‘బాబ్రీ’ తీర్పు: అందరూ నిర్దోషులే | All acquitted in Babri Masjid demolition case | Sakshi
Sakshi News home page

అందరూ నిర్దోషులే

Published Thu, Oct 1 2020 2:30 AM | Last Updated on Thu, Oct 1 2020 11:22 AM

All acquitted in Babri Masjid demolition case - Sakshi

లక్నో: దాదాపు మూడు దశాబ్దాల సుదీర్ఘ విచారణకు తెరపడింది. దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టించిన అయోధ్యలోని బాబ్రీమసీదు కూల్చివేత కేసులో తీర్పు వెలువడింది. మసీదు కూల్చివేతకు కుట్ర పన్నారని ఆరోపణలు ఎదుర్కొన్న నిందితులంతా నిర్దోషులేనని సీబీఐ ప్రత్యేక కోర్టు బుధవారం స్పష్టం చేసింది.

వారిలో బీజేపీ అగ్రనేత, నాటి రామ మందిర నిర్మాణ ఉద్యమ రథ సారథి ఎల్‌కే అడ్వాణీ(92), బీజేపీ సీనియర్‌ నేతలు మురళీ మనోహర్‌ జోషి(86), ఉమా భారతి, మసీదు కూల్చివేత సమయంలో యూపీ ముఖ్యమంత్రిగా ఉన్న కళ్యాణ్‌ సింగ్, వీహెచ్‌పీ నేత వినయ్‌ కటియార్, సాధ్వి రితంబర,  ప్రస్తుతం అయోధ్యలో రామాలయ నిర్మాణ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌.. తదితరులు ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి మొత్తం 49 మందిపై సీబీఐ అభియోగాలు నమోదు చేయగా.. 28 ఏళ్ల సుదీర్ఘ విచారణ సమయంలో 17 మంది చనిపోయారు.

మిగిలిన 32 మందిని నిర్దోషులని సీబీఐ ప్రత్యేక కోర్టు తాజాగా తీర్పు ప్రకటించింది. మసీదు కూల్చివేతకు నిందితులు కుట్ర పన్నినట్లుగా ఎలాంటి స్పష్టమైన, విశ్వసనీయ సాక్ష్యాధారాలు లేవని పేర్కొంది. పైగా, అందులో రామ్‌లల్లా విగ్రహం ఉన్నందున, ఆ నిర్మాణాన్ని కాపాడేందుకు విశ్వహిందూ పరిషత్‌ నేత దివంగత అశోక్‌సింఘాల్‌  ప్రయత్నించారని దాదాపు 2,300 పేజీల తీర్పులో సీబీఐ న్యాయమూర్తి ఎస్‌కే యాదవ్‌ వెల్లడించారు. నిందితులంతా రూ. 50 వేల వ్యక్తిగత బాండ్‌ను కోర్టుకు సమర్పించాలని ఆదేశించారు. విచారణ సమయంలో కూల్చివేత ఘటన నాటి వార్తాకథనాలను కానీ, వీడియో క్యాసెట్‌లను న్యాయమూర్తి సాక్ష్యాలుగా పరిగణించలేదు. ఒరిజినల్‌ కాపీలు కానందున వాటిని సాక్ష్యాలుగా పరిగణించలేదన్నారు. కోర్టుకు సమర్పించిన వీడియోలు కూడా స్పష్టంగా లేవన్నారు. అలాగే, నెగెటివ్స్‌ సమర్పించనందున, ఘటనకు సంబంధించిన ఫొటోలను కూడా సాక్ష్యాలుగా పరిగణించలేమన్నారు.  

లాస్ట్‌ వర్కింగ్‌ డే
దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొనడంతో సీబీఐ కోర్టు ఉన్న ప్రాంగణంలో కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. మధ్యాహ్నం 12:10 గంటలకు న్యాయమూర్తి ఎస్‌కే యాదవ్‌ న్యాయస్థానంలోకి వచ్చారు. ఆ తరువాత, 10 నిమిషాల్లోనే నిందితులంతా నిర్దోషులేనని పేర్కొంటూ తీర్పు ఆపరేటివ్‌ భాగాన్ని వెలువరించారు. న్యాయమూర్తి ఎస్‌కే యాదవ్‌కు బుధవారం చివరి పని దినం కావడం గమనార్హం.  

26 మంది హాజరు
తీర్పురోజు నిందితులంతా కోర్టుకు హాజరు కావాలని జడ్జి గతంలో ఆదేశించారు. కానీ, కరోనా, తదితర కారణాలతో పలువురు హాజరు కాలేదు. జీవించి ఉన్న 32 మంది నిందితుల్లో 26 మంది హాజరయ్యారు. తీర్పు ప్రకటిస్తున్న సమయంలో కోర్టుహాళ్లో ఉన్న కొందరు నిందితులు జడ్జి ముందే గట్టిగా ‘జై శ్రీరాం’ అంటూ నినాదాలు చేశారు. నిందితుల్లో వృద్ధాప్య కారణాలు చూపుతూ అద్వానీ, ఎంఎం జోషి, మహంత్‌ నృత్యగోపాల్‌దాస్‌ కోర్టుకు హాజరు కాలేదు. కళ్యాణ్‌ సింగ్, ఉమాభారతిలకు కరోనా సోకడంతో రాలేదు.

విచారణ ఇలా..
విచారణ సమయంలో 351 మంది సాక్ష్యులను, 600 పత్రాలను సీబీఐ కోర్టుకు సమర్పించింది. 49 మందిని నిందితులుగా చేర్చింది. వారిలో విచారణ సాగుతుండగా వీహెచ్‌పీ అగ్రనేత అశోక్‌ సింఘాల్, శివసేన చీఫ్‌ బాలాసాహెబ్‌ ఠాక్రే,  విజయరాజె సింధియా తదితర 17 మంది చనిపోయారు.  రోజువారీ విచారణ జరపాలని, రెండు సంవత్సరాల్లోగా విచారణ ముగించాలని సీబీఐ ప్రత్యేక కోర్టును ఆదేశించింది. నిందితులు మసీదు కూల్చివేతకు కుట్ర పన్నడంతోపాటు కరసేవకులను రెచ్చగొట్టారని సీబీఐ వాదించింది.  

విగ్రహాలను పూజారి కాపాడారు: మసీదును దుండగులు కూల్చివేస్తున్న సమయంలో గర్భాలయంలో ఉన్న రామ్‌లల్లా విగ్రహం, ఇతర విగ్రహాలను అక్కడి పూజారి సత్యేంద్ర దాస్‌ బయటకు తీసుకువెళ్లారని,  దీనిబట్టి, మసీదు కూల్చివేత ముందస్తు ప్రణాళికతో జరిగింది కాదని అర్థమవుతుందని నిందితుల తరఫు న్యాయవాది విమల్‌  శ్రీవాస్తవ వాదించారు. వివాదాస్పద ప్రాంతానికి 200 మీటర్ల దూరంలోని రామకథ కుంజ్‌ వద్ద వేదికపై నుంచి కూల్చివేత వద్దంటూ వీహెచ్‌పీ నేతలు, ఇతర నాయకులు ఇస్తున్న సూచనలను దుండగులు పట్టించుకోలేదన్నారు. కూల్చివేతను అడ్డుకునేందుకు అశోక్‌ సింఘాల్‌ ప్రయత్నించారన్నారు. మతపరమైన విశ్వాసంతో లాంఛనప్రాయంగా కరసేవ చేయాలనేదే నాయకుల ఉద్దేశమని, కాని కొందరు దురుద్దేశపూరితంగా దీన్ని భగ్నం చేసి, కూల్చివేతకు పాల్పడ్డారని వివరించారు. సీబీఐ కోర్టుకు సమర్పించిన వీడియోలు సీల్‌ అయి లేవని, అవి నిజమైనవా? కాదా? అని లాబ్‌లో పరీక్షించలేదని పేర్కొన్నారు.   

ముందు నుంచీ చెబుతున్నాం..
మసీదును కూల్చేందుకు కుట్ర పన్నారనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని, ఎల్‌కే అద్వానీ, ఎంఎం జోషి, కళ్యాణ్‌ సింగ్, ఉమాభారతి తదితర నిందితులపై తప్పుడు కేసు పెట్టారని ముందు నుంచీ చెబుతున్నామని డిఫెన్స్‌ లాయర్‌ విమల్‌ కుమార్‌ శ్రీవాస్తవ తీర్పు అనంతరం మీడియాతో వ్యాఖ్యానించారు. అప్పుడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వ ఒత్తిడితో ఆ కేసు పెట్టారని, ఈ తాజా తీర్పు న్యాయానికి లభించిన విజయమని ఆయన పేర్కొన్నారు.  

అప్పీల్‌కు వెళ్లడంపై..
ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పుపై సీబీఐ పై కోర్టులో అప్పీల్‌ చేస్తుందా? అన్న ప్రశ్నకు సీబీఐ న్యాయవాది లలిత్‌ సింగ్‌ జవాబిస్తూ.. ఈ తీర్పు కాపీని ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయానికి పంపిస్తామని, తీర్పును సీబీఐ న్యాయ విభాగం అధ్యయనం చేసిన తరువాత అప్పీల్‌కు వెళ్లడంపై తుది నిర్ణయం ఉంటుందని తెలిపారు.

మంచిదే: అన్సారీ
సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పుపై రామజన్మభూమి– బాబ్రీ మసీదు భూ యాజమన్య హక్కు కేసులో ప్రధాన కక్షిదారు అయిన ఇక్బాల్‌ అన్సారీ పేర్కొన్నారు. ‘అందరినీ నిర్దోషులుగా ప్రకటించారు. మంచిదే. జరగాల్సిందంతా గత సంవత్సరం నవంబర్‌ 9ననే జరిగింది. అదే రోజు ఈ కేసు కూడా ముగిస్తే ఇంకా బావుండేది’ అని వ్యాఖ్యానించారు. రామజన్మభూమి– బాబ్రీ మసీదు కేసులో రామజన్మభూమికి అనుకూలంగా 2019లో సుప్రీంకోర్టు తీర్పునివ్వడం తెల్సిందే.

మా విశ్వాసం నిలబెట్టింది
తీర్పువినగానే జై శ్రీరాం అని అడ్వాణీ నినదించారు. ‘రామ జన్మభూమి ఉద్యమంపై నా నమ్మకాన్ని, బీజేపీ విశ్వాసాన్ని, మా నిబద్ధతను ఈ తీర్పు సమర్థించింది’ అని అన్నారు. ‘అయోధ్యలో భవ్యమైన రామమందిర నిర్మాణం నా చిరకాల స్వప్నం. అందుకు వీలు కల్పించే గత నవంబర్‌ 29 నాటి సుప్రీంకోర్టు తీర్పు తరువాత.. అదే స్ఫూర్తితో ఈ తీర్పు రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఇక, అయోధ్యలో అద్భుతమైన రామ మందిర నిర్మాణం పూర్తి కావడం కోసం లక్షలాది భక్తులతో పాటు నేను ఎదురు చూస్తున్నా’ అన్నారు. అయోధ్య ఉద్యమ సమయంలో తనకు సహకరించిన పార్టీ కార్యకర్తలు, నాయకులు, స్వామీజీలు, అందరికీ అద్వానీ కృతజ్ఞతలు తెలిపారు. తీర్పు తరువాత తన ఇంటి నుంచి బయటకు వచ్చి, అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులను, అభిమానులను ఆయన జైశ్రీరాం అంటూ పలకరించారు.

ఆ 32 మంది వీరే..
1, ఎల్‌కే అడ్వాణీ, 2. మురళీ మనోహర్‌ జోషి, 3. కళ్యాణ్‌ సింగ్, 4. ఉమాభారతి, 5. వినయ్‌ కతియార్, 6. సాక్షి మహరాజ్, 7. సాధ్వి రితంబర, 8. మహంత్‌ నృత్య గోపాల్‌ దాస్, 9. రామ్‌విలాస్‌ వేదాంతి, 10. చంపత్‌ రాయ్, 11. సతీష్‌ ప్రధాన్, 12. ధరమ్‌ దాస్, 13. బ్రిజ్‌ భూషణ్‌ సింగ్, 14. పవన్‌ కుమార్‌ పాండే, 15. జై భగవాన్‌ గోయల్, 16. లల్లూ సింగ్, 17. జైభాన్‌ సింగ్‌ పావాయా, 18. ఆచార్య ధర్మేంద్ర దేవ్, 19. రాంజీ గుప్తా, 20. ప్రకాశ్‌ శర్మ, 21. ధర్మేంద్ర సింగ్‌ గుర్జార్, 22. ఆర్‌ఎం శ్రీవాస్తవ, 23. సతీష్‌ ప్రధాన్‌

కరసేవకులు: 24. రామ్‌ చంద్ర ఖత్రి, 25. సుధీర్‌ కక్కర్, 26. అమన్‌ నాథ్‌ గోయల్, 27. సంతోష్‌ దుబే, 28. వినయ్‌ కుమార్‌ రాయ్, 29. కమలేష్‌ త్రిపాఠి, 30. గంధి యాదవ్, 31, విజయ్‌ బహదూర్‌ సింగ్, 32. నవీన్‌ భాయ్‌ శుక్లా.

తీర్పు వెలువడ్డాక వారణాసిలో మిఠాయిలు తినిపించుకుంటున్న ముస్లిం మహిళా ఫౌండేషన్‌ సభ్యులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement