూ.48 వేల కోట్ల ఒప్పందం చేసుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.
అబ్బురపరిచిన విన్యాసాలు
అంతర్జాతీయ వైమానిక ప్రదర్శనలో భాగంగా స్వదేశీ నిర్మిత తేజస్, భారత వాయుసేనకు చెందిన సుఖోయ్, రఫేల్ యుద్ధ విమానాల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. సూర్యకిరణ్, సారంగ్ హెలికాప్టర్ల విన్యాసాలు అలరించాయి. ఈసారి వైమానిక ప్రదర్శనలో అమెరికాకు చెందిన బీఐఓ బాంబర్ విమానం మినహా విదేశీ విమానాలన్నీ పాల్గొన్నాయి. కాగా, కోవిడ్–19 కారణంగా బ్రిటన్, ఐరోపా దేశాలు ప్రదర్శనలో పాల్గొనేందుకు వెనుకడుగు వేశాయి. కానీ, ఆయా దేశాల రక్షణ శాఖ అధికారులు హాజరయ్యారు. విదేశాల నుంచి వచ్చిన బోయింగ్, ఎయిర్‌బస్, లుఫ్తాన్సా, లాక్టిన్‌హెడ్ తదితర కంపెనీలు భారత కంపెనీలతో ఒప్పందం చేసుకుని రూ.వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు రక్షణ శాఖ అధికారులు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment