దేశంలో పలు విమానాలకు బాంబు బెదిరింపు ఘటనలు ఎక్కువయ్యాయి. గత మూడు రోజుల్లో అనేక విమానాలకు బాంబు బెదరింపు కాల్స్ రావడం తీవ్ర కలకలం రేపుతోంది. మంగళవారం ఏకంగా పలు సంస్థలకు చెందిన ఏడు విమానాలకు ఇలాంటి బెదిరింపులు వచ్చినన విషయం తెలిసిందే. మొత్తం గత 72 గంటల్లో 12 విమానాలకు ఈ బెదిరింపులు వచ్చాయి.
తాజాగా బెంగళూరు వెళ్తున్న అకాశా ఎయిర్ ఫ్లైట్, ఢిల్లీకి వస్తున్న ఇండిగో విమానానికి గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు.ఆకాశా ఎయిర్‌లైన్ సంస్థకు చెందిన QP 1335 విమానం 184 మంది ప్రయాణికులు, సిబ్బందితో బుధవారం ఢిల్లీ నుంచి బెంగళూరుకు బయల్దేరింది. విమానం టేకాఫ్ అయిన వెంటనే బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని తిరిగి ఢిల్లీకి మళ్లించారు. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో మధ్యాహ్నం 2 గంటలకు సురక్షితంగా ల్యాండ్ చేశారు. అనంతరం విమానంలో అధికారులు తనిఖీలు చేపట్టారు.
అదే విధంగా ముంబై నుంచి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానానికి కూడా ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. 6E 651 విమానం దాదాపు 200 మంది ప్రయాణికులు, సిబ్బందితో ముంబై నుంచి బయల్దేరగా.. సోషల్ మీడియా ద్వారా బెదిరింపు అలర్ట్ వచ్చింది. దీంతో పైలట్ విమానాన్ని అహ్మదాబాద్‌కు మళ్లించారు. అక్కడ విమానం సేఫ్‌గా ల్యాండ్ అయినట్లు ఇండిగో ప్రతినిధి ఒకరు తెలిపారు. అనంతరం విమానంలో తనిఖీలు చేపట్టగా బెదిరింపు కాల్స్ బూటకమని తేలింది.
48 గంటల్లో 10 విమానాలకు బాంబు బెదిరింపులు
మంగళవారం ఢిల్లీ-చికాగో ఎయిర్ ఇండియా విమానం, జైపూర్-బెంగళూరు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, దమ్మం-లక్నో ఇండిగో విమానం, దర్భంగా-ముంబై స్పైస్‌జెట్ విమానం, సిలిగురి-బెంగళూరు అకాశ ఎయిర్ విమానం, అలయన్స్ ఎయిర్ అమృత్‌సర్-డెహ్రాడూన్-ఢిల్లీ విమానం, మధురై నుంచి సింగపూర్ వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం సహా ఏడు విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి.
సోమవారం రెండు ఇండిగో, ఎయిరిండియా విమానాలకు ఇలాంటి నకిలీ బాంబు బెదిరింపులు వచ్చాయి. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీలు పోలీసులతో కలిసి బెదిరింపుల వెనుక ఉన్న నిందితులను కనిపెట్టడానికి పని చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment