ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)కి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా తన కుమార్తె సుప్రియా సూలే తోపాటు ప్రఫుల్ పటేల్ లను నియమిస్తున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా అజిత్ పవార్ ను కాదని సుప్రియా సూలే, ప్రఫుల్ పటేల్ లకు పార్టీ పగ్గాలు అప్పగించడంపై ఒకే వ్యక్తికి అన్ని బాధ్యతలు అప్పగించడం కూడా సరికాదని క్లారిటీ కూడా ఇచ్చారు శరద్ పవార్.
అయిష్టంగానే శుభాకాంక్షలు..
పార్టీ అధ్యక్ష పదవి దక్కనందుకు ఆయన మేనల్లుడు సీనియర్ నేత అజిత్ పవార్ అసంతృపిగా ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ల ప్రకటన అనంతరం మీడియాతో మాట్లాడకుండానే అక్కడి నుండి వెళ్లిపోయారు. కానీ కొద్దిసేపటికి ట్విట్టర్ ద్వారా నూతనంగా ఎంపికైన వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే, ప్రఫుల్ పటేల్ లకు శుభాకాంక్షలు తెలిపారు.
అయితే ప్రకటన సమయంలోనే విలేఖరులు అజిత్ పవార్ విషయమై ప్రస్తావించగా శరద్ పవార్ మాటలాడుతూ.. ఆయన ఇప్పటికీ పార్టీలో చాలా కీలకమైన వ్యక్తి. ఆయనపై చాలా బాధ్యతలున్నాయి. ఒకే వ్యక్తికి అన్ని బాధ్యతలు అప్పగించడం కూడా సరికాదని అన్నారు.
ఫ్లాష్ బ్యాక్..
2019 ఎన్నికల్లో బీజేపీతో చేతులు కలిపి ఆనాటి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కు డిప్యూటీగా కూడా పనిచేశారు అజిత్ పవర్. పార్టీ చీలిపోతుందేమోనని స్వయంగా శరద్ పవార్ రంగంలోకి దిగి బుజ్జగించిన తర్వాతగానీ ఆయన వెనక్కి తగ్గలేదు.
ఇక నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి కొత్తగా ఎంపికైన వర్కింగ్ ప్రెసిడెంట్లలో తన కుమార్తె సుప్రియా సూలేకు పంజాబ్, హర్యానాలతోపాటు మహారాష్ట్ర బాధ్యతలు కూడా అప్పగించగా ప్రఫుల్ పటేల్ కు మధ్యప్రదేశ్, రాజస్థాన్, గోవా, గుజరాత్, జార్ఖండ్ బాధ్యతలను అప్పగించారు పవార్. ఇకపై వీరిద్దరే దేశవ్యాప్తంగా పార్టీ వ్యవహారాలన్నీ చక్కబెడతారని ఆయనన్నారు.
ఇది కూడా చదవండి: గాడ్సే భరతమాత ముద్దుబిడ్డ.. కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment